Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూయండి.. తలుపులను, కిటికీలను అన్నీ మూసేయండి. కిటికీలు తెరిస్తే అందులోంచి లోకాన్ని వీక్షిస్తారు. అప్పుడు అనేకమైన దృశ్యాలు కళ్ళలోకి చేరతాయి. చేరి ఊరుకుంటాయా! కొన్ని ప్రశ్నించవచ్చు. మరికొన్ని పరామర్శించవచ్చు. కొన్ని నిలేస్తాయి కూడా! నిన్ను నిలువునా ఎక్సెరే తీసి లోపాలను కళ్ళలోకి విసిరేయవచ్చు. అందుకే మూసేయండి కిటికీలు తలుపులు. తెరచుకుంటే వెలుగు పరచుకుంటుంది. ఆలోచన విసురుకుంటుంది. ఆకాంక్ష వెల్లువెత్తుతుంది. ఏదో ఒక పిట్ట కిటికీ రెక్కపై వాలి గొంతును సవరించుకుంటుంది. శ్వాసను రాగమయం చేసే వాయువేదో పయనిస్తుంది. స్వేచ్ఛా వృక్షపు పూలకొమ్మ పలకరిస్తుంది. ఇవన్నీ సహించని వాళ్ళం భరించలేని వాళ్ళం, మూసేయండి మూసేయండి. మూసేయడం కుదరకుంటె తోసేయండి!
అదిగో గృహ మంత్రి బయలుదేరాడు. వచ్చేస్తున్నాడు. జాగ్రత్త వహించండి.. తప్పుకొండి. గాలికి తెరలు కట్టండి. వెలుగుకు సెలవు చెప్పండి. శ్వాసల వాసనలేవీ లేకుండా, మనుషుల సడులేవీ వినపడకుండా నిషేధాన్ని ప్రకటించాం. కండ్లేవి చూపులను సారించవలదు. కర్ఫ్యూ కొనసాగుతోంది. అతనొస్తున్నాడు. అలకిడి కావొద్దు. ఆకులు కదలొద్దు. అలజడి రేగొద్దు. ప్రజాస్వామ్య శబ్దాలపై నిశబ్దాల నిషేధాజ్ఞలున్నారు. మూయండి కిటికీలు, తలుపులు, మూయండిక మూతులు కూడా అంటూ అహ్మదాబాద్ పోలీసులు, అమాత్యుల వారి రాకకోసం, పర్యటన సాఫీగా జరగటం కోసం శతదా ప్రయత్నిస్తూ నిషేధాలు విధించారు. రాజుల కాలాన్ని, సామ్రాజ్యాధిపతుల వాతావరణాన్ని తిరిగి మనకు చూపిస్తున్న ప్రజాస్వామిక రారాజుల చర్యలు మనకేమీ ఆశ్చర్యాన్ని కల్పించవు.
ఎందుకంటే మనది ప్రజాస్వామ్యమనబడే దేశమైనా, ప్రజా వ్యతిరేక నియంతృత్వ విధానాల ఉగ్గుపాలతో పెరిగిన పాలక నేతల నుండి ఇంతకన్న వేరుగా ఆశించలేం. ఏలికల కోసం వారి పర్యటనల కోసం ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించటం, రోడ్లను బ్లాక్ చేసి వారికి దారివ్వటం, అన్నిరకాల ట్రాఫిక్ రూల్స్‌ను పక్కకు పెట్టి, ప్రజల అత్యవసరాలను కూడా గుర్తించకుండా అధికార దర్పాన్ని ప్రదర్శించడం అన్ని వేళలా మనం చూస్తూనే ఉంటాము. వీళ్ళది మరింత విపరీత ఆచరణ మరి. అమిత్‌షా గారి పర్యటన సందర్భంగా అహ్మదాబాద్‌లోని మూడువందల మంది కుటుంబీకులను వారి ఇండ్లలో తలుపులు, కిటికీలు తీయొద్దని పోలీసులు హెచ్చరించడాన్ని ఆ ప్రాంతపు పంక్తిజోగ్ అనే మహిళ తీవ్రంగా ప్రశ్నించింది. ''ఏమిటి? మనం నియంతృత్వంలో, రాజుల కాలంలో ఉన్నామా? మంత్రులేమయినా రాజులా! ప్రజల హక్కులను హరించివేస్తారా? ప్రజాస్వామ్యంలో ప్రజలను ఈ విధంగా నియంత్రించడం సరైయినదేనా?'' అని పోలీసులను కడిగేసింది. ఎన్ని నిర్భంధాలు వెల్లువెత్తినా ధైర్యపు గొంతులు ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటాయనటానికి నిదర్శనంగా పంక్తిజోగ్ నిలుస్తారు. ఆవిడకు మనసునిండా అభినందనలు చెప్పుకోకుండా ఉండగలమా!
తలుపులూ కిటికీలు మూయమని, అదీ కొన్ని గంటలు మూయమని చెప్పడమైతే ఏదో సర్దుకుని క్షమించి వదిలేస్తాము. అసలు ప్రమాదం అదికాదు. తలుపులు కాదు, తలపులనే నిషేధిస్తున్న వారి విధానాలతో ప్రజాస్వామ్య విలువలు ఒడ్డున పడ్డ చేపల్లా కొట్టుకొంటూనే ఉన్నాయి. ఆలోచనలు ప్రమాదకరంగా ఉన్నాయన్న మిషతో అనేక మందిని జైళ్ళలో పెట్టి రాజ్యాంగాన్ని, చట్టాలను అపహాస్యం చేస్తున్న తీరు అత్యంత భయానకంగా జరిగిపోతున్నది.
ఇప్పుడు ''దేశం మొత్తం ఒక జైలుగా పరిణమించే దశ.. ఎక్కడయితే ఏమిటి, జైలో ఇల్లో, నిన్ను నువ్వు కోల్పోతావు, నువ్వు అన్ని విధాలా చనిపోతావు'' అంటాడు కవి. ఇంటిని, దేశాన్ని ఓ జైలుగా మార్చే ఆలోచనలు విస్తరిస్తున్న సందర్భంలో తలపుల మూసివేతకు సన్నద్ధమవుతున్నారు. అయితే తలుపులు మూయించినంత తేలికకాదు తలపులను మూయించడం. మనిషికి కంచెలు కట్టొచ్చు. మనసుకు కూడా కడతామని భావిస్తున్నారు. అది సాధ్యం కాదు. మనసుకు ఆకాశమే హద్దు. స్వేచ్ఛ మానవుని జన్మహక్కు. హరించాలని ప్రయత్నించిన వారందరూ ఓటమి పాలయ్యారు. ఒంటిరిపాలయ్యారు.
ఎంత మూసేస్తే అంతే బలంగా విచ్చుకుంటారు! వొత్తిడి మహాశక్తిని జనింపజేస్తుంది. కిటికీలు, తలుపులు, చూపులు, ఆలోచనలు ఎంత తెరుచుకుంటే అంత జ్ఞానం సొంతమవుతుంది. అంత బలమూ సమకూరుతుంది. ఇది చరిత్ర నేర్పిన సత్యం. తెరవని మదిలో మలినం నిండుతుంది. నిలిచున్న నీటి కాలుష్యంలా. అందుకే 'పరుగాపక పయనించవె తలపుల నావా! కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ' అన్న కవి వాక్కుల సత్యపు దారుల్లో పయనించడమే నిజమైన స్వేచ్ఛకు తలుపులు తెరవడం. తలుపులను, తలపులను మూసేయాలను కుంటున్న వాళ్ళ గొంతులు మూతపడక తప్పదు. ప్రజాస్వామ్య ద్వారాల గుండ ఉషోదయం తథ్యము!