Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాచరిక వ్యవస్థలో, అదీ యుద్ధ సమయాల్లో కత్తులు దూసేవారు. చంపడమో, చావడమో ఉండేది. నేడు 'గన్ కల్చర్'పై చర్చ జరుగుతున్న అమెరికాలో నిన్న గెలిచిన బైడెనో, ఓడిన ట్రంపో, చివరికి అప్పటిదాకా హాలీవుడ్లో కౌబారు వేషాలు వేసి ఆ తర్వాత 1980లో అమెరికా అధ్యక్షుడైన రీగన్ సైతం తుపాకులు ధరించి ప్రజల ముందుకొచ్చిన ఘటనలు లేవు. అదేం వింతో గాని భారత ''ప్రజాస్వామ్యం''లో తల్వార్ ఎత్తి అభివాదం చేయడం పాలకపార్టీల్లో రొటీనైపోయింది. టీపీసీసీ అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డి నుంచి కేంద్ర మంత్రి పదవి నిలబెట్టుకోవడమే గాక ఒకింత పదోన్నతి కూడా పొందిన కిషన్‌రెడ్డి వరకు ఆ ఆనవాయితీ పాటిస్తూనే ఉన్నారు. భారత శిక్షాస్మృతి ప్రకారం శిక్కులు తప్ప మిగతావారెవరూ ఆరంగుళాల చురకత్తి కూడా ధరించరాదు. అయినా బీజేపీ పుణ్యాన తల్వార్లు, అధునాతన తుపాకులు సైతం ధరించి ప్రదర్శనలు జరపడం ఉత్తర భారతదేశంలో యథేచ్ఛగా సాగిపోతూనే ఉంది. ఆయుధాలు పట్టుకున్న దేవుళ్ళనే రంగంలోకి దింపేసిన తర్వాత రాజకీయ నేతులు కత్తులూ, కటార్లు పట్టుకుని ఊరేగడాన్ని నియంత్రించే ధైర్యం ఎవరికుంటుంది?
అధికారానికీ, పదవులకు అలవాటు పడ్డవారికి ఆ రెండూ లేకపోతే మత్తుమందు ఇవ్వకుండా పెద్దాపరేషన్ చేయించుకున్నంత బాధ! మన రాష్ట్రంలో ఒక పార్టీ, కేంద్రంలో మరో పార్టీ అధికారంలో కొంత పాతుకుపోయినట్టే కనపడుతూ ఉండటంతో ఇటు దూకితే బెటరా? అటే దూకేస్తే ఇంకా మేలా? అని లెక్కలేసుకోవడం, లాభనష్టాలు బేరీజు వేసుకోవడం కొందరికి రివాజుగా మారింది. 'గోపి' అనే కొత్త 'వంగడం' తయారీలో ఇదో కీలకాంశం. అప్పుడెప్పుడో ఇందిరమ్మ హయాంలో 'ఆయారాం, గయారాం' అనే మాట ఉనికిలో ఉండేది. సరళీకృత ఆర్థిక విధానాలు దాన్నెప్పుడో మింగేసినాయి. ''అభివృద్ధి'' పేరు మీద, అంటే కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి చూసి అని ఒక 'జంప్ జిలానీ' ఇటు దూకితే మోడీ చేస్తున్న 'అభివృద్ధి' చూసి అన్న సాకుతో ఈటల లాంటి జిలానీలు అటు దూకారు. నేడు చాలా మందికి సంపాదనా మార్గం రాజకీయం. లేదా దోచేసుకున్న దాన్ని దాచేసుకోవడానికి రాజకీయ పార్టీలు అవసరం. ప్రజలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడటం అనే దాని స్థానంలో తాయిలాల పందారం, ఎవరెక్కువ చేస్తారనేదే నేటి రీతి. ఆ విధంగా చేయగల్గినవాడే గెలుపు గుర్రాలపై దౌడు తీయగలుగుతున్నాడనేది 'నీతి'.
ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడైనాక రాష్ట్రంలో సత్తా చాటుతానని చెప్పడాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. బహుశా కత్తులు దూయడం దానికి సింబాలిజమే కావచ్చు. అయితే ఏ విధానాలు అవలంబిస్తారనేది కీలక ప్రశ్న. ఇక విధానాల్లో తేడాలేనప్పుడు '56 అంగుళాల ఛాతి' చూడు, విశ్వగురు వేషం చూడు వంటివే మిగులుతాయి. అవే మిగిలాయి కూడ! ఆర్థిక వ్యవస్థ పతనోన్ముఖ పయనం ఆగలేదు. పారిశ్రామిక వృద్ధి సూచి (ఐ.ఐ.పి.) పైకి కదలట్లేదు. నిరుద్యోగం కొత్త రికార్డులు బద్దలు కొడ్తోంది. ధరలు చుక్కలంటుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సామాన్యుల బతుకులు చితికిపోతున్నాయి. ఆపైన కరోనా కాటు పడింది. సుమారు నాలుగు లక్షల మంది మరణించినా గంగలో మునగడం, గోమూత్రం తాగడం వంటి వైద్యాన్ని ప్రిస్కౖృెబ్ చేసే పాలకులు బహుశా ప్రపంచంలో ఒక్క మనదేశంలోనే అఘోరించారు.
మూల విరాట్ క్షేమంగా ఉండటానికి ఈ పరిస్థితి 'నరబలి' కోరింది. ఓ డజను మంది అమాత్యులపై వేటు వేశారు. రానున్న రాష్ట్రాల ఎన్నికల మంత్రి మండలి కూర్చబడింది. ఇదంతా బీజేపీ సంస్థాగతం, వారిష్టం. మంత్రి పదవి వచ్చినవారు కిషన్‌రెడ్డిలా ''నవ భారత నిర్మాణం''లో భాగస్వాములవుతామని, ''మోడీ స్వప్నాలను సాకారం'' చేస్తామని ప్రకటించారు. ఇటువంటి కైవారమే, అంటే స్తుతించడం, లేదా భజన చేయడం కొందరు పదవులు దక్కినవారు, నిలబెట్టుకున్న వారు చేస్తూంటారు. మోడీ నామ సంకీర్తన విడిగానో, కోరస్గానో చేస్తారు. దాదాపు అన్ని బూర్జువా పార్టీల్లో పరిస్థితి ఇదే అయినా బీజేపీలో పరాకాష్టను చూస్తాం. మంత్రులంతా ఉత్సవ విగ్రహాలేననేది సర్వత్రా వినపడుతున్న మాట. 'నవ భారత నిర్మాణం' అంటే గత చరిత్రను చెరిపేయడం. అందుకు సాక్షీభూతంగా నిలిచిన నిర్మాణాలన్నింటినీ, చివరికది పార్లమెంటు భవనమైనా కూల్చేయడం, బ్రిటిష్‌వారికి లొంగిపోయిన వారిని, క్షమాభిక్ష వేడుకుని అండమాన్ జైలు నుండి బయటపడ్డ వారిని అత్యున్నత దేశభక్తులుగా అందలం ఎక్కించడమే మోడీ న్యూ ఇండియా! క్రమంగా దేశాన్ని హిందూ దేశంగా మార్చాలని ఆర్సెసెస్ 1925 నాటి కల. మోడీ స్వప్నించే భారతదేశమిదే. నెమ్మదిగా ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. సీఏఏ, ఎన్ఆర్సీలు దాన్లోభాగమే. ఉమ్మడి పౌరస్మృతి ఒక్కటే మిగిలి ఉంది. మొన్న ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్య ఆ ప్రమాదం ఎంతో దూరం లేదని చెప్తోంది.
ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలోనూ ఈ కరవాలాలూ కనపడతాయి. కైవారాలూ కనపడతాయి. పామూ చావకుండా కర్రా విరగకుండా తాను బీజేపీతో మంత్రాంగం నడిపిస్తున్నానని కేసీఆర్ సాబ్ చాలా భరోసాగా ఉన్నాడు. అది వేయి పడగల మిన్నాగు. ఒకటి కరచాలనం చేసినట్టే కనపడుతుంది. మిగిలిన వన్నీ కాటేస్తూనే ఉంటాయి. రాష్ట్ర జాబితాలోని వ్యవసాయంలోకి, విద్యలోకి జొరబడింది. ఉమ్మడి జాబితాలోని విద్యుత్‌ను కబ్జా పెట్టింది. రాష్ట్రాల ఆదాయాలను జీఎస్టీ పేరున కబళించేసింది. ఆర్థిక వ్యవస్థకుతిక పిసికేస్తున్నది. తెలంగాణ కోసం, మన ప్రజల కోసం కేంద్రంతో తలపడాల్సిన అంశాలు కేసీఆర్‌కు కనపడకపోవడం దురదృష్టకరం. రాజకీయాలంటే ఒక మైనస్ ఒక ప్లస్ కాదు. నాలుగు కోట్ల ప్రజల బాగోగులు చూడాలి.