Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్ రెండవ దశ విపత్తు నుండి ఇంకా బయటపడనైనా లేదు అప్పుడే మూడవ దశ ముప్పుపై వెలువడుతున్న సంకేతాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఒలింపిక్స్ నిర్వహిస్తున్న జపాన్‌లో కొన్ని ప్రాంతాల్లో వైరస్ కేసులు పెరుగుతుండటంతో అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ విధించారు. అమెరికాలో 50శాతం ప్రజల్లో వ్యాక్సినేషన్ జరిగాక కూడా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. బ్రిటన్ను డెల్టా రకం వైరస్ భయపెడుతోంది. చైనాలో సదరు వేరియంట్ కనిపించగా కట్టడి చర్యలు ముమ్మరమయ్యాయి. మధ్య, దక్షిణా ఆసియా, యూరప్ సహా 132 దేశాల్లో డెల్టా కేసుల పెరుగుదల థర్డ్‌వేవ్‌కు హెచ్చరికగా నిపుణులు చెబుతున్నారు. మన దేశం అందుకు మినహాయింపేమీ కాదు. జనాల కదలికలపై ఆంక్షలు సడలించిన దరిమిలా, తగ్గినట్లే తగ్గిన పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రతి రోజూ 50 వేల వరకు కొత్త కేసులు బయట పడుతున్నాయి. ఆరొందల వరకు మరణాలు సంభవిస్తున్నాయి. పది రాష్ట్రాల్లో క్రమేపి పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని, 46జిల్లాల్లో పది శాతానికిపైన పాజిటివిటీ రేటు కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ రెండ్రోజుల క్రితం వెల్లడించింది. చికెన్‌పాక్స్ అంతటి వేగంతో వ్యాప్తి చెందుతున్న ప్రాణాంతక వేరియంట్లను కట్టడి చేయకపోతే మహా ఉపద్రవం తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) కుండబద్దలు కొట్టిన దరిమిలా డెల్టా వేరియంట్‌కు పుట్టినిల్లయిన భారత్‌లో ఆందోళన అధికమైంది.
మూడవ దశ ప్రమాద ఘంటికలను భారత ప్రభుత్వం లక్ష్య పెట్టడంలేదనడానికి దాని ప్రవర్తనే నిదర్శనం. కేసులు పదుల సంఖ్యలో ఉన్న తొలిదశ మొదట్లో తెగ ప్రచార హడావిడి చేసిన మోడీ ప్రభుత్వం రెండవ దశ ముంచుకొస్తోందన్న హెచ్చరికలను ఖాతరు చేయలేదు సరికదా అప్పటి ఆరోగ్య మంత్రి అయితే కరోనా ఆట ముగిసిందని ప్రకటించి అప్రమత్తపు చర్యలను గాలికొదిలేశారు. పర్యవసాన దుష్పరిణామాలను దేశం ఎంతగా చవి చూసిందో తెలిసిందే. సెకెండ్‌వేవ్‌లో రోజుకు నాలుగు లక్షల కేసులు, నాలుగు వేల మరణాలతో జనం హతాశులయ్యారు. ఆక్సిజన్ అందక, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల్లేక, కార్పొరేట్ దోపిడీ వలన లక్షల ప్రాణాలు ఆపదలో పడ్డాయి. దేశ వ్యాప్తంగా మొత్తం వ్యాధి బాధితులు మూడు కోట్లను, మృతులు 4లక్షలను మించిపోవడం ప్రభుత్వంలో సన్నద్ధత లేకపోయిన ఫలితం. ఇంతటి ఘోర విపత్తు అనుభవం ముందుంచుకొని కూడా భారీ ముప్పుగా అంచనా వేస్తున్న థర్డ్ వేవ్‌ను నిరోధించి ప్రజల ప్రాణాలను కాపాడే విషయంలో మోడీ సర్కారు తన పాత ధోరణినే కొనసాగిస్తోంది.
వైరస్ కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సినేషనేనని డబ్ల్యుహెచ్ఒ, ఐసిఎంఆర్, ఎయిమ్స్, సహా పలు సంస్థలు, నిపుణులు నొక్కి చెబుతున్నారు. కార్పొరేట్లకు ఊడిగం చేసే రంధిలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రజలను కోవిడ్ నుండి రక్షించే వ్యాక్సినేషన్‌ను చేపట్టడంలో మీన మేషాలు లెక్కిస్తోంది. జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా ఆరున్నర మాసాల్లో 10.83శాతం మందికే రెండు డోసుల టీకా అందింది. దేశంలో 94 కోట్ల వయోజనులున్నారనగా పూర్తి స్థాయిలో 9కోట్ల మందికే వ్యాక్సిన్ అందింది. ఈ ఏడాది డిసెంబర్ 31 కల్లా ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం కనుచూపు మేరల్లో నెరవేరే పరిస్థితి కనిపించట్లేదు.
రాష్ట్ర ప్రభుత్వం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ వంటివి చేపట్టినా ఇప్పటి వరకు 40,18,731 మందికే అంటే 18.26 శాతం మందికే రెండు డోసుల టీకా పడింది. ఈ క్రమంలో మిగతా వారికి వ్యాక్సినేషన్ పూర్తి చేసే దాన్ని బట్టే మనం కోవిడ్‌ను ఎంతవరకు అరికట్టగలుగుతాం, థర్డ్‌వేవ్ ను ఎంతమేరకు అడ్డుకోగలమన్నది ఆధారపడి ఉంటుంది. మరోవైపు చాలా మంది చెబుతున్నట్లు కరోనా మూడోవేవ్ లో చిన్న పిల్లలు ప్రభావితం అయితే వారికి వైద్యం అందించడానికి మన ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లల వైద్య నిపుణులు, వెంటిలేటర్లు, ఇతర మౌలిక వసతులు తగినంత లేవు. ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు చేపట్టాలి. ఇప్పటికే ఆంక్షలతో ప్రజల జీవనోపాధి ఘోరంగా దెబ్బతింది. నిరుద్యోగం పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. ఈ పర్యవసానాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత.