Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గ్రీన్ బుక్' ఒక ఇంగ్లీషు సినిమా. 'వైట్ బుక్' ఒక ప్రఖ్యాత నవల. 'రెడ్ బుక్' కూడా నవలే! మన రాష్ట్రంలో మొన్న అట్టహాసంగా పురుడు పోసుకున్న 'పింక్ బుక్' ఈ బాపతుది కాదు. దానికో లెక్కుంది. పనిలో పనిగా అధికార రంగు పులుముకుని ''తెలంగాణ సముద్ధరణ'' కోసం గత మాసాంతాన సాక్షాత్కరించింది ఈ 'గులాబీ పొత్తం'. ఈ 'పింక్ బుక్' తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారికి 'మార్గదర్శి' అన్నారు కేటీఆర్. జులై 28న ఆయన నుడివిన మాటేంటంటే 'పింక్బుక్' లక్ష్యం ఈఓడీబీ అని ఒక ఆంగ్లపత్రిక దాసింది. అంటే సులభతర వ్యాపారం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)కు దారులు పరుస్తుందట!
తెలంగాణ ఏర్పడిన తర్వాత 'తెలంగాణ స్టేట్ ఇండిస్టియల్ ప్రాజెక్టు అఫ్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం' దీన్నే ముద్దుగా టిఎస్ ఐపాస్ అంటున్నారు. పేరులోనే 'సెల్ఫ్ సర్టిఫికేషన్' ఉన్న సిస్టం కదా! అంటే ఒక కంపెనీ యజమాని తన దగ్గర 400మంది కార్మికులు పనిచేస్తున్నా, 39మందే పనిచేస్తున్నారని చెప్పినా అదే కరెక్ట్. వారికి నెలకు ఆరేడు వేలు వేతనం ఇస్తున్నా, ఇరవై వేల రూపాయలు ఇస్తున్నానని చెప్తే అదీ కరెక్టే. యజమాని ఒట్టేసి చెప్తే అదే ఫైనల్. అదీ సెల్ఫ్ సర్టిఫికేషన్ అంటే. పైగా సింగిల్ విండో తనిఖీ విధానమంటే అన్ని డిపార్ట్మెంట్లూ కలిసి యజమానికి చెప్పి మరీ తనిఖీలు నిర్వహించాలట. నిజానికి ఇవన్నీ పాసిపోయిన విధానాలే. తన ప్రభ వెలిగిపోతున్న సందర్భంలో ఒక పక్క బిల్ క్లింటన్, ఇంకో పక్క సత్యం కంప్యూటర్స్ రామలింగరాజులను కూచోబెట్టుకుని చంద్రబాబు నాయుడు 2003లో ప్రకటించింది దాదాపు ఈ విధానాల్నే. తనిఖీల రద్దు కూడా ఆనాడు బాబుగారి ''చలువే!'' సులభతర వ్యాపార ప్రారంభ దినాలవి. నేడవే ముదిరి పాకానపడ్డాయి. ఈ నేపథ్యంలో వెలువడిందే పింక్ బుక్.
ప్రభుత్వమిచ్చే రాయితీలు పరిశీలించుకుని, మోడీ సాబ్ సింహద్వారం ఖుల్లా పెట్టాడనో, కేసీఆర్ సాబ్ ''29వ గది'' తలుపులు బార్ల తెరిచినందుకో మన రాష్ట్రంలోకి కంపెనీలు పరిగెట్టుకుని వచ్చి వాలిపోతే, లక్షల్లో కాకున్నా వేలల్లో ఉపాధి మన పిల్లలకు దొరికేతే అంతకంటే కావల్సిన దేముంటుంది?! ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన శాస్త్రాన్నీ, 'వైబ్రెంట్ గుజరాత్' అంటూ 2003లో గుజరాత్లో ప్రారంభమైన చరిత్రనూ పరిశీలిస్తే మన కళ్ళకు కమ్మిన మసక వీడుతుంది. సుమారు 200 దేశాలు మెడలు కోసుకునే పోటీలో నిలబడ్డాయని, సారీ! ఒకర్నొకరు వెనక్కి నెట్టేసుకుంటూ ఉరుకుతున్నారని ప్రపంచ బ్యాంకు 2020లో లెక్కతేల్చింది. దాన్లో మనదేశం 17 ర్యాంకులు ఎగబాకి 63వ స్థానం చేరింది. దీన్ని 50కి చేర్చాలని మోడీ పంతమట! అంటే తనిఖీలు బందయి, ఫ్యాక్టరీలు పేలిపోయో, కాలిపోయో కార్మికులు చచ్చి కుప్పలు పడుతున్నా బేఖాతర్! కనీస వేతనాల కోసం ఫ్యాక్టరీ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు పోరాడుతున్నా బేఖాతర్! ఫలానా చట్టంలోని ఫలానా క్లాజు ప్రకారం తమ కంపెనీ మూసెయ్యడానికో, తమని తీసెయ్యడానికో వీల్లేదని కార్మికులు మొత్తుకున్నా బేఖాతర్! అందుకేగా సదరు ఫలానా చట్టాలే లేకుండా చేస్తోంది మోడీ సర్కార్. అందుకే మన దేశం 63వ స్థానం చేరగలిగింది. 50వ స్థానంలోకి రావడమంటే ఎలా ఉంటుందో!? కార్మిక వర్గమా, హాషియార్ రహౌ!
ఇదీ మన 'పింక్ బుక్' నేపథ్యం. కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలు - అవి ఆర్థిక, పారిశ్రామిక విధానాలైనా, వ్యవసాయ విధానాలైనా, విదేశాంగ విధానమైనా మన దేశానికీ, మన సామాన్య ప్రజలకూ తీవ్ర నష్టం చేసేవే. 1991లో పివి, మన్మోహన్ పాలనతో మొగ్గతొడిగిన విధానాలే అవి. ప్రపంచంలో ఈ ఎల్పిజి విధానాలను వ్యతిరేకించే పాలకులు మన పొరుగునున్న వియత్నాం నుండి పడమటి దేశమైన క్యూబా వరకు, వెనెజులా, బొలీవియా, పెరూ వంటి దేశాలన్నీ 'కాడి మెడకేసుకుని' సామ్రాజ్యవాదాన్ని ఎదిరిస్తూ, ప్రతిఘటిస్తూ తమ ప్రజల్ని కాపాడుకుంటున్నారు. ప్రత్యామ్నాయ విధానాలతో పురోగమిస్తున్నారు. పీక్కుతునే పెట్టుబడి బారి నుండి, దాడి నుండి తమ ప్రజలను కాపాడుకో గలుగుతున్నారు. ఈ విషయాన్ని మన రాష్ట్ర సర్కార్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది! మంత్రాలకు చింతకాయలు రాలవనేది ఎంత కరెక్టో, ఉపన్యాసాలకో, ఉద్వేగాలు రెచ్చగొడ్తేనో ఉద్యోగాలు రావనేది కూడా అంతే కరెక్ట్. మబ్బుల్లో నీటిని చూస్తే మన దాహార్తి తీరదని తెల్సు కదా! పెట్టుబడులొస్తున్నాయని, లక్షల్లో ఉద్యోగాలొస్తున్నాయని జనం వినే ఓపికకు ఏడేండ్లు దాటిపోతోంది. పైగా పింక్బుక్లోని కొన్ని విషయాలు చూస్తే అది ''బొంకు బుక్కే''మో అన్న కామెంట్లకు సర్కార్ సమాధానం చెప్పుకోక తప్పదు. దాన్లో రాసిన ఐ.బి.ఎమ్. 2013లో, అమెజాన్ 2004లోను, టి.సి.ఎస్ 2011లో, డెల్ 2004లో మన మహానగరంలో వెలిశాయి. బర్రె ఎవరిదైతేనేం, మాయింట్లో ఈనితే చాలన్నట్టులేదా ప్రభుత్వ ధోరణి.
పెట్టుబడులు వేల కోట్ల రూపాయలు వచ్చినా అధునాతన యంత్రాల వల్ల అతి తక్కువ మందికే నేడు ఉపాధి దక్కుతోంది. ప్రభుత్వంలో ఖాళీ అయ్యే పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోకుండా కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ సిబ్బందితో నింపితే వారి బతుకులు తెల్లారేదెప్పుడు? ఎన్ని పరిశ్రమలొచ్చినాయి? ఎంత పెట్టుబడి వచ్చిందనే దాని కంటే ఎంత మందికి కొలువులొచ్చినాయనేది కీలకమని మన ప్రభుత్వం గుర్తించడం ముఖ్యం. రాష్ట్ర సాధనోద్యమంలో కీలకాంశం 'నియామకాలు'. దేశంలోనూ, రాష్ట్రంలోనూ నిరుద్యోగం తాండవిస్తోంది. చిరుద్యోగుల వెతలూ పెచ్చరిల్లుతున్నాయి. ఈ లెక్క సరిచేయకపోతే రాష్ట్రోద్యమ ఉనికే ప్రమాదంలో పడుతుంది.