Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంతో పాటు రాష్ట్రంలోనూ నిరుద్యోగం కోరలు చాస్తున్నది. యువత నిరాశానిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నది. అధికార పార్టీలు అవసరం వచ్చినప్పుడల్లా నిరుద్యోగుల ఆశలతో ఆటలాడు కుంటున్నాయి. చదువుకున్నవారితోపాటు నైపుణ్యంలేని కూలీలకూ ఉపాధి జీవన్మరణ సమస్యగా మారింది. దేశంలోనూ అదే పరిస్థితి. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల ఇస్తామన్న హామీ పక్కనబెడితే, ఉన్న ఉద్యోగాలకు బీజేపీ సర్కారు మంగళం పాడుత్నుది. 2014 ఎన్నికల నాటి హామీలను ఏడేండ్లుగా అమలుచేయని మోడీసర్కారు, ప్రభుత్వరంగ సంస్థలను ఖతం చేస్తుండటం నేడు కండ్లకు కడుతున్నది. ఈ పరిస్థితుల్లో విద్యావంతులు, నిరుద్యోగ యువత కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏండ్ల తరబడి దేశంలో ఆర్థిక మందగమనం కొనసాగుతుండటం, తాజాగా కొవిడ్ ప్రమాదం ముందుకు రావడంతో యువత ఆర్థికంగా, మానసికంగా ఒత్తిడికిలోనవుతున్నది. ఉపాధి అవకాశాలు పెరగకపోగా, ఉన్నవి నిర్వీర్యమవుతున్నాయి. దేశంలో 60లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కేంద్రం పరిధిలో 30 లక్షలు కాగా, రాష్ట్రాల్లో మరో 30లక్షలు భర్తీ చేయకుండా పెండింగ్‌లో ఉంచేశారు. కులం, మతం పేరుతో కేంద్రం ఉన్మాదాలను, భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నది. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు అగ్రకులాల్లోని పేదలకు సైతం తీవ్ర అన్యాయం చేస్తున్నది. కాగా నోటిఫికేషన్ల కోసం యువత వేయికండ్లతో ఎదురుచూస్తున్న దయనీయస్థితి. రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సర్కారు నియమించిన సీఆర్ బిస్వాల్ పీఆర్సీ కమిటీనే తేల్చింది. వీటి భర్తీ బాధ్యతను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)కు అప్పగించింది. కమిషన్ ఇప్పటివరకు 35 వేల ఉద్యోగాలను మాత్రమే నింపింది. ఏ నోటిఫికేషన్ జారీచేసినా, అందులో అన్నీలోపాలే. హైకోర్టులో కేసులే. దీనితో భర్తీ ప్రక్రియ కాస్త ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కిలా మారింది. ఇంకా వేలాది పోస్టులకు నోటిఫికేషన్లు వేయడంలో అనవసర జాప్యం జరుగుతున్నది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) ప్రకారం దేశంలోని అత్యధిక గ్రాడ్యుయేట్ నిరుద్యోగులున్న రాష్ట్రాల్లో మనది ఎనిమిదోది. వీరిలో 25 శాతం మంది ఉద్యోగాల కోసం ఎదరుచూస్తున్నారు. స్థానిక నిరుద్యోగుల లెక్కల్లో కూడా తేడాలున్నాయనీ, దానిపై చర్చకు రావాలని రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
టీఎస్పీఎస్సీలో నమోదైన 30 లక్షల అర్హత గల అభ్యర్థులు ఉద్యోగాల కోసం చకోరపక్షుల్లా వేచిచూస్తున్నారు. హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో నిరుద్యోగంపై మళ్లీ చర్చ సాగుతున్నది. గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ముందూ ఇలాగే అధికార, ప్రతిపక్షాలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీలు స్వప్రయోజనాల కోసం నిరుద్యోగులను పావులుగా వాడుకుంటున్నాయి. ఎన్నికలు, ఇతర సమయాల్లో వారికి కల్పించిన ఆశలు, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ఈసమస్యలకు చెక్‌పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు సర్కారు ఆపన్నహస్తం కోసం కండ్లల్లో ఒత్తులేసుకుని నిరీక్షిస్తున్నారు. ఉద్యోగాల్లేని యువతకు ప్రతినెలా ఇస్తానన్న భృతి రూ. 3016లు అందని ద్రాక్షే అయింది. 2019-20 బడ్జెట్లో ఈ పథకానికి రూ.1810 కోట్లు కేటాయించినా, అమలుకు పూనుకోలేదు. ఇప్పటివరకు 1.31లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామంటున్న కేసీఆర్ సర్కారు, మరో 50వేల పోస్టులకు జాబ్‌క్యాలెండర్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇప్పుడైనా ఉద్యోగాల నోటిఫికేషన్లు సమయానుకూలంగా ఇచ్చి భర్తీ చేస్తారా? లేదా? అంటూ నిరుద్యోగ యువత ప్రశ్నిస్తున్నది.
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకణ చేస్తామన్న హామీని టీఆర్ఎస్ సర్కారు ఇంకా నిలబెట్టుకోలేదు. యాక్ట్ 2 ఆఫ్ 94ను రద్దు చేయకుండా వీరిని పర్మినెంట్ చేయడం సాధ్యం కాదనే సంగతి సర్కారుకు తెలుసా? తెలిస్తే ఏం చేయదలుచుకున్నది? నూతన జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో స్థానికులకు 95శాతం ఉద్యోగాలు వస్తాయంటున్నారు. ఉద్యోగాల భర్తీకి న్యాయపరమైన చిక్కుల్లేకుండా, ఆలస్యం చేయకుండా నిర్దిష్ట కాలపరిమితిలో భర్తీచేయాలనేది నిరుద్యోగుల ఆకాంక్ష. పెట్టుబడి దారి వ్యవస్థ నిరుద్యోగాన్ని పెంచిపోషిస్తుందన్న విషయం మనకు తెలిసిందే. కాని ఉపాధి అవకాశాలు పెంచేందుకు వృత్తులను ఆధునీకరించవచ్చు. అత్యధిక మందికి ఉపాధి కల్పించే వ్యవసాయాన్ని, ఎంఎస్ఎంఈలను ఆదుకునే మార్గాలనూ అన్వేషించాలి. ఈ రెంటిని ధ్వంసంచేసి కార్పొరేట్ల కొమ్ముకాసే కేంద్ర ప్రభుత్వ విధానంపై పోరాడకుంటే మన ప్రజలకు తీవ్ర నష్టం. అందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి.