Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలియక ప్రేమ తెలిసి ద్వేషము అనే కథను వినాల్సిందే మనము. ఒక గ్రామంలో దేవాలయంలోకి దళితులు ప్రవేశించడాన్ని సవర్ణ హిందువులు ప్రతిఘటిస్తారు. ఘర్షణ పడతారు. ఈ రెండు వర్గాల గొడవలో ఒక బ్రాహ్మణుడు ఒక దళితుడూ మరణిస్తారు. యమదూతలు వారి జీవాత్మలను తీసుకుని యమలోకానికి వెళుతూ వెళుతూ మధ్యలో వైతరణీనది ఒడ్డున వీరి నుంచి, గంధర్వుల గానం వింటూ విశ్రాంతి తీసుకుంటారు. ఆ సమయంలో ఈ జీవాత్మలు ఎదురుపడి సంభాషణ సాగిస్తాయి. భారతదేశములో ఒకే ప్రాంతంలోని ఒకే గ్రామానికి చెందినవిగానూ, ఒకే భాష మాట్లాడేవిగానూ పరస్పరం పరిచయం గావడంతో అవి మరీ సన్నిహితమవుతాయి. వాళ్ళు ఏఏ కులానికి చెందినవారో తెలుసుకుని తిరిగి వైరం మొదలై తన్నుకుంటారు. బ్రాహ్మణ జీవాత్మ ''ఓరి వేధవా! ఇక్కడా దాపురించావూ!'' అంటూ తిడుతుంది. 'నీ జులుం ఇక్కడ కూడానా?' అంటాడు దళితుడు. ఇట్లా పోట్లాడుకుంటున్న సమయంలోనే యమదూతలు వచ్చి ''ఇదేం కావరంరా! చచ్చినా ఈ కులపిచ్చి పోలేదేం!'' అంటూ గట్టిగా మందలించి ధర్మరాజు సమక్షంలో నిలబెడతారు. సరే ధర్మరాజు విచారణ జరిపి ఇద్దరికీ శిక్షలు విధించి పంపిస్తాడు. అది కథాంశం. ఈ కథను ఎనభైఏండ్ల క్రితం మన కాళోజీ నారాయణరావు రాశారు. గ్రహించే విషయమేమంటే భారతీయులలో కులం చచ్చినాక కూడా పట్టుకునే ఉంటుందని, అంత నిండిపోయి సర్వాంతర్యామిలా వ్యాపించిందని తెలుస్తుంది.
అవును అప్పుడే కాదు ఇప్పుడు మరీ విస్తృతమవుతున్నది. అప్పుడెప్పుడో ''గ్రహరాశులనధిగమించి, ఘనతారల పథము నుంచి, గగనాంతర రోదసిలో గంధర్వగోళ సతుల దాటి, చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే''నని ఆరుద్ర మానవుని మహనీయతను పాడుకున్నాడు గానీ పైన చెప్పిన అన్నింటిలోకి ఈ దేశపు కులాన్ని నిర్లజ్జగా తీసుకుపోయి తిరిగి రాగలిగినవాడు మనవాడే! 'ఇంతింతై వటుడింతై...' అన్నట్లు కుల తాలూకు దుర్గంధాలను విశ్వాంతరాల్లోకి విస్తరిస్తున్నాం. ఎప్పుడు బతికాం స్వచ్ఛమైన మానవులంగా! మతంగానో, కులంగానో, వర్ణంగానో, అవర్ణహీనంగానో తప్ప, ఎప్పుడు బతికాం మనుషులంగా!
వేలయేండ్ల క్రితం ఎప్పుడు ఎలా కులం పాదులు పడ్డాయో, ఈ నేల మీద పాదాల నుండి శిరస్సు వరకు సిరలూ ధమనులుగా మన దేహం నిండా ప్రవహిస్తూ మన ఉనికిని కులమే కదిలిస్తోంది. కనులిస్తోంది. పోషక భోజరాజులకు కొదవేముంది మనకు! తిరుగుబాట్లు, ప్రశ్నలు ఎన్ని ఎదురైనా అన్నింటినీ అధిగమించి స్వేచ్ఛా విహారియై సంచరిస్తోంది. మనం పాదం మోపిన చోటల్లా వెయ్యితలలై కోరలు చాస్తోంది. ప్రపంచ ప్రజలందరు స్నేహ సౌహార్థతలకు, చైతన్య స్ఫూర్తికి నిదర్శనంగా జరుపుకుంట్ను ఒలంపిక్ క్రీడా వేదిక టోక్యోలోకి కూడా కులాన్ని మోసుకుపోయాం.
శతాబ్దాల క్రితమే భక్తాగ్రేసరులయిన ఎంతమందో బుద్ధిని బోధించినా మరింత పాతాళంలోకే పయనిస్తున్నాం. 'బ్రహ్మమొకడే పరబ్రహ్మమొకడే, మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒకటే, చండాలుండేటి సరిభూమి ఒకటే'నని దేహమొకటేయని గొంతెత్తి పాడిన అన్నమయ్యను ఎవడువిన్నాడు! 'కులముగల్గువారు గోత్రంబు గలవారు విద్య చేత విర్రవీగువారు, పసిడి కలుగువాని బానిస కొడుకులని నుడివిన వేమన సారాన్ని గ్రహించుకున్నామా! మనం చాలా ఘనతగా చెప్పుకునే 'మహాభారత' కథలో కర్ణుడు యుద్ధపోటీకి పనికిరాడన్నందుకు 'ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదని, కౌరవవంశ చరిత్రను బయటపెట్టి ఎవరిది ఏ కులమని సభాసదులను నిలదీసిన సుయోధనుడి మాటలు ఎవరికయినా అవగతమయినాయా! నరనరానా జీర్ణించుకుపోయిన ఈ కులతత్వ వైరస్, కరోనా కంటే చాలా ప్రమాదకరమైంది. చచ్చినా వదలిపోని వైరసిది.
ఎంత బాహాటంగా వివక్ష ప్రదర్శితమవుతోంది. ఎంత బరితెగించిపోతోంది. ఒలంపిక్స్‌లో మనదేశం తరపున హకీ ఆడిన మహిళల జట్టులో దళిత మహిళలు ఉండటం వల్లనే ఓడామని, అలా ఓడినందుకు ఆనందపడుతూ హాకీ క్రీడాకారిణి వందనా కటారియా ఇంటిముందు కులదురహంకారంతో దుర్భాష లాడుతూ గంతులేస్తూ వీరంగం సృష్టించారంటే ఎంత నీచస్థితికి జారిపోయాం. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కనీస స్పందనలేని ఘనాధిపతులను చూస్తే మరింత సిగ్గువేస్తోంది. ఇది కేవలం ఒక సంఘటనా ప్రతి స్పందన మాత్రమే కాదు. తరాలుగా వర్ణాధికులుగా చెలామణీ అవుతున్న వారి దౌర్జన్యపూరితమైన ప్రవర్తనల కొనసాగింపు. వేలయేండ్లుగా ఈ నేల కుల బాధితక్షతగాత్రుల రక్తంతో, కన్నీళ్ళతో తడిచి ముద్దయి ఉంది. ఇప్పుడది అధికారమై పడగవిప్పుతోంది. క్షమించు వందనా! క్షమించు. నువ్వు శ్రమించి, ప్రపంచంలో దేశపు పరువును నిలబెట్టాలనుకున్నావు. వాళ్ళు నీ కులాన్ని యెంచి నీ పరువు తీద్దామనుకున్నారు. ఎంత వ్యత్యాసం!
కులం పునాదుల మీద మనం దేనినీ నిర్మించలేము. ఒక నీతిని గానీ, ఒక జాతిని కానీ అని అన్న అంబేద్కర్ మహాశయుని మాటలు ఎవరూ వినిపించుకోవటం లేదు. ఆయన ఆధ్వర్యాన మనం ఏర్పాటుచేసుకున్న రాజ్యాంగమూ, దాని విలువలూ త్రోసివేయబడుతున్న కాలాన ఇలాంటి నైచ్యాలు ఎదురవటం సహజమే కదా! అయినా ఈ సిగ్గులేని తనాన్ని నిగ్గదీసే కాలమొస్తుంది. మలిన జీవచ్ఛావాలను అగ్గితో కడగటం అనివార్యమవుతుంది!