Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడాసంబరం ప్రారంభమైంది. ఒలింపిక్స్ అంటేనే ఆతిథ్య దేశంలో ఏడాది ముందే సందడి మొదలైపోతుంది. ఇక ఒలింపిక్స్ ఏడాదిలోకి అడుగు పెట్టాక ఆ సందడి మరో స్థాయికి చేరుకుంటుంది. చివరి వంద రోజులైతే టార్చ్ ర్యాలీలు, స్టేడియాల ముస్తాబు, వాలంటీర్ల శిక్షణ, ప్రచార కార్యక్రమాలతో ఆతిథ్య నగరం కళకళలాడిపోతుంటుంది. మహా క్రీడా సంబరానికి ఆతిథ్యమిస్తున్న ఆదేశంలో ప్రజలు ప్రపంచాన్ని చూస్తారు. కానీ నేడు జపాన్‌ది ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి. టార్చ్ ర్యాలీలు సహా ఒలింపిక్స్ ప్రచార కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. 'మాకొద్దీ ఒలింపిక్స్' అంటూ జపాన్‌లో 80శాతం ప్రజలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌ను రద్దు చేయాలంటూ ఆతిథ్య నగరానికి చెందిన ఆరు వేల మంది వైద్యులు ఆ దేశ అధ్యక్షుడికి లేఖ రాశారు. వీటన్నింటి మధ్య మహా క్రీడా సంగ్రామం నిన్న మొదలైంది. ఏదిఏమైనా ప్రాంతాలకు, మతాలకు అతీతంగా సౌభ్రాతృత్వం విరజిమ్మే ఆటల సింగిడిలో పాల్గొంటున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు.
2020లోనే జరగాల్సిన ఒలింపిక్స్ కరోనా విజృంభణతో వాయిదా పడ్డాయి. ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి. మొదటి ప్రపంచ యుద్ధంతో 1916లో, 2వప్రపంచ యుద్ధంతో 1940,44లలో పూర్తిగా రద్దయ్యాయి. మరెప్పుడూ అలా జరగలేదు. గతేడాది ఒలింపిక్స్ నిర్వహణకు ఇబ్బంది ఉండదనే అందరూ భావించారు. కానీ, కరోనా రెండోదశ విజృంభణతో జపాన్‌లో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. జనాలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో టోక్యో సహా ఆరు ప్రాంతాల్లో ఆత్యయిక పరిస్థితి విధించారంటే పరిస్థితి అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేడు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు ఐఓసీ ప్రకటించింది. ఒలింపిక్స్‌లో పాల్గొనబోయే క్రీడాకారుల సంఖ్య 11వేలు పై చిలుకే.. సహాయ సిబ్బంది మరో 5వేలు.. వీరు కాక వాలంటీర్లు మొత్తంగా 60 వేల మంది ఉంటారు. ఒలింపిక్స్ కోసమని ఎన్నో ఏండ్లుగా ఎంతో శ్రమించి, ఇప్పటికే రూ.18 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసిన జపాన్ ప్రభుత్వం... ఇప్పుడు క్రీడలను రద్దు చేస్తే ఆ శ్రమ, ఖర్చు రెండూ బూడిదలో పోసిన పన్నీరవుతుందని భావిస్తోంది. అందుకే ఒలింపిక్స్‌పై వెనక్కి తగ్గేది లేదని, ప్రజలకు ఏ విధమైన ఇబ్బందీ కలగకుండా, సురక్షితంగా క్రీడలను నిర్వహిస్తామని ప్రధాని యోషిహిదే సూగా నొక్కి వక్కాణించినట్టే క్రీడలు ప్రారంభమైయ్యాయి.
ఒలింపిక్స్ చరిత్రలోనే ఇది నవశకం. ఎన్నో పరిమితులు, సవాళ్లను ఎదుర్కొంటూ విశ్వక్రీడోత్సవాలకు ఆతిథ్యమిస్తున్నది. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలుపరచడంలో భాగంగా పదిరోజుల క్రితమే టోక్యోలో అత్యయిక స్థితి విధించారు. ప్రత్యక్ష ప్రేక్షకులుండరు. పతక విజేతలను సత్కరించడానికి అతిథులూ ఉండరు. రోబోలు, వర్చువల్ రియాల్టీలతో క్రీడాల నిర్వహణకు సాంకేతిక సొబగులద్దుతున్నారు. ఈసారి లింగపరమైన సమతౌల్యం పాటించేలా కనీసం 49శాతం మహిళలు పాల్గొంటారని ఐఓసీ ముందుగానే ప్రకటించింది. ఇక క్రితంసారి రియోలో 13క్రీడాంశాల్లో పాల్గొన్న ఇండియా టోక్యోలో ఆ సంఖ్యను 18కి విస్తరించడం పతకాల విజయావకాశాల్ని ఏ మేరకు మెరుగుపరుచుకుంటారని కోరుకుందాం.
టోక్యో వెళ్లిన భారత జట్టులో 50మంది హరియాణా, పంజాబ్‌లకు చెందినవారే ఉన్నారు. దేశ జనాభాలో కేవలం నాలుగు శాతమే ఉన్న ఆ రెండు చిన్న రాష్ట్రాలూ 40శాతం ఒలింపియన్లను తయారు చేస్తే.. తమిళనాడు, కేరళ, యూపీ, మహారాష్ట్ర, మణిపూర్ సైతం తమవంతు భూమిక పోషించాయి. 138కోట్ల సువిశాల భారతావనిలో రాష్ట్రాలవారీగా, జాతీయస్థాయిలో క్రీడావికాస ప్రణాళికలు చురుగ్గా అమలు జరిగి ఉంటే ఏండ్లతరబడి పతకాల దుర్భిక్షం ఉండేది కాదు. ఈసారి షూటింగ్, జావెలిన్ త్రో, హాకీ, షటిల్ బ్యాడ్మింటన్, ఈత పోటీల్లో మనవాళ్లు దీటైన పాటవ ప్రదర్శన చేయగలరంటున్నా విజయావకాశాలపై ధీమాకి వీల్లేదు. ప్రతి పాఠశాలలో ఆటస్థలం, క్రీడాసామగ్రి విధిగా ఉండాల్సిందేనన్న విద్యాహక్కు చట్టం అమలుకానంత వరకూ ఈ లోటు ఉంటుంది. క్రీడల్ని ప్రోత్సహించడంలో మందకొడిగా ఉన్న రాష్ట్రాలన్నీ గుర్తెరగాల్సింది ఏమిటంటే వ్యాయామ విద్య, శారీరక శ్రమ అనేవి పిల్లల ఏకాగ్రతను, బుద్ధిని వికసింపజేస్తాయి. వారిలో కలివిడితత్వాన్ని పెంపొందించి, ఓటమీ జీవితంలో భాగమేనన్న సత్యాన్ని బోధపరుస్తాయి. రేపటి పౌరుల భవిష్యత్తుకు దోహదపడేలా పటిష్ట క్రీడా సంస్కృతికి కేంద్రం, రాష్ట్రాలు కృషిచేయాలి. ఆ క్రమంలో సహజసిద్ధ ప్రతిభా సంపన్నులు వెలికివస్తే అంతర్జాతీయ వేదికలపై భారత్ తలెత్తుకుని నిలబడగల్గుతుంది!
ఐదేండ్ల క్రితం భారీ అంచనాలతో రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత బందం కేవలం రెండు పతకాలతో తిరిగి వచ్చింది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో పీవీ సింధు రజతం, మహిళల రెజ్లింగ్‌లో సాక్షి మలిక్ కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. రియో క్రీడల్లో భారత్ నుంచి 15 క్రీడాంశాల్లో 117 మంది క్రీడాకారులు బరిలోకి దిగారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి అత్యధికంగా 18 క్రీడాంశాల్లో 127 మంది క్రీడాకారులు పతకాల వేటకు వెళ్లనున్నారు. గత ఐదేండ్ల కాలంలో భారత క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తుండటం... అనేక పతకాలను కొల్లగొడుతుండటంతో... టోక్యో ఒలింపిక్స్‌లో మనోళ్లపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలు నిజం కావాలని ఆశిద్దాం.