Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజకీయ ఘోషయాత్రలో నేతలుంటే, మా గోస పట్టించుకునేవారేరంటూ జనం వాపోతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ హడావుడి మొదలైంది. హుజూరాబాద్ శాసనసభ సభ్యత్వానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన రోజు నుంచి... ఇంకా చెప్పాలంటే ఆయన ఆ పదవికి రాజీనామా చేస్తారనే వార్తలు తెలిసినప్పటి నుంచి ఈ వేడి రాజుకుంది. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తున్నది. అక్కడ గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్... పీసీసీ చీఫ్ రేవంత్్ సారధ్యంలో గతంలో కోల్పోయిన వైభవాన్ని, శక్తిని కూడగట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నది. అందుకనుగుణంగా వివిధ అంశాలపై ధర్నాలు, రాస్తారోకోలతో తన సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఇలా ప్రధాన పార్టీలన్నీ ఇప్పుడు హుజూరాబాద్ ఓటర్లకు 'జీ హుజూర్...' అనటంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాయి. 'అర్జునుడికి చెట్టు కాదు, చెట్టు మీద పిట్ట కాదు... ఏకంగా ఆ పిట్ట కన్ను మాత్రమే కనబడుతున్నట్టుగా...' ఇప్పుడు గులాబీ, హస్తం, కమలం పార్టీల యావంతా అక్కడి సీటుపైనే ఉండటం గమనార్హం.
ఈ రాజకీయ వైకుంఠ పాళిలో పడి...అటు కమలనాథులు, ఇటు గులాబీ దళపతి జనాన్ని గాలికొదిలేశారు. కరోనా విలయాన్ని, అది సృష్టించిన బీభత్సాన్ని, నష్టాన్ని... మూడో వేవ్ హెచ్చరికల్ని బేఖాతరు చేశారు. 2020 మార్చిలో ప్రారంభమైన కోవిడ్ మహమ్మారి... ఇప్పటికీ జడలు విప్పుతూనే ఉన్నది. ఇంతకాలమైనా తెలంగాణలో దాని బారిన పడుతున్న వారి సంఖ్య మాత్రం తగ్గటం లేదు. రోజుకు సగటున 500 మందికి కోవిడ్ సోకుతున్నది. ఆదివారం కూడా మొత్తం 494 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, నలుగురు మరణించారు. దీన్నిబట్టే పరిస్థితి ఎంత ఆందోళనకరమని అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో కరోనా తొలి దశ నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం 3,984 మంది దాని బారిన పడి మరణించారు. ఇది అధికారిక లెక్క మాత్రమే. అనధికారికంగా ఆ సంఖ్య ఇంకా అధికంగా ఉండొచ్చని అంచనా. ఈ నేపథ్యంలో ఆయా కుటుంబాలన్నీ చిన్నాభిన్నమయ్యాయి. ఇంట్లో పెద్ద వారిని, కుటుంబాన్ని పోషించే యజమానులను కోల్పోయిన సంఘటనలు అనేకం. తల్లిదండ్రులిద్దరూ మరణించటంతో అనాథలైన పిల్లల కథనాలు కంటతడి పెట్టిస్తున్నాయి. కోవిడ్‌తో ఆస్పత్రుల పాలై, ఫలితంగా అప్పుల పాలైన కుటుంబాలు ఉన్నందంతా అమ్ముకుని.. నమ్ముకున్న వారు, చేరదీసే వారు లేక బిక్కుబిక్కు మంటున్నాయి. ఉన్నత విద్యనభ్యసించి... ఇప్పటిదాకా గౌరవంగా బతికిన ప్రయివేటు టీచర్లు, అధ్యాపకులు, ఇప్పుడు బడులు లేకపోవటంతో ఇడ్లీ, బజ్జీల బండ్లకు పరిమితమైపోయారు. మరికొందరు ఆత్మాభిమానమనే ట్యాగ్‌లైన్‌ను ఇంటి గుమ్మానికి వేలాడదీసి ఉపాధి హామీ, భవన నిర్మాణం తదితర కూలి పనులకు వెళుతున్నారు. విద్యావాలంటీర్లు తమను రెన్యూవల్ చేయకపోవటంతో సర్కారు వైపు దీనంగా చూస్తున్నారు. కోవిడ్ మొదటి, రెండో దశల్లో తమ ప్రాణాలను సైతం లెక్కచేయక వైద్య సేవలందించిన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ నర్సులు... అవసరం తీరాక ఇప్పుడు సర్కారు 'కాదు... పొమ్మనటంతో...' తమ ఉసురును తామే తీసుకుంటున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు, రంగాల్లో పని చేసే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, డైలీవేజ్, పార్ట్‌టైం, కంటింజెంట్ ఉద్యోగులు, సిబ్బంది... విధులు కోల్పోయి కొందరు వీధి పోరాటాలకు సిద్ధమవుతుంటే... మరికొందరు తమ మొర ఆలకించండి మహాప్రభో అంటూ దీనంగా వేడుకుంటున్నారు. వీరుగాక పలు పరిశ్రమలు, కంపెనీల్లో పనిచేసే కార్మికులు... తమకు కనీస వేతనాలు అమలు కాకపోవటంతో అర్థాకలితో అలమటిస్తూ ఆందోళనబాట పడుతున్నారు. వీధుల్లో తిరిగే చిరు వ్యాపారులు, చిల్లర వర్తకులు... గిరాకీల్లేక విలవిల్లాడుతున్నారు. ఇలా ఏ రంగానికి ఆ రంగం.. ఏ తరగతికి ఆ తరగతికి కరోనా దెబ్బకి కుదేలైపోయింది. వీరిని ఆదుకుని, అండగా నిలవాల్సిన పాలకులు... హుజూరాబాద్ బరిలో నిలబడి కబడ్డీ కబడ్డీ అని అరుస్తుంటే... ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్షం సైతం అదే ఒరవడిలో కొట్టుకుపోతున్నది. ఈ క్రమంలో దేశానికే వేగుచుక్క కేరళ రాష్ట్రం... అక్కడి ప్రజలను ఆదుకునేందుకు చేసిన ప్రయత్నాలను, చేపట్టిన కార్యక్రమాలను మనం మననం చేసుకోవాలి. సీఎం పినరయి విజయన్ నేతృత్వంలో రెండోసారి విజయ పతాకాన్ని ఎగరేసిన ఎల్డీఎఫ్ సర్కారు... కోవిడ్ వల్ల సంభవించిన ఆర్థిక సంక్షోభాన్ని నివారించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వివిధ శాఖలు, విభాగాలు, రంగాల వారీగా ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి మొత్తం 77, 350 కొలువులను సృష్టిస్తామంటూ ప్రకటించి శభాష్ అనిపించుకుంది. ఇందుకోసం వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రజా పనుల శాఖతోపాటు ఇతర డిపార్టుమెంట్ల కోసం ఏకంగా రూ.2,464 కోట్లను కేటాయించింది. మన తెలంగాణ ప్రభుత్వ పెద్దలు కూడా ఆ దిశగా ఆలోచించి... త్వరితగతిన ప్రజలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగు పరచాలి. లేదంటే ఇప్పుడు కేవలం కుటుంబాలకే పరిమితమై, అక్కడే రగులుతున్న ఆరోగ్య, ఆర్థిక సంక్షోభాలు... రేపు మరింతగా ముదిరి సామాజిక సంక్షోభాలకు దారితీయటం ఖాయం.