Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో ప్రజా తీర్పు అభాసుపాలు కావడం ఓ ఆనవాయితీగా మారింది. ప్రజాస్వామ్య నియమాలకు వ్యతిరేకంగా, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఫిరాయింపులకు తెగబడటం సర్వసాధారణమైపోయింది. ఈ దుస్సాంప్రదాయం కాంగ్రెస్ కాలం నాటిదే అయినా, బీజేపీ అధికారంలోకొచ్చాక తీవ్రరూపం దాల్చడం గడిచిన ఏడేండ్లుగా చూస్తున్నదే. తాజాగా జార్ఖండ్ అధికారపక్షానికి చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వం నుండి బయటకు వస్తే రూ.50కోట్లుతో పాటు మంత్రిపదవి కూడా ఆఫర్ చేసారని ప్రకటించడం ఇప్పుడు మరోసారి ఈ చర్చకు కేంద్ర బిందువయింది.
2019లో జరిగిన జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఓడించి, జెఎమ్ఎమ్, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి ప్రజలు పట్టం కట్టిన విషయం తెలిసిందే. 81స్థానాలున్న శాసనసభలో 47 స్థానాలతో ఈ కూటమి అధికారం చేపట్టింది. కేవలం 6స్థానాల మెజారిటీ మాత్రమే ఉన్న ఆ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు ఎప్పుడు ఏవైపు నుండి ముంచుకొచ్చినా అవి అనూహ్యమైనవేమీ కావు. ఈ నేపథ్యంలో ఓ శాసనసభ్యుడి నుండి ఈ ఆరోపణలు వెలువడటం పలు అనుమానాలకూ, ఊహాగానాలకు తావిస్తోంది. అందుకే జార్ఖండ్‌లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయజూస్తోందని కాంగ్రెస్, జేఎమ్ఎమ్ తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. కానీ బీజేపీ ఈ ఆరోపణలు నిరాధారమైనవిగా కొట్టిపడేస్తోంది.
ఈ ఆరోపణలూ, కొట్టిపారేయడాలలో నిజా నిజాల సంగతి అటుంచితే, ఉన్న పరిస్థితుల నుండి కొన్ని అభిప్రాయాలూ అనుమానాలూ తలెత్తడం సహజం. ఇందులో ఇలా బేరసారాలకు పాల్పడవలసిన అవసరం ఎవరికుంటుందన్నది మొదటి అంశం. అధికారానికి కేవలం ఆరుసీట్ల దూరంలో ఉన్నందున ఆ అవసరం బీజేపీకి తప్ప మరెవరికి ఉంటుంది? కనుక దీనిని కాదనలేం. పైగా బీజేపీ కేంద్రంలో కొలువుదీరినప్పటి నుండీ, దేశంలో ఫిరాయింపుల నిరోధక చట్టం ఉనికే లేకుండా పోయింది కదా! ఇక.. మనది ప్రజాస్వామ్య దేశమనీ, ప్రజలే పాలకులనీ, ప్రజలు తమ విలువైన ఓటుతో ప్రభుత్వాలను ఎన్నుకుంటారనీ చెప్పుకోవడమే తప్ప, ఆ ప్రజా తీర్పును గౌరవిస్తున్నదెక్కడీ బీజేపీ గడిచిన ఏడేండ్లుగా ప్రజాతీర్పుకు భిన్నంగా ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను కూలదోస్తున్న తీరూ, దొడ్డిదారిన అధికారానికి అర్రులు చాస్తున్న తీరూ దేశమంతా కండ్లరా చూస్తూనే ఉంది. ప్రజలు ఓట్లేసి గెలిపించినవారి నుంచి అధికారాలు లాక్కుని, వారు ఓడించినవారు అందలమెక్కడం ఎంతటి దుర్మార్గం..! ఈతీరున వ్యవహరిస్తే ప్రజల ఓటుకు విలువేముంటుందీ, ఎన్నికలకు అర్థమేముంటుంది. కానీ బీజేపీ హయాంలో ఇవి సహజాతాలుగా మారిపోయాయి. అందువల్ల జార్ఖండ్‌లో నెలకొన్న పరిస్థితుల పట్ల వ్యక్తమవుతున్న అభిప్రాయాలనూ, ఆరోపణలనూ అంత తేలిగ్గా కొట్టిపారేయలేం.
ఫిరాయింపులకు తెగబడటంలో, ప్రత్యర్థులను ప్రలోభాలతో, బెదిరింపులతో లొంగదీసుకోవడంలో బీజేపీ ఏ విధంగానూ కాంగ్రెస్‌కు భిన్నమైనది కాకపోగా, రెండాకులు ఎక్కువే చదివిందనీ, ఎంతకైనా తెగిస్తుందనీ ఇప్పటికే అనేక సందర్భాలు రుజువు చేశాయి. ఏం చేసైనా సరే ఈ దేశ భూభాగాన్నంతా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న అధికారయావ తప్ప, రాజ్యాంగ లక్ష్యాలన్నా, రాజకీయ విలువలన్నా వీరికి ఏమాత్రం గౌరవం లేదని తేల్చి చెప్పాయి. నిన్న మధ్యప్రదేశ్‌లో, మొన్న కర్నాటకలో, అంతకు ముందు గోవా, అరుణాచలప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో, పలు ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ చేసిందేమిటి? ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయడం, అడ్డదారిలో గద్దెనెక్కడమే కదా. పుదిచ్చేరిలో తమకంటూ ఒక్క ఎమ్మెల్యే కూడా లేకున్నా, తమ అధికారాన్ని ఉపయోగించి, లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఎన్నికలకు ముందే అధికారపక్షాన్ని చీల్చి, ఫిరాయింపులను ప్రోత్సహించి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన ఘనులు వీరు. జయప్రదం కాలేకపోయారు గానీ రాజస్థాన్, బెంగాల్‌లలో కూడా వీరు చేసింది ఇదే కదా. వీటన్నిటికీ ప్రత్యర్థి పార్టీల బలహీనతలు, అంతర్గత విభేదాలే కారణం తప్ప తమ ప్రమేయమేమీలేదని బీజేపీ నేతలు కొట్టిపారేయవచ్చు. కానీ ఆ ఫిరాయింపుదారులంతా వెంటనే బీజేపీలో చేరడం, దొడ్డిదారిలో ఏర్పడిన ప్రభుత్వాలలో భాగస్వాములు కావడం దేనికి సంకేతం? ఇవన్నీ బీజేపీ ప్రమేయం లేకుండానే జరిగాయా? ప్రజా జీవితంలోని ఏ సమస్యపైనా కనీస శ్రద్ద చూపని బీజేపీ, తన అధికార వ్యామోహానికి ఎంతటి నీచానికైనా వొడిగడుతుందనడానికి ఈ పరిణామాలన్నీ ఉదాహరణలే. వ్యూహాలతో తప్ప తమ విధానాలతో ప్రజలను గెలువలేని వారు ఇంతకన్నా ఏమిచేయగలరు? కనుక ఇప్పుడు జార్ఖండ్‌లోనూ అదే పునరావృతం కానుందో లేదో వేచి చూడాలి.