Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూమి, ఆకాశం, అంతరిక్షం, సముద్రం, సమస్త విశ్వం.. కాదేదీ వ్యాపారానికి అనర్హం (శ్రీశ్రీకి క్షమాపణలతో). పెట్టుబడిదారీ వ్యవస్థ తాజా దశలో లాభాల పతనాన్ని నిలువరించడానికి ప్రపంచ పెట్టుబడిదారీ వర్గం నూతన అన్వేషణకు నడుం కట్టింది. ఇందులో భాగమే అంతరిక్ష పర్యాటక రంగం ఆవిష్కరణ.
అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ శతకోటీశ్వరుడు అయిన జెఫ్ బెజోస్ రోదసియాత్ర దిగ్విజయంగా పూర్తిచేసుకున్నాడు. మన తెలుగమ్మాయి కూడా ఈ యాత్ర చేసివచ్చింది. ఆయన ఏదో వినోదం కోసం మాత్రమే చేసిన యాత్ర కాదిది. కాసుల వర్షం కురిపించే అంతరిక్ష పర్యాటక రంగానికి ఇది మొదటి అడుగు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అధిపతి రిచర్డ్ బ్రాన్స్‌న్ అంతరిక్ష పర్యాటక రంగంలో రెండో పోటీదారుడు. ఆయన సంస్థ తొమ్మిది రోజుల ముందు అంతరిక్షయాత్రను నిర్వహించింది. మూడో పోటీదారుడు ఇలాన్ మస్క్ ఉన్నారు. ఈ ముగ్గురు సహస్ర శతకోటీశ్వరులు. అంతరిక్ష పర్యాటక రంగం అనే కొత్త వ్యాపారాన్ని ఆవిష్కరించి దానిద్వారా కోట్లు సంపాదించుకోవాలనే పోటీలో ఉన్నారు.
చాలా ఖరీదైన అంతరిక్ష పర్యాటక రంగం, పైకి సాఫీగా కనిపించినా లోతైన పరిశీలన చేస్తే వ్యాపార శక్తులు దీని వెనుక ఉన్నట్టు అర్థం అవుతుంది. ఇప్పటి వరకు ఆయా దేశ ప్రభుత్వాల స్థాయిలో శాస్త్రసాంకేతిక ప్రయోజనాలు, పర్యావరణ పరిశోధనలకే పరిమితమైన అంతరిక్ష ప్రయాణాలు ఇప్పుడు పర్యాటక వ్యాపారంగా కొత్తరూపం తీసుకుంటున్నాయి. ఈ రంగానికి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధికి అమెరికా ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టింది తప్ప ఈ శతకోటీశ్వరులు పెట్టింది ఏమీలేదు. రాకెట్ల శాస్త్ర పరిశోధన, రాకెట్ల తయారీ, దానికి ముడిపడి ఉన్న మౌలిక వసతులు అన్నీ ''నాసా''నే ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసింది. ప్రభుత్వ నిధులంటే ప్రజల నుండి వసూలు చేసిన పన్నులు అనేది స్పష్టం. అంటే ప్రజలు కట్టిన పన్నులతో పోగుపడిన నిధుల నుండి ఇప్పుడు శతకోటీశ్వరులు లాభాలపంట పండించు కొంటున్నారు.
ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. పెట్టుబడిదారీ వ్యవస్థకు 400 సంవత్సరాల చరిత్ర ఉన్నది. సోషలిజం 1917లోనే రష్యాలో ఏర్పడింది. అయితే సోషలిస్టు వ్యవస్థ ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధిలో పెట్టుబడిదారీ విధానాన్ని తలదన్నింది. రెండో ప్రపంచ యుద్ధం అనుభవాల నేపథ్యంలో నాటి సోవియట్ రష్యా దేశీయ పరిజ్ఞానంతో తొలి అంతరిక్ష నౌకను ప్రయోగించింది. అటుతరువాత అమెరికా కూడా అంతరిక్ష ప్రయోగాలు జరిపింది. అయితే రాకెట్లను రష్యా నుండి అమెరికా దిగుమతి చేసుకునేది. అమెరికా రష్యాలు మాత్రమే అంతరిక్షంలో ప్రయోగించే రాకెట్లు కలిగిన కాలంలో కూడా రష్యా రాకెట్లే నాణ్యమైనవి, వాటిదే ప్రధాన పాత్ర.
ఇటీవలి కాలంలో అమెరికా కాంగ్రెసు క్రమంగా రష్యా రాకెట్ల వాడకాన్ని 2022తో ఆపివేయాలని నిర్ణయించింది. ఈ స్థితిలో బెజోస్, మస్క్‌లకు చెందిన బహుళజాతి గుత్త సంస్థలు అంతరిక్ష రంగంలో ప్రవేశించాయి. వారు తయారు చేసే రాకెట్లకు అమెరికా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి వారితో వ్యాపారం చేయిస్తున్నది. కాని వారే తమ డబ్బులు పెట్టి వ్యాపారం చేస్తున్నట్టు వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వారు కొంత పెట్టుబడి మాత్రమే పెడుతున్నారు. ఆ డబ్బులు వారి సంస్థలలో కార్మికులను శ్రమదోపిడీ చేసి సంపాదిస్తున్నవే అనేది మరువరాదు. అమెజాన్ అతి తక్కువ కనీస వేతనం చెల్లించే సంస్థ. తమ కార్మికులకు మూత్ర విరామం కూడా ఇవ్వకుండా తీవ్ర దోపిడీ చేసే సంస్థ అని ప్రపంచం మొత్తానికి తెలుసు.
మాస్క్ విద్యుత్‌తో నడిచే కార్లు ఉత్పత్తి చేసే సంస్థ యజమాని. ఆయన కేవలం వాతావరణహితమైన విద్యుత్ వాహనాలు తయారు చేస్తున్నందున ప్రభుత్వం నుండి పెద్ద మొత్తంలో రాయితీలు అందుకుంటున్నాడు. ఆయన కంపెనీ పేరు 'టెస్లా'. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆయనకు వచ్చిన లాభం అనేది ప్రభుత్వం ఇచ్చిన రాయితీలతోనే నిండి ఉన్నది. దీన్ని బట్టి చూస్తే అటు అమెజాన్, ఇటు టెస్లా యజమానులు తమ జేబుల నుండి పైసా పెట్టుబడి పెట్టలేదనేది స్పష్టం అవుతున్నది.
మనం ఇప్పుడు కొత్త యుగంలోకి ప్రవేశించాము. దీని ప్రత్యేకత అంతరిక్ష యుగం. మరో మాటలో చెప్పాలంటే ఇది అంతరిక్ష కబ్జా యుగం. అంతరిక్షం అనేది అందరిదీ. ఉమ్మడి ఆస్తిలాంటిది. దీనిని ఎలా వాడుకోవాలి అనేందుకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు అమెజాన్, టెస్లా వాటిని పక్కకుపెట్టి తమ స్వార్థం కోసం అంతరిక్షాన్ని కబ్జా చేసి వాడుకుంటున్నాయి. లక్షల డాలర్ల టికెట్పెట్టి అంతరిక్ష పర్యాటక వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇప్పటికే 600మంది టికెట్లు అడ్వాన్‌గా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక వారికి కాసుల వర్షం కురవనుంది. ప్రకృతిలో లభ్యం అయ్యే ఖనిజ సంపద తమకు ఉచితంగా లభించిన బహుమతి అని పెట్టుబడిదారులు భావిస్తారని మార్క్స్ చెప్పిన మాటలు ఇప్పుడు అక్షర సత్యం అని రుజువు అవుతున్నది.
ఈ నాలుగువందల సంవత్సరాలలో పెట్టుబడిదారీ వ్యవస్థ భూగర్భంలోని ఖనిజ సంపదను, సముద్రంలోని ఖనిజ సంపదను కొల్లగొట్టి లాభాలు సంపాదించుకుని పర్యావరణాన్ని సర్వనాశనం చేసింది. అంతరిక్ష యుగంలో పెట్టుబడిదారులు అంతరిక్షాన్ని కొల్లగొట్టడానికి దారులు వేస్తున్నారు. తాము నాశనం చేసిన భూమండలంను వదిలి, అంతరిక్షంలో నివాసం ఏర్పాటు చేసుకుని, దాన్ని కూడా నాశనం చేసే అవకాశం లేకపోలేదు. తస్మాత్ జాగ్రత్త!