Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్యూబాలో జరుగుతున్న నిరసన ప్రదర్శనలను చిలువలు పలువలుగా చేస్తూ సోషలిస్టు వ్యతిరేకశక్తులు ప్రచారం చేపట్టాయి. అనేక దశాబ్దాలుగా ఆ దేశంపై కుట్రలు పన్నుతున్న అమెరికా దీనికి మరింత ఆజ్యం పోసి క్యూబా అంతర్గత విషయాల్లో మంటలు పుట్టిస్తోంది. కోవిడ్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సందర్భంలో అమెరికాలో ప్రజలకు వైద్యం అందించలేక, సౌకర్యాలు అందించలేక నానాపాట్లు పడుతున్న తరుణంలో సోషలిస్టు క్యూబా 60దేశాలకు వైద్య సేవలను అందించింది. ప్రపంచ ధనిక దేశాలకు దీటుగా ప్రజలను కాపాడటం కోసం ఐదు వ్యాక్సిన్లను కనుగొన్నది. తమ దేశ ప్రజలను రక్షించుకోవడానికి పెద్ద ఎత్తున తన వనరులను ఖర్చు చేసింది. దానితో ప్రజా అవసరాలు తీర్చడంలో కొంత వెనకడుగు వేసింది. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలను మరింత పెంచేందుకు సామ్రాజ్యవాదం పూనుకుంటున్నది.
ఈ నిరసనలను రెండు భాగాలుగా చూడాలి. మొదటిది నిత్యవసరాలు తీరకపోతే ఎదురయ్యే సహజ నిరసన, రెండవది ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి వ్యక్తం అయ్యే నిరసన. దేశంలో సమస్యలు తలెత్తడం సహజం, కారణాలను గుర్తించి వాటిని ప్రజలకు అర్థం అయ్యేలా వివరించడంలోనే పరిష్కారం ఉంటుంది. క్యూబా అధ్యక్షుడు చేసింది కూడా అదే. నిరసనలు తలెత్తిన రాష్ట్రానికి వెళ్ళి నిరసన కారులతో సంప్రదించారు. నిరసన పట్ల సోషలిస్టు ప్రభుత్వాలకు పెట్టుబడిదారీ ప్రభుత్వాలకు ఉన్న తేడా ఇదే.
క్యూబా గత ఆరు దశాబ్దాలుగా అనేక రకాలైన కొరతలను ఎదుర్కొంటుంది. ఈ కొరతలకు రెండు కారణాలు ఉన్నాయి. దేశీయంగా ప్రకృతి వనరుల పరిమితి. రెండవది విదేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తుసేవలు, వనరులు. అమెరికా హెల్మె-బర్టన్ బిల్లును ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం క్యూబాతో ఆర్థిక వాణిజ్య లావాదేవీలు నిర్వహించే ఏ దేశమైనా అమెరికాకు శత్రుదేశమే అని ముద్రవేసి క్యూబాను ఏకాకిని చేసింది. ఇష్టంలేని దేశాలను రోగ్నేషన్స్గానో, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలుగానో ముద్రవేసి ఆ దేశాలతో సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు రద్దుచేసుకునేలా ఒత్తిడి చేయడం అమెరికా అనుసరిస్తున్న సామ్రాజ్యవాద విధానంలో ఒక కోణం. ఈ వాణిజ్య సామ్రాజ్యవాదం కారణంగానే క్యూబా ఇప్పటి వరకు లక్షా ముప్పైవేల కోట్ల డాలర్ల విలువైన సంపదను కోల్పోయింది. బైడెన్ క్యూబా విషయంలో ట్రంప్ విధానాలనే అనుసరిస్తున్నారు. తాజాగా క్యూబా ఎదుర్కొంటున్న వనరుల కొరతకు రెండు ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది సార్వత్రిక ఉచిత ప్రజా ఆరోగ్య విధానం క్యూబాలో ఇప్పటి వరకు ఏ ఒక్క కోవిడ్ రోగి చికిత్స కోసం పైసా చెల్లించాల్సిన అవసరం రాలేదు. సాధారణ కోవిడ్ చికిత్సకు సగటున రోజుకు 180 డాలర్ల ఖర్చు అయితే, ఐసీయూలో ఉన్న రోగికి రోజుకు 550 డాలర్లు ఖర్చు అవుతున్నది. గత రెండు సంవత్సరాలుగా కొన్ని వేల కోట్ల డాలర్ల వనరులు ప్రజల ప్రాణాలను కాపాడటానికే ఖర్చు అయింది. దానితో ప్రజా సేవలకు వెచ్చించాల్సిన వనరులలో కొరత అనివార్యం అయింది. కోవిడ్ కారణంగా పర్యాటకరంగం దెబ్బతినడంతో దేశానికి వచ్చే ఆదాయం తగ్గింది. వెరసి ప్రజలకు కొన్ని సేవలు సకాలంలో అందించలేకపోయింది క్యూబా ప్రభుత్వం.
ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని క్యూబా ప్రజల నిరసనలను సోషలిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలని బయట ప్రపంచాన్ని నమ్మించేందుకు అమెరికా నానా పాట్లు పడుతున్నది. ఈ పరిస్థితులలో క్యూబా నిలదొక్కు కోవడానికీ ప్రజల అవసరాలు తీర్చడంలో మెరుగైన పాత్ర పోషించడానికీ రెండు ప్రత్యామ్మాయాలు ఉన్నాయి. ఒకటి తాత్కాలికం, రెండవది శాశ్వతం. ప్రపంచ వ్యాపితంగా ఉన్న ప్రగతిశీల శక్తులు, ప్రజలు, ప్రభుత్వాలు 1990 దశకంలో చేసినట్టుగానే విస్తృతంగా ఆర్థిక వనరులు, వస్తువులు సేకరించి క్యూబాకు పంపడం ద్వారా సోషలిజానికి సంఘీబావంగా నిలవడం మొదటి ప్రత్యామ్నాయం. క్యూబాపై అమెరికా విధించిన ఆంక్షలు రద్దుచేసేలా అమెరికాపైన ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలిపైనా ఒత్తిడి తేవడం రెండవది. తద్వారా వివిధ దేశాలు క్యూబాలో అభివృద్ధి అయిన వ్యాక్సిన్లను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అమెరికా ఆంక్షలు రద్దు అయితే క్యూబా కూడా తమ వస్తుసేవలు విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చు కుని ప్రజల దైనందిన అవసరాలు తీర్చడానికి వీలుకలుగుతుంది. ఈ శాశ్వత పరిష్కారం ఆచరణ సాధ్యం. అటు రష్యా, మెక్సికో క్యూబా అంతర్గత విషయంలో బయట శక్తులు జోక్యం చేసుకోవద్దని కోరుతున్నాయి. ఐక్యరాజ్యసమితి ఆంక్షలు ఎత్తివేయాలని తీర్మానం చేసింది. అయితే క్యూబాలో సోషలిజం మరింతగా వేళ్ళునుకుంటుందన్న భయంతోనే అమెరికా మొండి పట్టు వీడటం లేదు. ''పెట్టుబడిదారీ సమాజానికి కావాల్సినది లాభం. దానికి పేదరికాన్ని అంతం చేయాలనే ఆలోచన కానీ, నీతి నిజాయితీ కానీ ఉండదు.'' అని ఫెడల్ కాస్ట్రో అన్న మాటలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.