Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్లమెంటు సమావేశాలు మొదలై పదిరోజులు దాటుతున్నా ప్రతిష్టంభన మాత్రం తొలగడం లేదు. పరిస్థితి చూస్తోంటే ప్రతి రోజూ పదే పదే వాయిదా పడేందుకే పార్లమెంటు జరుగుతోందా? అనిపిస్తోంది! సమావేశాల ప్రారంభానికి ముందు అఖిలపక్షంలో అన్ని అంశాలనూ చర్చిద్దామని హామీ ఇచ్చిన అధికారపక్షం, ఆచరణలో ఆ ఊసే మరిచిపోయిన ఫలితమిది. కనుక ఈ ప్రతిష్టంభనకు ముమ్మాటికీ ప్రభుత్వానిదే బాధ్యత. పెగాసస్ ప్రకంపనలూ, వ్యవసాయ చట్టాలపై నిరసనలూ ఉభయసభలనూ కుదిపేస్తున్నా, ప్రభుత్వం ఉలుకూ పలుకూ లేకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నది. ప్రతిపక్షాల నోటీసులనూ వాయిదా తీర్మానాలనూ ఏమాత్రం లక్ష్యపెట్టడం లేదు. కాగా, ఇంతటి ప్రతిష్టంభనలోనూ ప్రభుత్వానికి కావాల్సిన బిల్లులు మాత్రం ఏ చర్చా లేకుండానే పాసైపోతుండటం వైచిత్రి! ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకి స్తున్నప్పటికీ, ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రయివేటుపరం చేసే భీమా బిల్లుకు, ఇన్లాండ్ వెసెల్స్ బిల్లుకు ఏకపక్షంగా ఆమోదం ప్రకటించుకున్న ప్రభుత్వం, దేశవ్యాపితంగా అలజడి సృష్టిస్తోన్న పెగాసస్ నిఘా అంశాన్ని మాత్రం కనీసం పరిగణలోకి తీసుకోవడం లేదు. పైగా పెగాసస్, రైతు చట్టాలు అసలు విషయాలే కాదని పార్లమెంటు సాక్షిగా మంత్రులు వ్యాఖ్యానిస్తుండటం ఎంతటి బాధ్యతా రాహిత్యం!
ఏ ప్రభుత్వమైనా దేశ భద్రత కోసం నిఘా వ్యవస్థను ఉపయోగించుకోవడాన్ని తప్పుపట్టలేం. నాటి ప్రాచీన రాచరిక పాలనా కాలం నుంచి, నేటి ఆధునిక ప్రజాస్వామ్య యుగం వరకూ ఈ నిఘా వ్యవస్థ ఒక ఆనవాయితీగా, అవసరంగా ఉంటున్న మాట వాస్తవం. కానీ ఆ వంకతో పౌరుల వ్యక్తిగత జీవితాల్లో చొరబడి, వారి గోప్యతకూ, భద్రతకూ భంగం కలిగించడం నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో క్షమించరాని నేరం. అది పౌర స్వేచ్ఛకూ, రాజ్యాంగ నియమాలకూ పరమ విరుద్ధం. కాబట్టే ప్రతిపక్షాలు మూకుమ్మడిగా విచారణకు పట్టుబడుతున్నాయి. కానీ ఈ అక్రమ నిఘాతో తమకు ఏ సంబంధమూ లేదని తేలికగా కొట్టిపారేస్తున్న ప్రభుత్వం, విచారణకు ఎందుకు జడుస్తుందో తేల్చి చెప్పకుండా దాటవేత ధోరణి అవలంబిస్తోంది. ప్రభుత్వానికి ఏ సంబంధమూ లేనప్పుడు ఈ నీచానికి ఎవరు వొడిగట్టినట్టు? ఇలా ప్రభుత్వానికి తెలియకుండా ప్రజల జీవితాలపై ఎవరు నిఘా వేసినా అది దేశభద్రతకు ప్రమాదం కాదా? మరి ''దేశభక్తులై''న పాలకులకు ఇది ఎందుకు పట్టడం లేదు!
ఒకవేళ ప్రతిపక్షాల ఆరోపణలకు రాజకీయ ఉద్దేశ్యాలున్నాయనుకున్నా, మిత్రపక్షం, స్వపక్షం నుండి కూడా విచారణను కోరుతున్నారు కదా. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితిష్‌కుమార్, అధికార పార్టీ సొంతనేత సుబ్రహ్మణ్యస్వామిలు పెగాసస్‌పై బహిరంగంగానే విచారణకు డిమాండ్ చేస్తున్నారు. వీటన్నిటికీ మించి దేశంలో పెగాసస్ అక్రమ నిఘా అనేది ఇప్పటికే రుజువైన సత్యం. అటువంటప్పుడు విచారణకు ఈ ప్రభుత్వానికున్న అభ్యంతరమేమిటి? కనీసం అదైనా చెప్పాలి కదా..? రాజకీయ ప్రత్యర్థులు, ప్రజాపక్షం వహించే పాత్రికేయులు, హక్కుల కార్యకర్తలు, మేథావులు, ఇతర వ్యాపారవర్గాల ఫోన్లలోకి చొరబడి... వారి సంభాషణలూ, సందేశాలపైనే కాదు, ప్రజల కదలికలపైనా నిఘావేయడం చట్టవిరుద్ధం. రాజకీయ ప్రత్యర్థులే కాదు, ప్రభుత్వ ఉన్నతాధికారులూ, న్యాయమూర్తులపైనా ఈ నిఘా కొనసాగుతుండటం మరీ ప్రమాదకరం. చివరికి స్వపక్షీయుల విశ్వసనీయతను పరీక్షించడానికి కూడా పూనుకున్నవారు వ్యవస్థలనూ, ప్రత్యర్థులనూ లొంగదీసుకునేందుకు ఎందుకు పూనుకోరు. అందుకే పార్లమెంటులోనే కాదు, పౌర సమాజంలోనూ నిరసనలు పెల్లుబుకుతున్నాయి. అయినా ఈ ప్రభుత్వం నోరు మెదపటం లేదు. ఎందుకు?
ఎప్పుడూ మాట్లాడేదాన్నిబట్టే కాదు, అప్పుడప్పుడూ మాట్లాడనిదాన్ని బట్టి కూడా అసలు సంగతేమిటో అర్థమయిపోతుంది. ఇప్పుడిది కమలనాథులు మరోసారి నిరూపిస్తున్నారు. పెగాసస్ అనేది నిఘా వ్యవస్థకు ఉపయోగపడే ఒక అమ్మకపు సాంకేతిక పరిజ్ఞానమన్నది అందరికీ తెలిసిందే. ఇది రూపొందించిన ఇజ్రాయిల్ కంపెనీ ఎన్ఎస్ఓ ఈ స్పైవేర్‌ను కేవలం ప్రభుత్వాలకూ, ప్రభుత్వ సంస్థలకు మాత్రమే విక్రయిస్తామని ఇప్పటికే తేల్చి చెప్పింది. అదే సమయంలో భారత ప్రభుత్వానికి అమ్మలేదు అని ఎన్ఎస్ఓ చెప్పటం లేదు. అలాగే మేం కొనలేదు అని భారత ప్రభుత్వమూ చెప్పలేకపోతోంది. దీనిని బట్టి అది ఈ దేశంలోకి ఎలా వచ్చిందో, ఇది ఎవరి పన్నాగమో పసిగట్టలేనంత అమాయకులు కాదు ఈ దేశ ప్రజలు. ప్రజలే గురువులనుకుంటే ఏ ప్రభుత్వానికైనా దారి సక్కగుంటది. కాదు, కూడదు మేమే గొప్ప అనుకుంటే బుద్దిగడ్డి తింటుంది. కనుక ప్రభుత్వం స్పందించి ఈ ప్రతిష్టంభనను తొలగించాలి. ఆ పని చేయకుండా ప్రతిపక్షాల నిరసనల వల్లే పార్లమెంటు సమయం, ప్రజాధనం వృధా అవుతోందని ప్రభుత్వం వాపోతున్నది. అసలు ఈ అనర్థాలన్నింటికీ తామే కారణమన్న విషయాన్ని విస్మరించి, ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయడం ప్రజలను పక్కదారి పట్టించడమే అవుతుంది. అందువల్ల ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షలను గౌరవించి ప్రభుత్వం పార్లమెంటుకు సమాధానం చెప్పాలి. విచారణకు ఆదేశించి నిజాలు నిగ్గుతేల్చాలి. లేదా ప్రజల ముందు తప్పు ఒప్పుకోవాలి. కాదంటే ప్రజలే సమాధానం చెప్పేరోజు ఎంతో దూరంలో ఉండదు.