Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రమంతా తడిలో తల్లడిల్లుతోంది. గత మూడు రోజులుగా విడవకుండా ముసురుకున్న ముసురుతో ప్రజల కష్టాలూ రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు పడతాయని హెచ్చరిస్తుండటంతో వరదల ప్రమాదాలూ ఎదురుకావచ్చని ప్రజలు భయపడుతున్నారు. ఒకవైపు గత సంవత్సరం నుండి కొనసాగుతున్న కరోనా రెండవ దశ, మూడోదశ అనే భయాలపై చర్చ సాగుతుండగానే ముసురు అలజడి మొదలైంది.
వాగులు పోటెత్తుతున్నాయి. చెరువులు అలుగుదుంకుతున్నాయి. ప్రాజెక్టుల గేట్లు తెరచుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ఊర్లకు ఊర్లకూ మధ్య రహదారుల సంబంధాలు తెగిపోయాయి. ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అటు కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలోని కిన్నెరసాని ప్రాజెక్టు నిండిపోవడంతో పరిసర గ్రామాలకు ప్రమాదం పొంచి ఉంది. ఇటు నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్జిల్లాల్లో చెరువులు, వాగులు పొంగిపొరలిపోతూ దారులను జలమయం చేశాయి.
కేవలం రహదారుల ముంపేకాక పంట పొలాలన్నీ ముంపునకు గురయి రైతులకు దిక్కుతోచని పరిస్థితి కలిగిస్తున్నాయి. వేల ఎకరాల పొలాలు నీటమునిగిపోయి నానుతున్నాయి. రైతులకు నీరులేకపోతే ఎంత కష్టమో, నీళ్ళు ముంచెత్తినా అంతే ఆపద తలెత్తుతుంది. ఇక గ్రామాల్లో పనులుచేసేందుకు ముసురు అడ్డంకిగా మారింది. అసలే కరోనాతో పనులు లేక, ఉపాధి కరువై ఇక్కట్లకు గురవుతున్న వ్యవసాయ కార్మికులు ఈ వర్షాలతో మరింత ఆవేదన చెందుతున్నారు. కడుపులో చల్ల కదలకుండా ఇండ్లలోనే ఉండగలిగే వాళ్ళకు ముసురు కూడా చల్లగానే ఉంటుంది. కానీ దినదినం కూలీకోసం ఎదురుచూసే వాళ్ళకు బతుకు భారమవుతుంది. పట్టణాల్లోనూ నిర్మాణ రంగంలోని కార్మికుల పనులన్నీ ఆగిపోయి అడ్డాలన్నీ వెలవెల బోతున్నాయి.
ఇక ప్రతి వర్షాకాలంలోనూ వరదలు ముంచెత్తి తీవ్ర ఇబ్బందులు కలిగించే ప్రాంతం భద్రాచలం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల అది మరింత పెరిగి భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని ఎప్పుడు ముంచేస్తుందా అని ఆ చుట్టుముట్టు గ్రామాల ప్రజలు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. అటవీ ప్రాంతాలలో, గిరిజనగూడేలలో ఇప్పటికే ఈ ముసురుతో అనేక వ్యాధులు ప్రబలుతున్నాయి. డెంగ్యూ, వైరల్ జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా మొదలైన రోగాలు విజృంభించడం ప్రతియేడూ జరుగుతున్నదే. ఇప్పుడు కూడా జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. ఇంకోవైపు దారులు తెగిపోయి వైద్యం కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్ళేందుకు నానా ఇబ్బంది పడుతున్నారు.
ఇది కేవలం గ్రామీణ ప్రాంతాలకే కాదు పట్టణ ప్రాంతాలలో, హైదరాబాద్ జంట నగరాలలో కూడా ఈ ముసురుతో దోమలు విపరీతంగా పెరిగాయి. గుంతలు, నిలువ నీటి ప్రదేశాలూ అధికంగానే ఉన్నాయి. వానాకాలంలో రోగాల ముప్పు పొంచి ఉంటుంది. ఎడతెరిపిలేని వానతో సీజనల్గా వచ్చే అనారోగ్య సమస్యలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే కరోనా రెండవ దశ ఇంకా మనల్ని వీడిపోక పోగా, తిరిగి కేసులు పెరుగుతున్నాయి. ఒకవైపు ఆ కేసులపై కేంద్రీకరించిన అధికారులు సాధారణంగా వచ్చే వ్యాధుల నివారణపై దృష్టి పెట్టాల్సి ఉంది. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే జ్వరపీడితులు పెరిగి ఆసుపత్రులు నిండుతున్నాయి. ముసురుతో సామాన్య ప్రజలు ముప్పేటదాడికి గురవుతున్నారు. ఒకవైపు ఉపాధిలేక కుటుంబ పోషణ ఎలాగో అర్థంకాని స్థితి, మరోవైపు కరోనా భయాలు, ఇప్పుడు జ్వరాలూ, మలేరియాలు కమ్ముకుంటున్నాయి.
ప్రభుత్వాలు వెంటనే ప్రజల పరిస్థితులను పరిశీలించి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చే విష జ్వరాలు కరోనా కంటే ఎక్కువ మందిని బలితీసుకుంటాయి. ఆ ప్రాంతాలలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి కావాల్సిన వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు పూనుకోవాలి. దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలేవీ ఇప్పటి వరకు వైద్య వ్యవస్థ తీసుకోలేదు. కరోనా యేతర వ్యాధులకు వైద్య సదుపాయాన్ని పెంచుకోవాల్సి ఉంది. మందులు, సిబ్బందిని ముందుగా సమాయిత్తపరచుకోవాలి. అసలే మనకున్న వైద్య సిబ్బంది చాలా తక్కువ. కాగా ఈ మధ్యనే పదకొండు వందల మంది కాంట్రాక్టుపై పనిచేసే నర్సులను విధుల నుండి తొలగించారు. రేపు ప్రజల వైద్యావసరాలు పెరిగి ఆసుపత్రులు నిండితే ప్రభుత్వం చేతులెత్తేసే పరిస్థితి వస్తుంది.
ప్రజలకు అధికంగా రక్షిత మంచినీరు లేకనే అనేక రోగాల బారినపడతారు. ఇలాంటి పరిస్థితుల్లో రక్షితమైన మంచినీళ్ళు అందరికీ అందించేందుకు చర్యలు తీసుకోవాలి. సామాన్యులు కోల్పోయిన ఉపాధి అవకాశాలను పెంచేందుకు పూనుకోవాలి. నిరవధికంగా కురుసే వర్షాల కారణంగా వీధులు, డ్రయినేజీలు చెత్తాచెదారాలతో కాలుష్యాన్ని పెంచుతున్నాయి. పారిశుద్ధ్య పనులను చేపట్టి కాలుష్యాలను నిరోధించాలి. ఇప్పటి నుండే ఈ సమస్యలపై దృష్టిపెట్టి చర్యలు తీసుకుంటనే ముసురుతో వర్షాలతో అతలాకుతలమయిన ప్రజలను ఆదుకోగలుగుతాము. లేదంటే వ్యాధులతో బాధలతో ప్రజలు తల్లడిల్లుతారు.