Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతుబంధులాగానే దళితబంధులోనూ ఆర్థిక సాయం అత్యంత పారదర్శకంగా అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీని కింద నియోజకవర్గానికి 100మంది దళితులను ఎంపిక చేసి, వారికి పది లక్షల నగదును అందిచనున్నామనీ, మొత్తం 119నియోజకవర్గాలకు గాను 11,900కుటుంబాలకు, రూ.1190 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. ఇవి కాక ఇంకో 40 వేల కోట్లను దళితుల అభివృద్ధికి వెచ్చించనున్నారట. సహజంగానే ఈ అంకెలు ఆకర్షణీయంగా ఉన్నాయి.. ఉంటాయి కూడా. లేకలేక దళితుల అభివృద్ధిని ముఖ్యమంత్రి పట్టించుకోవడం స్వాగతించవలసిన పరిణామమే. విమర్శలు తరువాత, ముందయితే, ఆ సంకల్పాన్ని, ఆ పథకాన్ని అభినందించాలి. అయితే, హూజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఈ పథకం రావడం దళిత ఓటర్ల కోసం పన్నిన వ్యూహమా..? అందుకే ఈ పథకాన్ని పైలేట్ ప్రాజెక్టుగా అక్కడ ప్రారంభించనున్నారా? ఏడేండ్లలో దళితుల కోసం కేసీఆర్ చేసిందేమీ లేదు అనే విమర్శలున్నాయి. కనుక ఇప్పుడు చూపిస్తున్నది నిజమైన ప్రేమేనా..? ఇలాంటి ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరియమ్మ ఘటన తర్వాతే కేసీఆర్ దళిత సాధికారతను తెరపైకి తీసుకురావడం కూడా దళిత వర్గాలల్లో నెలకొన్న అసంతృప్తి నుండి తప్పించుకునేందుకే అనే సందేహాలకు తావిస్తోంది. కనుక వీటన్నిటీకీ తావివ్వకుండా తన నిబద్దతను చాటుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.
దళిత సాధికారత అంటే దళితులందరికీ విద్య, ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు చేపట్టాలి. దళితుల జీవనగతులపై అధ్యయనం చేసిన జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సుల అమలుకు పూనుకోవాలి. దళితులపై సామాజికంగా, భౌతికంగా ఎన్నో ఏండ్లగా దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. వాటిని అరికట్టేందుకు అవసరమైన చట్టాన్ని చేయాలి. మరియమ్మ విషయంలో స్పందించినట్టే అన్ని ఘటనల్లోనూ స్పందించాలి. సబ్‌ప్లాన్ నిధులకు కోతలు లేకుండా అందించాలి. అన్ని రంగాలలో ఉన్న ఖాళీలలో 25శాతం దళితులతో నింపడం, రాష్ట్రంలో ఉన్న 9లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం, గతంలో ప్రభుత్వం ప్రకటించిన ఐదువేలు నిరుద్యోగభృతి అందించడం వేంటనే అమలు చేయాలి. దళితవాడలను అభివృద్ధి చేయడంతో పాటు, అట్రాసిటీ యాక్ట్‌లోని అన్ని అంశాలను అమల్లో పెట్టి ప్రభుత్వం తన చిత్తశుద్దిని ప్రకటించాలి. తగిన సంఖ్యల్లో ఫాస్ట్రాక్ కోర్టుల ద్వారా సత్వర న్యాయం అందించాలి. కులాంతర వివాహాలు చేసుకున్నవారి రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలి. సంచార ఉపకులాల జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించాలి. తద్వారా వారికి భరోసా కల్పించాలి.
దళితులకు మూడెకరాల భూమి, ప్రభుత్వం తలపెట్టిన భూపంపిణీ పథకం నిజంగా ప్రశంసనీయమైందే. గ్రామీణ దళితులకు వాస్తవిక సాధికారతను ఎంతో కొంత ఇవ్వగలిగిన పథకం అది. కానీ నామ మాత్రంగానే లబ్ధి పొందారు. అసంఖ్యాకులకు రిక్తహస్తాలే చూపించారు. రోహిత్ వేముల, మంథిని మధుకర్, ప్రణరు వంటి ఘటనలకు స్పందించకపోవడంతో దళిత వర్గాలలో కేసీఆర్‌పై ఉన్న నమ్మకం సన్నగిల్లింది.
ఇప్పుడు కుటుంబానికి 10 లక్షలు ఇవ్వగలిగినప్పుడు, భూమి ఇవ్వడం సాధ్యపడేది కాదా? మూడెకరాల పథకం మూలకుపడేసినప్పుడు, 40వేల కోట్లు మాత్రం ఎట్లా సమకూరుతాయి? ఇవన్నీ తలెత్తుతున్న ప్రశ్నలు. ఆలోచనలు ఆకాశంలో ఉన్నతంగా ఉన్నంత మాత్రాన, అన్నీ జరగవు. ఆచరణలో చిత్తశుద్ధి కావాలి. అలాగని, సత్సంకల్పాలను అనుమానించలేం. కాకపోతే, నిలకడైన, ఆచరణ సాధ్యమైన, వాస్తవంగా ప్రయోజనకరమైన ఆలోచనలు చేయడం, చేసినవాటిని తప్పనిసరిగా అమలుచేయడం జరగకపోతే ఆ మాటలు నీటి మూటలుగా మిగిలిపోతాయి. ఈ దళితబంధు పథకం అలా కాదని ఆశిద్దాం.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12వేల మంది దళితులు లక్షాధికారులు కావడం ఆహ్వానించదగ్గ విషయమే. మొత్తం దళిత జనాభాలో ఈ సంఖ్య ఏ పాటిది అన్న ప్రశ్న ఎలాగూ ఉంటుంది. అయితే, లబ్దిదారులకు ఆ డబ్బును సుస్థిర ఆదాయమార్గాలుగా మలచుకునే అవకాశాలు, మార్గదర్శకత్వం ఉంటే ఈ వితరణ సద్వినియోగం అవుతుంది. దీనిలో ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి, అధికారుల దాకా ఎంతెంత ఆశిస్తారో, చివరకు లబ్దిదారుడికి ఏ మాత్రం దక్కుతుందో తెలియదు! ఈ కొత్త సాధికారతా పథకం ప్రకటించడానికి ముందే నల్లగొండజిల్లా దళిత బాలికపై లైంగికదాడి, హత్య కలకలం సృష్టించింది. నిన్నటికి నిన్న వనపర్తి జిల్లాలో చదువు'కొన'లేక దళిత విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దళిత సాధికారిత ద్వారా ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఉచితాలు, పథకాలు సరే కానీ, విద్యా, వైద్యం, దళితుల ప్రాణాలకు రక్షణ, సమస్త వ్యవస్థలకు వారిపై గౌరవం కల్పించడం ప్రభుత్వం నిర్వర్తించవలసిన కర్తవ్యాలలో ముఖ్యమైనవి. అవి చేయకుండా ఇవి ఎన్ని చేసినా ఏం ఉపయోగం? ఎన్నో ఏండ్లుగా వాయిదా పడుతూ వస్తున్న దళిత సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించడం కోసమే కేసీఆర్ ఈ పథకం ప్రారంభించారని అనుకుందాం. దళితుల విషయంలో గతంలో జరిగినట్టు కాక ఈ 'దళితబంధు' అన్నా బంద్ కాకుండా కొనసాగాలని కోరుకుందాం.