Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెరూ అధ్యక్ష ఎన్నికల్లో పెరూ ఉచిత పార్టీకి చెందిన వామపక్ష అభ్యర్థి పెడ్రోక్యాస్టిలో గెలుపొందాడు. ఆయనతో పోటీపడ్డది మితవాద అభ్యర్థిని పెరూ మాజీ అధ్యక్షుడు అల్బర్ట్ పూజిమోరి కుమార్తె కైకో పూజిమోరి. క్యాస్టిలోకి 50.13శాతం ఓట్లు రాగా, కైకో పూజిమోరికి 49.87శాతం ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపు చివరిలో మోసం జరిగిందని ఆరోపిస్తూ కైకో పూజిమోరి అభ్యంతరం తెలిపారు. అమెకు కార్పొరేట్ శక్తుల పూర్తి మద్దతు ఉన్నది. అందుకే జూన్ 6న ఎన్నికలు జరిగి ఓట్ల లెక్కింపు పూర్తి అయినా ఆరు వారాల తరువాత ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. పెరూ స్వతంత్ర దినం అయిన జూలై 28న క్యాస్టిలో పదవీ ప్రమాణం చేయనున్నారు.
కైకో పూజిమోరి ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ 945 పిటీషన్లు దాఖలు చేసినా ఏ ఒక్కటీ విచారణకు నిలువలేదు. ఎన్నికల పరిశీలకులుగా ఉన్న లాటిన్ అమెరికా సంస్థల సభ్యులు ఎన్నికల అవకతవకలపై ఎలాంటి ఫిర్యాదులూ చేయలేదు. వామపక్ష నేత క్యాస్టిలో అధికారంలోకి వస్తే గనులను, పరిశ్రమలను జాతీయం చేస్తారని, రాజ్యాంగాన్ని మార్చివేస్తారని అమెరికా పెద్దఎత్తున ప్రచారం చేసింది. నయా ఉదారవాద విధానాలకు పూర్తి వ్యతిరేకంగా ఖనిజ సంపద పుష్కలంగా ఉన్న పెరూలో పేదిరికం ఉండటానికి వీలులేదని క్యాస్టిలో ఇచ్చిన పిలుపునే ప్రజలు ఆమోదించి ఆయనను గెలిపించారు.
పెరూ ఆర్థిక మాంద్యంలో ఉన్నది. జీడీపీ 11శాతం దిగజారింది. నిరుద్యోగం, పేదరికంతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. 3కోట్ల 30లక్షల జనాభా గల దేశంలో కరోనా వల్ల 1,84,000మంది ప్రాణాలు కోల్పోవడం అక్కడి ఆరోగ్య వ్యవస్థ దారుణమైన పరిస్థితిని వెల్లడిస్తోంది.
రాగి, జింక్ లాంటి ఖనిజాలను ఎగుమతి చేసే దేశాలలో పేరూది ప్రపంచంలోనే రెండవ స్థానం. కానీ ఖనిజాల ధరలు దారుణంగా పడిపోవడంతో పెరూ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. జీడీపీలో పర్యాటకరంగం 10శాతం ఆదాయ వనరుగా ఉన్నది. ఆర్థిక సంక్షోభానికి కరోనా సంక్షోభం తోడుకావడంతో పర్యాటక రంగం స్తంభించిపోయింది. పెరూ ఆహార పదార్థాల దిగుమతిపై పూర్తిగా ఆధారపడిన దేశం. గోదుమలు ప్రధానంగా రష్యా, అర్జెంటీనా, అమెరికా నుండి దిగుమతి అవుతాయి. అక్కడ నుండి దిగుమతి అయ్యే ఆహార ధాన్యాల ఆధారంగానే కార్మికులు, ప్రజలు ఎంత ఆహారం తీసుకోవాలో కూడా నిర్ధారణ అయ్యే పరిస్థితి ఉన్నది. తాము ఎగుమతి చేసే ఖనిజ సంపద ధరలు పడిపోయి మరో వైపున ఆహార ధాన్యాల ధరలు పెరగడంతో కొనుగోలు శక్తిలేక దేశంలో పేదరికం 30శాతం పెరిగిపోయింది.
పెరూ ఆర్థిక వ్యవస్థలో చైనాతో ఉన్న వాణిజ్య లావాదేవీలు చాలా కీలక పాత్ర వహిస్తాయి. పెరూ నుండి చైనా 58 బిలియన్ డాలర్ల సరుకులు దిగుమతి చేసుకుంటుంది. దానితో పాటు పెరూలో ఉత్పత్తి అయ్యే రాగిలో సింహభాగం చైనానే దిగుమతి చేసుకుంటుంది. దీని ద్వారా మరో 30 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతున్నది.
పెరూ రాజకీయ వ్యవస్థలో 1990లో షైనింగ్ పాత తీవ్రవాదంపై జరిగిన యుద్ధంలో 70వేల మంది చంపబడ్డారు. వామపక్ష ఉద్యమాలను అంతం చేసారు. పెట్టుబడిదారులను ప్రశ్నించేవారిని లేకుండా చేశారు. అప్పుడే మితవాది పిజీమోరో అధ్యక్ష ఎన్నికలలో గెలిచి 1993లో రాజ్యాంగాన్ని సవరించి నియంతృత్వాన్ని నెలకొల్పి ఆర్థిక వ్యవస్థలో ప్రయివేటీకరణను ప్రవేశపెట్టారు. రాజకీయ అవినీతి పెరిగిపోయి ఇప్పటి వరకు పనిచేసిన ప్రతి అధ్యక్షుడు అవినీతి ఆరోపణలతో జైళ్ళపాలైనారు.
ఈ నేపథ్యంలో వామపక్షవాది పెడ్రో క్యాస్టిలో దేశ రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. ఆయన రైతు బిడ్డ, సానిక జాతుల వ్యక్తి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయ సంఘాలలో క్రీయాశీలంగా ఉండి, ట్రేడ్ యూనియన్ నాయకుడుగా గుర్తింపు పొందాడు. 2017లో పెరూ ఉపాధ్యాయులు సమ్మెతో దేశాన్ని స్తంభింపచేశారు. ప్రయివేటు ఉపాధ్యాయుల కంటే తక్కువ జీతాలు ఇస్తున్నందుకు సమ్మె చేసి విజయం సాధించారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలలో కీలక భూమిక నిర్వహించిన క్యాస్టిలో దేశంలో గుర్తింపు పొందారు. అదే సందర్భంలో వైద్య సిబ్బంది, గని కార్మికులు పెద్ద పోరాటాలు చేశారు. అందులో క్యాస్టిలో కీలక పాత్ర పోశించారు. క్యాస్టిలో ట్రేడ్ యూనియన్ నాయకుడి నుండి రాజకీయ నాయకుడిగా ఎదిగి వచ్చారు. జూన్లో జరిగిన ఎన్నికలలో వామపక్ష అభ్యర్థిగా పోటీ చేసి కార్మికులు, పేదలు, స్థానిక జాతులు, వామపక్షవాదుల నేతగా గెలుపొందారు. నయా ఉదారవాద విధానాలపై నిక్కచ్చిగా పోరాడుతున్నారు. దేశంలోని గనులను, పరిశ్రమలను జాతీయం చేయడానికి, రాజ్యాంగాన్ని సవరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రేపు రేపు అమెరికా సామ్రాజ్యవాదులు, పెరూలోని పెట్టుబడిదారులు పన్నే కుట్రలను ఓడించి ఒక నికార్సయిన వామపక్షాన్ని పటిష్టపర్చుకునే అవసరం ఉన్నది.
తనకు అధ్యక్షుడిగా ఇచ్చే జీవితకాలపు జీతభత్యాలను ఆయన తీసుకోనని ప్రకటించారు. తనకు ఉపాధ్యాయుడిగా వచ్చే జీతంలోనే సరిపెట్టుకుంటానని, ఇతర పార్లమెంటు సభ్యుల జీతభత్యాలను కూడా సగానికి తగ్గిస్తామని ప్రకటించారు. పెరూ నయా ఉదార విధానాలపై పోరులో ఒక అడుగు ముందుకు వేసింది. లాటిన్ అమెరికాలో ప్రత్యేకించి ప్రపంచ వ్యాపితంగా పోరాడే వామపక్ష శక్తులకు పెరూలో సాధించిన విజయం ప్రేరణగా నిలుస్తుంది.