Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''పట్టమేలే రాజు పోయెను
మట్టిగలిసెను కోట పేటలు
పదం పద్యం పట్టి నిలిచెను
కీర్తులపకీర్తులు'' అని గురజాడ ఎనాడో చెప్పారు. రాజులు పోయినా, కోటలు కూలినా ఇప్పటికీ అవే శాసనాలను పట్టుకుని వేళాడుతున్నాం మనం. అందుకే వలసవాద చట్టం ఇంకెనాళ్లు? అని ప్రశ్నిస్తోంది మన అత్యున్నత న్యాయస్థానం.
''నాటి జాతీయోద్యమాన్ని అణచి వేయడానికి బ్రిటిషు ప్రభుత్వం ప్రయోగించిన రాజద్రోహ చట్టం, నేటి 75ఏండ్ల స్వతంత్రభారతావనికి అవసరమా? కాలం చెల్లినవంటూ ఎన్నో చట్టాలను తొలగించిన మీరు, ఈ చట్టాన్ని మాత్రం ఎందుకు కొనసాగిస్తున్నారు?''... ఇవి భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రభుత్వానికి సంధించిన ప్రశ్నలు...
''రాజద్రోహ చట్టాన్ని రద్దు చేస్తే అది ప్రభుత్వ తప్పుడు నిర్ణయమే అవుతుంది. చట్టాలను సవాలు చేస్తూ వాజ్యాలు వేయడం సరైనది కాదు.'' ఇవి చీఫ్ జస్టిస్‌గా పదవీ విరమణ పొంది, బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా మారిన రంజన్ గగోరు చేసిన వ్యాఖ్యలు.
మొదటివి ఈ దేశ స్వాతంత్య్రోదమ ఆకాంక్షల కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం పరితపిస్తే.. రెండోవి అచ్చంగా ప్రభుభక్తినే చాటుతున్నాయి. ఈ వ్యాఖ్యలూ వ్యాఖ్యానాల సంగతి అటుంచితే ఇక్కడ ''రాజద్రోహం'' అనేది ఓ ప్రధాన చర్చనీయాంశం. ఎందుకంటే దేశం ఇప్పుడు ప్రతి చిన్న విషయానికీ ఉలిక్కిపడుతోంది. అవి ట్విట్టర్లో ట్వీట్లు కావొచ్చు, ఫేస్బుక్లో పోస్టులు కావొచ్చు, వాట్సాప్ సందేశాలు కావొచ్చు..! సినిమాలు కావొచ్చు, పుస్తకాలు కావొచ్చు, నాటకాలు కావొచ్చు, పాటలు కావొచ్చు..! ప్రభువులకు వ్యతిరేకమైన సమస్త వ్యక్తీకరణలూ ఇప్పుడు దేశాన్ని ''అస్థిరపరిచేవే.'' ప్రజాస్వామ్యాన్ని నినదించే ప్రతి కదలికా ఇప్పుడు ''రాజద్రోహమే.''
నిర్బంధాలే జీవితంగా మారుతున్న ఓ విషమ కాలంలో ఉందిప్పుడు దేశం. ''దేశభక్తి'' వరదలై ప్రవహిస్తున్న కాలం కదా.. అధికారం నీడలో అమలయ్యే అంతులేని హింసను పంటి బిగువునా భరించాల్సిందే. లేదంటే దేశ ద్రోహుల జాబితాలో చేరిపోతారు. భయపడాలి. అందరూ భయపడాలి. కండ్లు తెరిచి చూడకూడదు, చూసిన సత్యాన్ని నమ్మకూడదు, నమ్మిన విషయాన్ని మాట్లాడకూడదు. నేను పౌరుడినీ, పౌరురాలినీ అని అనుకోకూడదు. అనుకున్నావో అది రాజద్రోహమే అవుతుంది. హింసే తన విధానమైన పాలనకదా... శాంతిని కోరడం నేరమే అవుతుంది. అణచివేతే లక్షణమైన ఏలికలు కదా.. హక్కులను నినదించడం కుట్రగానే కనిపిస్తుంది. అందుకని ఇక్కడ ప్రజాస్వామ్యమంటే కేవలం చూపుడు వేలిపై చుక్క పెట్టుకోవడమే! కాబట్టి ప్రశ్నలన్నీ రాజద్రోహాలే. అందుకే ప్రశ్ననూ, జ్ఞానాన్ని భరించలేని రాజ్యం అక్షరాలలోనూ ఆయుధాలనే చూస్తోంది. సత్యాన్ని సమాధి చేసేందుకు సకల విద్యలనూ ప్రదర్శిస్తోంది. ప్రశ్నను సంధించే కలాన్ని.. గళాన్ని.. అక్షరాన్ని చూసి జడుసుకుంటోంది. రాబందులను కాపాడేందుకు పావురాలను బంధిస్తోంది. అందుకే ఇప్పుడు సమానత్వాన్ని కాంక్షించడం మాట అటుంచితే, మానవత్వాన్ని ప్రకటించడం కూడా దేశద్రోహమే.
బహుశా ప్రపంచంలోని మరేదేశమూ రాజ్యానికి వ్యతిరేకంగా నేరాలు చేశారని ఆరోపిస్తూ తన సొంత పౌరుల మీద ఇన్ని కేసులు పెట్టి ఉండదు. నిరంకుశత్వం అనే భావన ఈ ప్రభుత్వాన్ని పట్టి పీడిస్తోంది. అందుకే భిన్నమైన ప్రతి అభివ్యక్తిపై రాజద్రోహ నేరం మోపుతోంది. ఒకవైపు అత్యున్నత న్యాయస్థానం ఈ క్రూర చట్టాన్ని ప్రశ్నిస్తుండగానే హర్యానాలో వందమంది రైతులపై అదే చట్టాన్ని ప్రయోగించి అణిచివేతకు పూనుకుంది. వాళ్లు ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రేలేమీ చేయలేదు. దేశాన్ని అస్థిరపరిచే చర్యలేమీ చేపట్టలేదు. ఈ దేశ పౌరులుగా ప్రభుత్వం తెచ్చిన నల్లచట్టాలను నిరసిస్తున్నారు. స్పందించని సర్కారుపై ప్రజాస్వామ్య బద్దంగా పోరాడుతున్నారు. అంత మాత్రానికే వారు దేశద్రోహులైనప్పుడు ఇక ఆ ప్రజలకు రక్షణేమిటి? ప్రజా ఉద్యమాలన్నీ దేశద్రోహాలుగా మారినప్పుడు ఇక ఆ ప్రజాస్వామ్యానికి అర్థమేమిటి? ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే నేరమైన చోట పౌరహక్కులు బతికి బట్టకట్టగలవా? ''ఒక్కరిని రాజద్రోహంలో బంధించు, ప్రశ్నించే లక్షలాది మందిని భయపెట్టు'' అన్న చందంగా మారింది ఈ సర్కారు తీరు.
ఈ నేపథ్యంలో జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు స్వాగతించదగినవీ, చారిత్రాత్మకమైనవి. ఇవి ఈ దేశంలో ప్రజాస్వామ్యం అమలులో, చట్టబద్ద పాలనలో గల చీకటి కోణాన్ని ఎత్తిచూపుతున్నాయి. కానీ, ఈ అప్రజాస్వామికమైన, వలస పాలననాటి కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ పౌర సమాజం నుంచీ, రాజకీయ పార్టీల నుంచీ తగినంత బలంగా రాకపోవడం ఓ విషాదరం. ఇప్పటికైనా ''రాజద్రోహం'' పేర శిలువ వేయబడుతున్న మన ప్రజాస్వామ్యాన్ని బతికించుకునే రాజకీయ కార్యాచరణకు దిగకపోతే అది నిజంగానే దేశద్రోహం అవుతుంది.