Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమయం మించిపోతోంది, సమస్య తీవ్రమవుతోంది. ప్రమాదం ముంచుకొస్తోంది, ప్రపంచం కలవరపడుతోంది. బహుశా ఇప్పుడు మనలో ఏ ఒక్కరమూ సురక్షితంగా లేమంటే అతిశయోక్తి కాదేమో! పరిస్థితి ఇలాగే కొనసాగితే జీవితాలూ జీవనోపాదులకే కాదు, పారిపోయి తలదాచుకోవడానికి కూడా ఎక్కడా ఏ అవకాశమూ ఉండదేమో! ఎందుకంటే... మనిషికైనా, మానుకైనా ప్రకృతిలో ఏ జీవికైనా ఓ అవరణమంటూ ఉంటేనే కదా ఉనికీ ఉన్నతి. మరి ఆ ఆవరణమే లేకపోతే..?! నేటి ఈ ప్రశ్నార్థకమైన స్థితిని ''కోడ్ రెడ్ ఫర్ హ్యుమానిటీ'' (మానవాళికి రుధిర సంకేతం) అని హెచ్చరిస్తోంది ఐక్యరాజ్య సమితి. పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి నియమించిన ఐపీసీసీ ( Inter Governamental panel on climate change) తాజా నివేదిక మండుతున్న భూగోళాన్ని మన కండ్లముందుంచుతోంది. పర్యావరణంలో నెలకొన్న అవాంఛనీయమైన, ఆందోళన కరమైన మార్పులను వెల్లడిస్తోంది.
వేల సంవత్సరాల సుదీర్ఘకాలంలో మున్నెన్నడూ చూడని వైపరీత్యాలు నేడు అత్యంత వేగంగా, తీవ్రంగా, విస్తృతంగా సంభవిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మంచు కరిగిపోతోంది. సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. వందేండ్లకోసారి ఈ విపరీతానికి కారణమయ్యే విపత్తులు... ఇకపై ఈ శతాబ్దమంతా కొనసాగుతాయని ఈ నివేదిక అంచనా వేస్తోంది. ప్రస్తుత భూతాపాన్ని బట్టి యభై ఏండ్లకోసారి నమోదయ్యే తీవ్రమైన వడగాడ్పులు, ఉష్ణోగ్రతలు ఇక నుంచి పదెండ్లకోసారి పునరావృతమవుతాయని పేర్కొంటున్నది. భూతాపం ఇప్పుడున్న దానికి మరొక్క డిగ్రీ పెరిగినా ఈ ముప్పు ప్రతి పదేండ్లకు రెండుసార్లు ఎదురొస్తుందని స్పష్టం చేస్తున్నది. ఇది తక్షణం ప్రజల ఆరోగ్యాన్నీ, వారి జీవనాధారమైన వ్యవసాయాన్నీ దెబ్బతీయడమే కాదు, మునుముందు ప్రకృతికీ, ప్రకృతిలోని ప్రాణికోటికీ పెనుముప్పుగా పరిణమిస్తుందని తేల్చి చెపుతోంది.
నిజమే కదా..! ఇప్పటికే రోజు రోజుకూ భూమండలంపై వాయు ఉద్గారాలు పెరిగే కొద్దీ గాలిలో నాణ్యత తరిగిపోతున్నది. భూమి తేమను కోల్పోతున్నది. ఇది పెరిగేకొద్దీ తీవ్రమైన కరువులు, భీకరమైన తుఫాన్లు, బీభత్సమైన వరదలు, భయానకమైన వేడి గాలులు, కార్చిచ్చులూ అంతకంతకూ అధికమవుతాయి. అంతిమంగా ఇవి మానవాళి మనుగడకే సవాలుగా అవతరిస్తాయి. మరి ఇంతటి అరిష్టానికి మూలమైన ఈ భూతాపానికి కారణమేమిటి? ఈ నివేదిక చెపుతున్నట్టు ఇది ముమ్మాటికీ మానవ తప్పిదమేననడంలో సందేహమే లేదు. కానీ ఇందులో ప్రజల పాత్ర చాలా స్వల్పమైనది. అభివృద్ధి పేరుతో సాగుతున్న ప్రకృతి విధ్వంసం, లాభాపేక్షే తప్ప సామాజిక బాధ్యతలేని పారిశ్రామికీకరణే ప్రధానమైనది. భూమిని వేడెక్కించే వాయువులు విడుదల చేయడం, బొగ్గు కలప చమురులను మితిమీరి మండించడమే ఇందుకు కారణమని ఈ నివేదిక పేర్కొనడం ఇందుకు నిదర్శనం. భూగర్భం మొదలు అంతరిక్షం దాకా, సముద్రాలు మొదలు వాయు మండలం దాకా సమస్తమూ పెట్టుబడి లాభాలకు స్థావరాలయ్యాక ప్రజలూ, పర్యావరణం దిక్కులేనివిగా మిగిలిపోతుండటం కాదనలేని సత్యం. భూముల్ని తొలిచేస్తున్నారు. కొండల్ని పేల్చేస్తున్నారు. వనాలను కూల్చేస్తున్నారు. సముద్రాలను కబళిస్తున్నారు. చివరికి ఆకాశాన్నీ ఆక్రమిస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నదెవరు? ఈ చేస్తున్న దానికి కాపలా కాస్తున్నదెవరు? ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రమే ఈ పర్యావరణ విధ్వంసానికి అసలైన కారణాలనూ కారకులనూ పట్టివ్వగలదు.
ప్రతిజీవికి తన ఆవాస ప్రాంతంపై హక్కు ఉంటుందన్న సహజ న్యాయాన్ని విస్మరించిన సామ్రాజ్యవాద విధానాల ఫలితమిది. భూతాపాన్ని నివారించాలనీ, ప్రపంచవ్యాపితంగా ఉష్ణోగ్రతలను ఎట్టి పరిస్థితుల్లోను పెరుగనివ్వొద్దని శాస్త్రవేత్తలు ఎప్పటి నుండో హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆ మేరకు ప్యారిస్ ఒప్పందమూ జరిగింది. 19వ శతాబ్దపు ఉష్ణోగ్రతలను పరిగణకు తీసుకుని, 2100 సంవత్సరం నాటికి భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్‌కు కట్టడి చేయాలని, ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు దాటకుండా చూసుకోవాలని ఆ ఒప్పందంలో నిర్ణయించుకోవడమూ జరిగింది. కానీ ఆచరణలో జరుగుతున్న దేమిటి? 2100వ సంవత్సరం కాదు, 2030కి ముందే భూతాపం 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ హద్దులను దాటేస్తుందని ఈ ఐపీసీసీ నివేదిక తెలియజేస్తోంది. మరి ఈ అనర్థానికి కారణాలేమిటి? 1850-1900 మధ్యకాలంతో పోలిస్తే 2011-2020 మధ్య కాలంలో ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రత 1.09 డిగ్రీలు పెరిగింది. ఇంకా చెప్పాలంటే గత నూట డెబ్బయ్యేండ్లలో ఎన్నడూ లేనంత అత్యంత అధిక ఉష్ణోగ్రతలు ఈ ఐదేండ్లలోనే నమోదయ్యాయి. మరి ఒప్పందం ఏమైనట్టు? ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు? మనకు ఆవరణం కావాలంటే ముందు ఈ ప్రశ్నలకు సమాధానం రావాలి. అభివృద్ధిని పర్యావరణ పరిరక్షణతో కలిపే ప్రత్యామ్నాయ విధానం కావాలిప్పుడు.