Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరోగ్యమే మహాభాగ్యం...' అన్నారు మన పెద్దలు. ''రోగం వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవటం కంటే అది రాకుండా జాగ్రత్త పడటం మేలని'' చెబుతారు వైద్యులు. ఈ రెండూ జరగాలంటే వ్యక్తిగతంగా ప్రజలు ఎవరికి వారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ప్రభుత్వాలు ప్రజారోగ్య పరిరక్షణను తలకెత్తుకోవాలి.
ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి... హైదరాబాద్‌కు నాలుగు వైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి సంబంధించి తాజాగా అధికారులకు జారీ చేసిన ఆదేశాలను ఒక్కసారి పరిశీలిద్దాం. నగరంతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లోని ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే వీటిని నిర్మిస్తున్నామని మంత్రి చెప్పటం సరైందే. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించాల్సిందే.. స్వాగతించాల్సిందే. నాలుగు కొత్త ఆస్పత్రులతోపాటు ప్రస్తుతమున్న ఉస్మానియా ఆస్పత్రి పాత భవనాల స్థానంలో కొత్త బిల్డింగులనూ కట్టాల్సిందే. గాంధీలో వైద్య సిబ్బంది సంఖ్యను, మౌలిక వసతులను పెంచాల్సిందే. వరంగల్‌లో కూడా ఎమ్‌జీఎమ్‌కు కొత్త భవంతులను నిర్మించాల్సిందే. ఎవరు అవునన్నా.. కాదన్నా, ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు అత్యవసరమైనవే. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరమూ ఉండక్కర్లేదు.
కానీ ఇక్కడే ఇంకో ముఖ్యమైన అంశాన్ని మనం గమనించాలి. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్ చుట్టూనే తిరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వ వైద్య రంగం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో అత్యధికం ఇక్కడే కేంద్రీకృతమయ్యాయి. అదే ఒరవడి ఇప్పుడూ కొనసాగుతున్నది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని అనేక ప్రాథమిక, పట్టణారోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు... కనీస వసతుల్లేక కునారిల్లుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం... రాష్ట్ర జనాభాతో పోలిస్తే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉండాల్సిన సంఖ్య కంటే 50 శాతం తక్కువగాను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 15 శాతం తక్కువగానూ ఉన్నాయి. మరోవైపు పల్లెల్లో ప్రజలకు అతి చేరువగా ఉండే పీహెచ్‌సీల్లో నలుగురు డాక్టర్లు ఉండాల్సిన చోట... కేవలం ఒక్కరంటే ఒక్కరే విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ ఒక్క వైద్యుడు కూడా కేంద్ర ప్రభుత్వ వైద్య ప్రాయోజిత పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ వైద్య కార్యక్రమాలపై సర్వే కోసం ఊళ్లు పట్టుకుని తిరుగుతున్నారు తప్పితే ఆస్పత్రిలో రోగులకు అందుబాటులో ఉండలేకపోతున్నారు. మలేరియా, టైఫాయిడ్, డెంగీ తదితర సీజనల్ వ్యాధులతోపాటు టీబీలాంటి దీర్ఘకాలిక రోగాలున్న వారిపై సర్వే, సంబంధిత రిపోర్టు రాయటానికే ఆ వైద్యుడు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ రోగులకు సేవలందించలేని నిస్సహాయ స్థితిలో పడిపోతున్నారు. ఫలితంగా పేద రోగులు ప్రతీ చిన్న రోగానికి, జిల్లా కేంద్రాలు, హైదరాబాద్‌కు పరిగెత్తుకుని రావాల్సి వస్తోంది. తద్వారా వారి విలువైన సమయంతోపాటు డబ్బు కూడా వృధా అవుతోంది. ఈ వాస్తవాన్ని పాలకులు గుర్తించగలిగితే... సగం ఆరోగ్య సమస్యలకు పరిష్కారం సులువుగా దొరుకుతుంది.
మరోవైపు మండల కేంద్రాల్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, నియోజకవర్గ కేంద్రాల్లోని ఏరియా ఆస్పత్రుల్లో అతి ముఖ్యమైన గైనకాలజీ, పీడియాట్రిక్, సర్జన్, జనరల్ మెడిసిన్ తదితర పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయటం లేదు. ఈ క్రమంలో అక్కడున్న రేడియాలజీ తదితర సూపర్ స్పెషాలిటీ వైద్యులు... పైన చెప్పిన నాలుగు సాధారణ వైద్య సేవలను అందించేందుకే పరిమితమవుతున్నారు. దీంతో వారిలో ఉన్న నైపుణ్యాలు ఎవరికీ ఉపయోగపడకుండా పోతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం నిర్మిస్తామంటున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల (దీన్నే తృతీయ స్థాయి వైద్యం అని కూడా అంటారు...) సంగతిని కాసేపు పక్కకుపెట్టి... ఎప్పటి నుంచో రాష్ట్రంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల గురించి ఆలోచిస్తే... విధానపరమైన అనేక లోపాలు, లొసుగులు మనకు కనిపిస్తాయి. వాటిలో ఎన్ని ఆస్పత్రుల్లో క్యాథల్యాబ్‌లు, ఎమ్ఆర్ఐ, సిటీ స్కాన్ పరికరాలు పని చేస్తున్నాయి...? అక్కడ వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది ఉండాల్సిన సంఖ్యలో ఉన్నారా...? ఒకవేళ ఉంటే... 'వైద్యమో చంద్రశేఖరా...?' అంటూ పేదలు ఎందుకింత గోస పడుతున్నారు...? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలు. అందువల్ల ప్రభుత్వ పెద్దలు... నేల విడిచి సాము చేసినట్టుగా కాకుండా, క్షేత్రస్థాయిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. కావాల్సినంత మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని అక్కడ నియమించాలి. అన్ని రకాల మందులనూ అందుబాటులో ఉంచాలి. ఇందుకనుగుణంగా మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సత్వర చర్యలకు పూనుకోవాలి. కేరళ, తమిళనాడు, శ్రీలంకలో పర్యటించాలని నిర్ణయించిన నేపథ్యంలో...ఆ కమిటీ, అక్కడి వైద్య విధానాలను, ఆయా ప్రభుత్వాలు పీహెచ్‌సీల బలోపేతానికి తీసుకుంటున్న చర్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి, మన రాష్ట్రంలో వాటిని అమలు చేసి చూపాలి. ఇది జరక్కుండా మనం హైదరాబాద్ చుట్టూ మరో పది ఆస్పత్రులు నిర్మించినా... 'ఆరోగ్య తెలంగాణ...' అనే లక్ష్యం... ఒక కలగానే మిగిలిపోతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.