Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఈ శిల్పులెవ్వరో... ఈ కూలిలెవ్వరో, పేరు లేనోళ్ళు ఘనకీర్తికల వోళ్ళు' అని పేర్లేలేని శిల్పుల కళా నైపుణ్యాలను చూసి వారిని స్మరించుకున్నాడు కవి. మన దేశంలో శిల్పకళతో అందాలొలికే మందిరాలన్నీ అక్కడ నెలవైవున్న దేవుళ్ళ పేరుమీదనో, కట్టించిన రాజుల పేరుమీదనో, స్థలాల పేరుతోనో పిలుస్తుంటారు. ఎక్కడ కూడా శిల్పుల పేర్లు కనపడవు. వినపడవు. అజంతా, ఎల్లోరా, హంపి, ఖజురహౌ దేవాలయాలు ఇంకా ఎన్నో... ఎక్కడ చూసినా కూలీల, శిల్పుల జాడలు కనరావు. కానీ ఒకే ఒక్క 'రామప్ప గుడి' శిల్పిపేరుతో ప్రసిద్ధి చెందింది. ఆ రామప్ప శిల్ప కళా నైపుణ్యానికే ఇప్పుడు ప్రపంచం జేజేలు పలుకుతోంది. ఇప్పుడది పాలంపేటకో, వరంగల్‌కో, ములుగుకో లేదంటే తెలంగాణకో చెందినది మాత్రమే కాదు. ప్రపంచ కళామతల్లి గళాన వారసత్వపు నగ. ప్రపంచ వారసత్వ కళాక్షేత్రంగా రామప్పను యునెస్కో గుర్తించడం తెలంగాణకు, మొత్తం తెలుగునేలకు గర్వకారణం.
ఎనిమిది వందల యేండ్ల క్రితం, కాకతీయుల కళావైభవానికి గుర్తుగా గణపతిదేవుని ఆస్థానంలోని సేనాని రేచర్ల రుద్రుడు ఆధ్వర్యాన నిర్మితమయిన అద్భుత కట్టడమే రామప్పగుడి. రామలింగేశ్వరాలయంగా భక్తులు గుర్తుచేసుకుంటున్నప్పటికీ కళాపారవశ్యంతో కన్నుల నిండా ఆనందంతో మైమరిచే సజీవ శిల్ప దృశ్య కావ్య ప్రాంగణం అది. కళాపిపాసకులను ఆకర్షించే నిత్య వీక్షణాక్షేత్రం. నల్లని రాళ్ళపై కదలాడే సాలభంజికలు, ముగ్ధమనోహర రూపపు పేరణీనృత్య భంగిమలు, మన హృదయాలపై మౌనముద్రలై వెలుగుతుంటాయి. కవుల ఊహల్లో భావతరంగాలై ఎగసిపడుతుంటాయి. అందుకే కవి 'ఈనల్లని రాలలో ఏ నవ్వులు దాగెనో, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో' అంటూ ఆలపించాడు. ఇలా చేయితో తాకితే సప్తస్వరాలు వినిపించగల శిల్ప స్తంభాలను శిలల నుండి సృజించిన శిల్పులెంతటి పనిమంతులు! అంతే కాదు, వందల యేండ్లుగా నిలిచివుండేట్లు సాంకేతిక నిర్మాణ కౌశలాన్ని పదమూడో శతాబ్దంలోనే ప్రదర్శించడం ఆశ్చర్యాన్ని గొలిపే విషయం. రాజుల ప్రాభవానికి గుర్తుగా, వారి మతావలంబనకు నిదర్శనంగా వెలిసిన ఆలయాలు అయినప్పటికీ నాలుగు దశాబ్దాల శిల్పుల, కూలీల నిరంతర శ్రమకు, కళా నైపుణ్యాలకు ఫలాలవి.
ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా అక్కడి సంస్కృతికి దాని స్వీయ చారిత్రకాభివృద్ధి, పరిణామం ఉంటాయి. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, నాటకం, పాట, నృత్యం, శిల్పం అన్నింటిలోనూ ఆయా వ్యవస్థల నీడలు కొనసాగినా ప్రజా సమూహపు జీవనంతో ముడిపడే ఉంటాయి. చరిత్రకు సంబంధించిన దేనినీ మనం వొదులుకోకూడదు. చరిత్రతో తెగదెంపులు చేసుకోవడం, మన జాతి వారసత్వాన్నుండి విడివడటం సరైనది కాదు. జన సామాన్యం దానిని ఆమోదించరు అంటాడు మావో. మన దేశంలోని ఏ కట్టడాలైనా అవి ఎందుకొరకు నిర్మించినవైనా వాటిలో నిగనిగమని మెరుస్తున్న అందం మానవశ్రమది. తాజ్‌మహల్, చార్మినార్ అయినా మహాబలిపుర గోపురమయినా, బౌద్ద స్తూపమయినా అవి మన చరిత్ర అందించిన వారసత్వ సంపదలు. వాటిని ఆ విధంగా భద్రపరచుకోవాలి. పరిక్షించాలి. కానీ మతతత్వంతో ఆలోచన చేసేవారు చరిత్రపై పగలు పెంచే ప్రయత్నం చేస్తుంటారు. చరిత్రలోని ఘటనలకు ఇప్పుడు తీర్పులు, శిక్షలు వేస్తుంటారు. అఘ్ఘనిస్తాన్ కాందహార్లలోని అనేక బౌద్ధ కట్టడాలను తాలిబాన్ ఉగ్రవాదులు అలానే శిథిలపరిచారు. అదొక ఉన్మాద చర్య.
కావున, ఇప్పటికయినా మన చారిత్రక వారసత్వ సంపదలను ఎంతో అపురూపంగా పరిరక్షించుకోవాల్సి ఉన్నది. కొందరు ఔత్సాహిక పురావస్తు పరిశోధకుల పర్యటనల పరిశీలనల ఫలితంగా తెలంగాణలో ఎన్నో ముఖ్యమైన ఆలయాలు, శాసనాలు, ప్రదేశాలు నిరాదరణతో నిర్లక్ష్యంతో పడివున్నాయని తెలుస్తున్నది. వాటిని కాపాడుకుని చరిత్రను సుసంపన్నం చేసుకోవాలి. రెండేండ్ల క్రితం రామప్ప ఆలయానికి ప్రమాదం రాబోతున్నదని, ప్రభుత్వం దానిని రక్షించాలని అనేకమంది సాంస్కృతిక రంగ కార్యకర్తలు, సాహితీవేత్తలు, చరిత్రకారులు ఆందోళన చేశారు. రామప్ప సమీపాన ఓపెన్‌కాస్ట్ గనుల బ్లాస్టింగ్ వల్ల, అండర్ పైపులైన్ల నిర్మాణం మొదలైన వాటివల్ల గుడికి ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. వాటిని నివారించి, ఇప్పటికయినా ప్రభుత్వాలు శిల్ప కళా సంపదను, ప్రపంచ గుర్తింపును పరిరక్షించుకునేందుకు చర్యలు చేపట్టాలి.
దీనితో పాటుగా గుజరాత్‌లోని 'థోలా వీరా'కు కూడా ఈ గుర్తింపు దక్కింది. హరప్పా నాగరికత కాలానికి చెందిన ఈ కట్టడం ఐదువేల సంవత్సరాల పూర్వమే అత్యంత ఆధునికంగా నిర్మించబడింది. గుజరాత్లో కచ్ జిల్లాలోని బచావూ తాలూకా లో నూటఇరువై ఎకరాల చతురస్రాకారంలో ఈ నగర నిర్మాణం జరిగింది. వేలయేండ్ల నాటి కోట, నగరం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపును పొందటం మనందరం సంతోషించదగిన సందర్భం.
శిల్పకళా, కట్టడాలూ, ఆలయాలు, మీనార్లు మహళ్ళు, చైత్యాలు, ఆరామాలు అన్నీ మన వారసత్వ సంపదలు. చరిత్రను కళ్ళముందుంచే ఆనవాళ్ళు. మన ప్రాచీన నిపుణతకు అద్దం పట్టే నిర్మాణాలు. వాటి అధ్యయనం, ఆస్వాదనలలోంచి వర్తమాన సంస్కృతీ ప్రయాణం జరగాలి. ఘనత వహించిన చరిత్ర పుటలను భవిష్యత్తరాలకు కానుకగా ఇచ్చేందుకు మనమూ సిద్ధంకావాలి. అమరశిల్పులు జక్కనలు, రామప్పలు మనకెందరో! వారందరికీ అభివందనాలు.