Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ పోలీసు కమిషనరుగా వివాదాస్పద అధికారి రాకేష్ ఆస్త్తానాను కేంద్ర ప్రభుత్వం నియమించడం పౌర సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దేశ చట్టాలను, సర్వోన్నత న్యాయస్థానం తీర్పులను కూడా కాదని మోడీ సర్కార్ ఈ నియామకం చేపట్టడం అభ్యంతరకరం. గుజరాత్ కేడర్‌కు చెందిన ఆస్తానా ఆది నుంచి మోడీకి నమ్మిన బంటు. గోద్రా నరమేధం నాటి నుండి అన్ని కీలక సమయాల్లోనూ సంఫ్‌ుపరివార్‌కు అండగా నిలుస్తున్నారు. రేపోమాపో రిటైర్ కానున్న దశలో కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని పొడిగించి మరీ ఢిల్లీ కమిషనరుగా నియమించడం వెనుక మోడీ - షా ద్వయం కుట్ర దాగి ఉందన్నది బహిరంగ రహస్యం. దీనికంటే ముందే ఆయనను కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) అధిపతిగా నియమించాలని మోడీ సర్కార్ ప్రయత్నించింది. కానీ ఆరు నెలల కంటే తక్కువ వ్యవధిలో పదవీ విరమణ పొందనున్నవారిని సిబిఐ చీఫ్‌గా నియమించరాదనే నిబంధనను గుర్తు చేస్తూ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో గత్యంతరం లేక విరమించుకోవాల్సి వచ్చింది. ఢిల్లీ కమిషనరును కేంద్ర పాలిత కేడర్ నుంచి తీసుకునే సాంప్రదాయాన్ని కూడా కాలరాశారు. గతాన్ని పరిశీలిస్తే ప్రజాస్వామ్యయుత నిరసనలను అణిచివేయడమే లక్ష్యంగా దొడ్డిదారిలో ఆస్తానా అస్త్రాన్ని మోడీ సర్కార్ ప్రయోగిస్తోందా అనే సందేహం కలగకమానదు.
రాఫెల్ కుంభకోణంపై సిబిఐ కి ఫిర్యాదు అందిన సమయంలో ఆ సంస్థ అధిపతిపై అభాండాలు వేసి రాత్రికి రాత్రే పదవి నుంచి తప్పించిన డ్రామాలో కీలక పాత్ర పోషించింది ఆస్తానానే. అంతకు మునుపు బీహార్ దాణా కుంభకోణం, గోద్రా రైలు దాడి, అహమ్మదాబాద్ వరుస పేలుళ్లు, హార్దిక్ పటేల్‌పై దేశద్రోహం కేసు, తాజాగా నటుడు సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి అరెస్టు వ్యవహారంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధిపతిగా ఆయన వ్యవహరించిన తీరు.. ఇలా బీజేపీతో ముడిపడిన పలు కేసుల్లో ఆస్తానా చక్కటి ఫలితాలు సాధించి పెట్టి స్వామిభక్తి చాటుకున్నారన్నది ఆయన ట్రాక్ రికార్డ్.
జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోకి పోలీసులు చొరబడి విద్యార్థులపై 'దేశద్రోహుల' ముద్ర వేయడం, పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ప్రజానీకంపై కాల్పులు జరిపించడం.. దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు దోచిపెట్టే చట్టాలను రద్దు చేయాలని ఆందోళనలు చేస్తున్న రైతులపై కొనసాగిస్తున్న నిర్బంధం ద్వారా ఢిల్లీ పోలీసులను దుర్వినియోగం చేసి కేంద్ర హోంశాఖ ఇప్పటికే నిరంకుశత్వాన్ని చాటుకుంది. దీనికి తోడు ప్రజా ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా లెఫ్టినెంట్ గవర్నరును సైతం పావుగా వాడుకుంది. ప్రజలెన్నుకున్న ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను కాదని, కేంద్ర హోంశాఖ ఆదేశాలను అమలు చేయడానికి ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను వాడుకుంటున్నారు. కీలకమైన కమిషనర్ పదవిలో ఆస్తానాను నియమించడం ద్వారా కుత్సిత చర్యలను, కుట్రలను పరివార్ ఆదేశాల మేర విశృంఖలంగా అమలు చెయ్యాలన్నది కేంద్ర ప్రభుత్వ దుష్ట తలంపు అన్న విమర్శ సత్యదూరం కాదు.
ఢిల్లీ ఘర్షణలకు సంబంధించి తుది తీర్పులు వచ్చే సమయం ఆసన్నమైంది. అన్నదాతల ఉద్యమం రోజురోజుకూ విస్తరిస్తోంది. కోవిడ్ నేపథ్యంలో సర్వం కోల్పోయిన రాజధాని ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో శాంతియుత ప్రదర్శనలకు, నిరసనోద్యమాలకు అవకాశాలున్నాయి. వీటిని అణిచివేసే ఎత్తుగడలో భాగంగానే ఆస్తానాకు కేంద్రం ఢిల్లీ కమిషనరు పీఠం కట్టబెడుతోందన్న పౌర సమాజ ఆందోళన సహేతుకంగానే కనిపిస్తోంది. ఇంతటి దుర్మార్గం దాగుంది కాబట్టే ఆయన నియామకాన్ని వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ప్రజా ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని గౌరవించి ఆస్తానా నియామకాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవడం కేంద్ర ప్రభుత్వ కనీస బాధ్యత. రాజ్యాంగ విలువలను, సర్వోన్నత న్యాయస్థానం తీర్పులను పరిహాసం చేసేలా కేంద్రం ముందుకెళ్తే తిప్పికొట్టేందుకు ప్రజలు కంకణబద్దులు కావాలి.