Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ.. అమ్మాయిలే కదా.. ఏం చేస్తారులే అనుకున్నవాళ్ల అహంకారాన్ని గెలిచారు. యావత్ భారతావనిని మురిసేలా చేశారు. దేశం గర్వంతో ఉప్పొంగే క్షణాలివి. విశ్వ క్రీడా సంరంభంలో త్రివర్ణ పతాకం మరోసారి రెపరెపలాడుతుంది. ఒలింపిక్స్‌లో మనదేశం తరఫున నారీలోకానిదే పైచేయి. మణిపురీ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి ఛాను, సింధుల నుంచి లవ్లీనా వరకు భారతమ్మ మెడలో పతకాలను అలంకరించింది మహిళా అథ్లెట్లే! రానున్న పతకాల్లో కూడా కనీసం మరో ఒకట్రెండు కూడా వనితలే తీసుకురానున్నారన్నది ఆటల సరళిని బట్టి అర్థమవుతోంది. అలాగే, మూడోసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన భారత మహిళా హాకీజట్టు కాంస్యపోరు పరాజయం చెందినా అఖండ దేశం గర్వించే ఆటను కనబరిచారు. హకీ పురుషుల జట్టు కాంస్యం సాధించింది. ఈ ఒలింపిక్స్‌లో ఇది పురుషులు అందుకున్న తొలి విజయం. 41 ఏండ్ల తరువాత విజయం అందించి ధ్యాన్ చంద్ రోజులను గుర్తు చేసింది మన హాకీ జట్టు. యువ రెజ్లర్ రవి కుమార్ దహియా రజితంతో చరిత్ర సృష్టించాడు. మరోవైపు గోల్ఫ్‌లో అదితి అశోక్ రజితం సాధించే అవకాశాలున్నాయి. ఆ జట్టు కెప్టెన్ రాణీ రామ్‌పాల్ మొదలు డిస్కస్ త్రోలో ఆశలు రేపిన పంజాబీ కమల్‌ప్రీత్ కౌర్ దాకా ఎంతోమంది రైతుబిడ్డలు, చిన్నస్థాయి నుంచి శ్రమించి పైకొచ్చినవారు కావడం గమనార్హం. ఇలా వీరివి ఎన్నెన్నో స్ఫూర్తిగాథలు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా మన తెలుగమ్మాయి పివి సింధు సృష్టించిన చరిత్ర ఓ చిరస్మరణీయ ఘట్టం. ఇలా ఈసారి పతకాల వేటలో ముందంజలో నిలిచిన అమ్మాయిలు కోట్లాది భారతీయుల్లో ఆనందోత్సాహాలు నింపారు. వీరంతా అసాధారణమైన ఆటతో భారతకీర్తి పతాకాన్ని విశ్వక్రీడా వేదికపై ఎగరవేశారు.
ఈ విశ్వక్రీడల్లో దేశానికి తొలి పతకాన్ని అందించిన మణిపూర్ రాష్ట్ర లిఫ్టర్ మీరాబాయి, మన దేశంలో లిఫ్టింగ్ అంటే డోపింగ్ అన్న అపవాదుతో దేశం చుట్టూ అల్లుకున్న అపవాద చీకట్లను తొలగిస్తూ ఇప్పుడు విశ్వవేదికపై వెండి వెలుగులు విరజిమ్మింది. కరణం మల్లీశ్వరి తర్వాత 21ఏండ్లకు ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన భారత లిఫ్టర్‌గా మీరా నిలిచింది. చిన్నప్పుడు తల్లితో కలిసి పర్వత ప్రాంతాల్లో కట్టెల మోపుతో గుట్టలు ఎక్కుతూ, బరువులు అవలీలగా మోయడాన్ని అలవాటు చేసుకుంది. అందుకే ఆమె ఇప్పుడు అత్యున్నత వేదికపై పతకాన్ని అందుకొని దేశానికే స్ఫూర్తిగా నిలిచింది. బాక్సింగ్‌లో ఎన్నో అంచనాలున్న మేరీకోమ్ లాంటి స్టార్ విఫలమైన చోట తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడిన అస్సామీ యువ బాక్సర్ లవ్లీనా తనదైన ప్రదర్శనతో ఏకంగా పతకాన్ని సాధించడం ఆమె అమోఘమైన ప్రతిభకు నిదర్శనం.
2000 నుండి ఇప్పటి దాకా ఒలింపిక్స్‌లో మన దేశానికి వచ్చిన వ్యక్తిగత పతకాలు 14 అయితే అందులో 6 పతకాలు వనితలు సాధించినవే. పురుషులతో పోలిస్తే, మహిళా అథ్లెట్ల సంఖ్య మన దేశంలో మొదటి నుంచి తక్కువే. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. ఆటల్లో ఆడవాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒలింపిక్స్‌లోనూ 2000 నాటికి భారత్ నుంచి 21 మంది మహిళలే వెళితే, ఈసారి మొత్తం 128 మంది అథ్లెట్లలో 57 మంది మహిళలే ఉన్నారు. ఇప్పుడు కండ్లు తెరిస్తే కనిపించే నిజం ఒక్కటే 'ఆడవాళ్ళకు ఆటలేమిటి' అన్న సమాజానికి ఇప్పుడు ఆ ఆడవాళ్లే విజయాలను అందిచ్చే దిక్కయ్యారు. క్రికెట్‌ను తప్ప మరో ఆటను పెద్దగా పట్టించుకోని మన దేశం పరువును విశ్వక్రీడా వేదికపై నిలుపుతున్నారు. పాఠశాలల్లో ఆడుకోవడానికి ఖాళీ స్థలం మొదలు కనీస సౌకర్యాలు కూడా కష్టమైన దేశంలో, మార్కులు తప్ప ఆటలెందుకని ఆలోచించే పెంపకంలో, 'వంటింట్లో తప్ప మైదానంలో ఆడవాళ్ళకేం పని' అనే పాలకనేతల మారని మానసిక స్థితిలో, ఎంత ప్రతిభ ఉన్నా ఆర్థిక, హార్దిక ప్రోత్సాహం కరవైన పరిస్థితుల్లో, ఆటల్లోనూ అధికార, కులమత రాజకీయ రోచ్చు విశ్వక్రీడల్లో సైతం చోరబడటం శోచనీయం. ఇలాంటి సందర్భాల్లో... మన దేశంలో ఈ మాత్రమైనా క్రీడాకారులు, అందులోనూ మహిళలు రాణించడం విశేషం. సహాయ సహకారాల మాటెలా ఉన్నా, అంతర్జాతీయ పోటీల్లో ప్రతిసారీ దేశ ప్రతిష్టను నిలబెట్టే బాధ్యతను భుజాన వేసుకొంటున్న మగువలను అభినందించాలి. ఇకనైనా, తరతరాలుగా సమాజంలో అణచివేతకు గురైన స్త్రీమూర్తులకు ఇంటా బయటా తగినంత ప్రోత్సాహం, శిక్షణ అందిస్తే మన ఇంట్లోనే మీరాలు, సింధూలు తయారవుతారని గ్రహించాలి. అతివలంటే అబలలు కాదని నిరూపించిన వీర వనితలకు జేజేలు.