Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రం మరో జిత్తుల మారి ఎత్తుగడకు పూనుకుంది. రాష్ట్రాల హక్కులపై మరో వేటుకు సిద్ధమైంది. ప్రజల కష్టార్జితాన్ని కాజేయడానికి మరో పన్నాగానికి తెరలేపింది. మోడీ గారు మంత్రివర్గ విస్తరణతో పాటే సరికొత్తగా ''సహకార మంత్రిత్వశాఖ''ను ఏర్పాటు చేసి అమిత్‌షా చేతికి అప్పగించారు! ఇప్పుడిది ఆ శాఖ ప్రాధాన్యతతో పాటూ, ఆ రంగానికి ప్రమాదాన్నీ సూచిస్తోంది. ఈ చర్య సహకార వ్యవస్థ బలోపేతానికే అని ప్రభుత్వం ఎంత చెపుతున్నా... దీని వెనుక అనేక రాజకీయ, ఆర్థిక కుట్రలున్నాయనే అనుమానాలే ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. సమాఖ్యస్ఫూర్తికి విఘాతం కలిగించే రాజకీయ దుశ్చర్యగా ప్రతిపక్షాలు అభిప్రాయ పడుతున్నాయి. నిజమే కదా..! ఇప్పటికే వ్యవసాయరంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి దుర్మార్గమైన చట్టాలను తెచ్చిపెట్టిన పెద్దమనుషులు... ఇప్పుడు సహకార రంగాన్ని ఉద్ధరిస్తామంటే ఎలా నమ్మడం. ఒకప్పుడు వ్యవసాయరంగంలోనే ప్రారంభమైన సహకార సంఘాలు, నేడు చేనేత మొదలు చక్కెర మిల్లుల వరకూ, డైరీ పరిశ్రమ నుంచి బ్యాంకుల నిర్వాహణ వరకూ అనేక రంగాలకు విస్తరించి అతిపెద్ద వ్యవస్థగా రూపుదాల్చాయి. దేశవ్యాపితంగా దాదాపు 40 కోట్ల మంది ప్రజల భాగస్వామ్యంతో, సుమారు 8లక్షల సంఘాలు పనిచేస్తున్నాయని ఓ అంచనా. వేలాది కోట్ల ప్రజలే కాదు, వారి లక్షల కోట్ల డిపాజిట్లు కూడా ఈ రంగంలో ఉన్నాయి. అందువల్ల తన రాజకీయ ప్రయోజనాలతో పాటు, తన కార్పొరేట్ మిత్రుల ఆర్థిక ప్రయోజనాల కోసం ఈ రంగంపై నియంత్రణ సాధించాలన్న వ్యూహంలో భాగమే ఈ సరికొత్త ''సహకార మంత్రిత్వశాఖ'' ఏర్పాటు..! కానీ, రాజ్యాంగంలోని 75వ షెడ్యూలు ప్రకారం 'సహకార రంగం' రాష్ట్రాల పరిధిలోని అంశం. అయినప్పటికీ ఇది విస్మరించి ఏకపక్షంగా కేంద్రంలో ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయడమంటే అది ఫెడరల్ వ్యవస్థపై దాడికి పూనుకోవడమే. రాష్ట్రాల హక్కులనూ, అధికారాలనూ దోచుకోవడమే.
ఛిద్రమవుతున్న ప్రజా జీవితాన్ని చక్కదిద్దేందుకు ఏ ప్రణాళికలూ లేకపోయినా, ప్రజలను ఏమార్చి తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి మాత్రం ఏలినవారి వద్ద బోలెడు ఉపాయాలు..! గ్రామీణ భారతంలో స్థానిక ప్రజల విస్తృత భాగస్వామ్యంతో సాగుతున్న ఈ కో-ఆపరేటివ్ సెక్టార్‌ను నేరుగా తన స్వాధీనంలోకి తెచ్చుకుంటే... తద్వారా తన రాజకీయ ప్రాబల్యాన్ని విస్తరించుకోవచ్చన్నది కేంద్రంలోని పాలకపార్టీ ఆలోచన. ఇప్పటి వరకూ ప్రధానంగా నగర, పట్టణ ప్రాంతాలు కేంద్రంగానే బీజేపీ ప్రాబల్యం కొనసాగుతోంది. ప్రస్తుతం పాలనాపరమైన, ఆర్థిక పరమైన అనేక వైఫల్యాల కారణంగా అక్కడ బీజేపీ పట్టు సడలుతోంది. ఈ నేపథ్యంలో ఆ నష్టాన్ని పూడ్చుకోవడంతో పాటు, ఈ రంగంపై ప్రతిపక్షాల ప్రాబల్యాన్ని దెబ్బకొట్టేందుకే బీజేపీ ఇందుకు పూనుకుంటున్నది. అన్నిటికీ మించి రానున్న గుజరాత్, మహారాష్ట్ర ఎన్నికలను గెలుచుకోవడం ఇప్పుడు ఆ పార్టీ ముందున్న అతిపెద్ద సవాలు. ఈ రాష్ట్రాల్లో సహకార సంఘాల సంఖ్యా, వాటి సత్తా ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఉదాహరణకు ఒక్క మహారాష్ట్రలోనే రెండు లక్షల సహకార సంస్థలుండగా ఐదు కోట్ల మంది సభ్యులున్నారు. గుజరాత్లో కూడా 81వేలకు పైగా సంఘాలున్నాయి. దేశవ్యాపితంగా ఈ రంగం విస్తృతమైన జనబాహుళ్యంతో మమేకమై ఉండటంతో పాటు, రాజకీయంగా కూడా గణనీయమైన ప్రభావం చూపగలశక్తిగా ఉంది. అందుకే రాష్ట్రాల హక్కులకే కాదు, రాజ్యాంగ నియమాలకూ విరుద్ధంగా ఈ రంగాన్ని కేంద్రం కబళించజూస్తోంది.
ఇక ఈ రంగంలో కొన్ని లక్షల కోట్ల ప్రజాధనం డిపాజిట్ల రూపంలో ఉంది. రాష్ట్ర సహకార బ్యాంకుల్లోనే లక్షా ముప్ప్పైవేల కోట్లకు పైగా డిపాజిట్లు ఉండగా, జిల్లా సహకార బ్యాంకుల్లో 3లక్షల 78వేల కోట్లకు పైగా ఉన్నాయి. అంతకు మించి ఈ రంగంలో లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది. కేవలం మహారాష్ట్ర కో ఆపరేటివ్ సెక్టార్‌లోని చక్కెర మిల్లుల టర్నోవరే ఏడాదికి రూ.35,000 కోట్లు. ఆ రాష్ట్ర డైరీ రంగంలో జరుగుతున్న వ్యాపారం రూ.40,000 కోట్లకు పైమాటే. గుజరాత్లో ''అమూల్'' సహకార రంగం ద్వారా దేశంలో శ్వేత విప్లవాన్నే సాధించిన అనుభవం కూడా కండ్లముందే ఉన్నది. మొత్తంగా క్షేత్రస్థాయిలో విస్తృతమైన గ్రామీణ వ్యవసాయ రుణ సంఘాలతో పాటు లక్షలాది సహకార డైరీ సంఘాలు, అంతే సంఖ్యలో చేనేత సహకార సంఘాలు, వందలాది చక్కెర మిల్లులు, 360కి పైగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీ), 33 రాష్ట్ర సహకార బ్యాంకులు, 1539 పట్టణ సహకార బ్యాంకులు ఈ కోఆపరేటివ్ సెక్టార్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దేశ జనాభాలో ఓ గణనీయమైన భాగం వీటితో మమేకమై ఉన్నారు. కనుక కేంద్ర పాలకుల అధికార వ్యామోహానికీ, వారి సంపన్న మిత్రుల వ్యాపార దాహానికీ ఇది ఒక అపారమైన వనరుగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. అందుకే ప్రజలూ, ప్రజలతో పాటు వారి డబ్బూ పుష్కలంగా ఉన్న రంగంపై మోడీ సర్కార్ కన్నుపడింది.
ఇంత జరుగుతున్నా అనేక రాష్ట్రాలు నోరెత్తకపోవడం వారి నిస్సహయతనూ చేతకానితనాన్నే సూచిస్తోంది. ఇప్పటికైనా మేలుకోకపోతే సమాఖ్య స్ఫూర్తికీ, సహకార వ్యవస్థకే కాదు... రాష్ట్ర ప్రభుత్వాల ఉనికికే ప్రమాదం. పౌర సమాజమూ దీనిని ప్రతిఘటించాలి. లేదంటే ప్రజల కష్టార్జితమంతా ప్రభువుల అవసరాలకు, కార్పొరేట్ల ఖజానాకు తరలిపోతుంది.