Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హెచ్చరికలు ప్రజలకు మాత్రమేనా? ప్రభుత్వాలకు వర్తించవా? కరోనా థర్డ్‌వేవ్ వచ్చిందంటే అది మన స్వయంకృత అపరాధమే అని స్వయంగా మన ప్రధానమంత్రి హెచ్చరించారు. డబ్ల్యూహెచ్ఓ సైతం కరోనా మూడో దశ ప్రారంభమైందని వెల్లడించింది. ఈ తరుణంలో ప్రధానే ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని యోగి ప్రభుత్వం కర్వాన్ యాత్రకు అనుమతినిచ్చింది. కరోనా సెకెండ్ వేవ్ ఆరంభంలో కుంభమేళా నిర్వహణతో వైరస్ వ్యాపికీ ప్రజల మరణాలకు కారణమైన వారే.. నేడు తిరిగి కావడి యాత్రకు అనుమతించి కరోనా మూడో దశకు 'ఆహ్వానం' పలకనున్నారు. దీన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. యోగి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా కోర్టు ప్రధాని మాటలను గుర్తు చేసింది కూడా.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్రకు అనుమతి నిరాకరించింది. 15రోజుల పాటు సాగే ఈ యాత్రలో ఉత్తరాది రాష్ట్రాల నుంచి భారీగా శివభక్తులు పాల్గొనే అవకాశాలున్నాయి. అంతకుముందు ఏడాది మూడు కోట్ల మంది పాల్గొన్న యాత్ర కరోనాతో గతేడాది రద్దైంది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో భక్తులు పాల్గొంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకుంటేనే వెన్నులో చలి పుడుతుంది. మన రాష్ట్రంలో బోనాల సందర్భంగా జరుగుతున్న ఉరేగింపులు కూడా అలాంటి ఆందోళననే కలిగిస్తున్నాయి.
కోవిడ్ మొదటి రెండు దశల్లో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా కేంద్ర పాలకులు తమ ఎజెండాను అమలు చేయడంలో మునిగి పోయారు. పరిస్థితులు విషమించి దేశాన్ని వైరస్ చుట్టుముట్టి కోట్లాదిమంది జీవన పరిస్థితులను తల్లకిందులు చేసింది. నాలుగు లక్షల మందిని కబళించింది. దేశంలో రెండోదశ ఇంకా కొనసాగుతూనే ఉంది. మళ్లీ క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ స్థితిలో మూడోదశ నిరోధానికి ప్రజలంతా కరోనా నిబంధనలు విధిగా పాటించాలని ప్రధాని ప్రజలను అప్రమత్తం చేశారు. మంచిదే, ఇప్పటికైనా మేలుకొన్నారు. గడిచిన రెండు దశల్లోనూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు స్పష్టంగా గ్రహించారు. మొదటి రెండు దశల్లో డబ్ల్యూహెచ్ఓ ముందస్తు హెచ్చరికలను పట్టించుకొని పాలకులు కరోనాను తామే ముందుగా నియంత్రించామని ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించారు. రెండోదశ శరవేగంగా దేశమంతటా విజృంభించి అవి వట్టిమాటలే అని తేల్చింది. ప్రజల ప్రాణాల పట్ల నిష్క్రియాపరంగా ఉన్న పాలకులు మహమ్మారి రోజుకు వేలాదిమంది ప్రాణాలు హరిస్తున్నదని తెలిసి కూడా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను దాదాపు మూడు నెలలు సాగదీసి నిర్వహించారు. అనేక రాష్ట్రాల్లో ఉపఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు కూడా తెలంగాణలో మరో ఉప ఎన్నిక జరగనుంది. రాష్ట్రాల్లో అనేక ప్రచార సభల్లో మోడీ, షాలు చేసిన ప్రసంగాలు వినేందుకు లక్షలాది మంది గుమికూడారు. అప్పుడు ఆనందం వ్యక్తం చేసిన ప్రధానమంత్రిగారు... ఇప్పుడు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ రెండుదశల్లో పాలకులు తమ వైఫల్యాలను అంగీకరించలేదు. విమర్శలను సహృదయంతో స్వీకరించి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. రెండు దశల్లో కోట్లాది మంది ఉపాధులు, ఉద్యోగాలు కోల్పోయారు. తాజాగా కేంద్రం ప్రకటించిన 6 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజిలో ఆరోగ్య రంగానికి కేవలం 50వేల కోట్లు కేటాయించారు. ఇది ఏ మూలకు సరిపోతుందన్న వ్యాఖ్యలు బలంగా వినిపించాయి. మహమ్మారి నియంత్రణకు, మూడోదశ నిరోధానికి కేవలం నిబంధనలు పాటిస్తే సరిపోతుందా? ఒకవేళ మూడోదశ ప్రవేశిస్తే అందుకు ప్రజలను బాధ్యులను చేయడానికి పన్నిన ఎత్తుగడలా ఉంది. కోవిడ్ నియంత్రణ ప్రధానంగా టీకాల పంపిణీతోనే సాధ్యమవు తుందని శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ప్రజలు నిబంధనలు విధిగా పాటించవలసిందే. కానీ, ప్రభుత్వం టీకాల ఉత్పత్తి, పంపిణీలో పూర్తిగా వైఫల్యం చెందింది. మోడీ తన వైఫల్యాలను కప్పి పుచ్చుకొని ప్రజలను వేలెత్తి చూపడానికి ప్రయత్నించడంలో ఏ మాత్రం ఔచిత్యం లేదు. లక్షలాది మంది గంగానదిలో మునిగి పునీతులు అవుతారన్న నమ్మకాన్ని రాజకీయంగా వాడుకోవడానికి కుంభమేళాకు ఏడాది ముందుగానే అనుమతించి మహమ్మారి మరిన్ని ప్రాంతాలకు చేరడానికి కారకులయ్యారు. అసలే కాలుష్య భరితమైన గంగలో వందలాది కోవిడ్ బాధితుల మృతదేహాలు తేలియాడుతూ ప్రవహించాయి. కానీ, మొన్న సొంత నియోజకవర్గంలో అనేక ప్రారంభోత్సావాలు చేసిన ప్రధాని అత్యంత జనాభా గల యూపీలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ప్రకటించడం విడ్డూరంగా ఉంది. కరోనా ముడో దశ ప్రమాదం పొంచి ఉంది. దానిని ఎదుర్కొవడానికి ఎలాంటి చర్యలు చేపడతారు, ప్రణాళిక ఏమిటి? తయారుచేసి మాకు ఇవ్వండి అన్న సుప్రీం ఆదేశాన్ని పట్టించుకొని ఉంటే ప్రభుత్వం ఇప్పటికే చర్యల జాబితాను ప్రకటించి ఉండాలి. కానీ కేంద్రం ఆపని చేయలేదు. మరి మూడో దశను ఎదుర్కోనేందుకు తగిన వైద్యసిబ్బందిని, మందులను, ఆక్సిజన్ వంటి వాటిని సమకూర్చుకుందా? మూడో దశను ఎదుర్కొనేందుకు ఆయా రాష్ట్రాలకు ఆర్థిక వనరులు అందించాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఎందుకంటే రాష్ట్రాల పరిధి నుంచి ఆరోగ్య వ్యవస్థను కేంద్రం తన అధీనంలోకి తీసుకున్నది. మాటల చాతుర్యంతో చేసే పాలనను ప్రజలు ఎంతో కాలం నమ్మరు.