Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో ఒలంపిక్స్‌లో క్యూబా పదిహేను మెడల్స్ సాధించి పెద్ద సందేశం ఇచ్చింది. మనదేశంలోని తెలంగాణ రాష్ట్ర జనాభాతో సమానంగా ఉంటుంది క్యూబా. నూటాముప్పది కోట్లకుపైగా జనమున్న మనదేశానికి మాత్రం కేవలం ఏడు మెడల్స్ మాత్రమే వచ్చాయి. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా అద్భుత ప్రతిభ ప్రదర్శించి దేశానికి అథ్లెటిక్స్‌లో మొదటి స్వర్ణ పతకాన్ని అందించాడు. వ్యవస్థాగత తోడ్పాటు, ప్రణాళికా బద్ధ కార్యాచరణ జోడించి క్రీడాకారులను రంగంలోకి దింపితే మరిన్ని పతకాలు వచ్చేవి.
విద్య, వైద్యం, క్రీడలపై పెట్టే పెట్టుబడి సామాజిక పెట్టుబడిగా భావించాలి. అప్పుడే ఆరోగ్యవంతమైన క్రీడాకారులు పుట్టుకొచ్చి క్రీడలు అభివృద్ధి అవుతాయి. చైనా, క్యూబా లాంటి సోషలిస్టు దేశాలు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. చైనాలో క్రీడలపై ఒక వ్యక్తికి ఒక రోజుకు ఆరు రూపాయల పదిహేను పైసలు ఖర్చు చేస్తుంటే, భారత్ మాత్రం మూడు పైసలు మాత్రమే ఖర్చు పెడుతున్నది. అంటే మనకంటే చైనా 200రెంట్లు ఎక్కువ ఖర్చుపెట్టుతున్నదని అర్థం. క్యూబాను తీసుకుంటే సంవత్సరానికి 900కోట్లరూపాయలు ఖర్చు చేస్తున్నారు. మన దేశం క్రీడా బడ్జెట్ రూ.1168 కోట్లు మాత్రమే. క్రీడలు అభివృద్ధి కావాలంటే క్షేత్రస్థాయిలో మౌలిక వసతులు కల్పించి, ఔత్సాహికులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. కానీ మన పాలకులు ఈ బాధ్యతను గాలికి వదిలివేసారు. చైనా, క్యూబా లాంటి సోషలిస్టు దేశాలు అంతర్జాతీయ నాణ్యతాప్రమాణాలతో ఎక్కువ సంఖ్యలో క్రీడా ప్రాంగణాలను నెలకొల్పి చిన్న వయస్సులోనే ప్రతిభావంతులను గుర్తించి అత్యుత్తమ శిక్షణతో రాటు తేలుస్తున్నాయి.
ఇక్కడ క్యూబా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం మరోటి ఉన్నది. క్యూబాలోని సోసలిస్టు వ్యవస్థను సామ్రాజ్యవాద అమెరికా ధ్వంసం చేయడానికి 60సంవత్సరాల నుండి ఆర్థిక ఆంక్షలు అమలు చేస్తున్నది. సరైన ఆహారం, మందులు, క్రీడా పరికరాలు అక్కడ అందటం లేదు. ఇతర దేశాల నుండి కూడా వాటిని అక్కడికి చేరకుండా అనేక చట్టాలు చేసి అమెరికా దిగ్భందనం చేస్తున్నది. అయినా వాటిని తట్టుకుని ఆంక్షల కాలంలోనే ఒలంపిక్స్‌లో క్యూబా 226 మెడల్స్ సాధించింది. అందులో 78 స్వర్ణం, 68 రజతం, 80 కాంస్యం మెడల్స్ ఉన్నాయి అంటే ఆలోచించండి. ఈసారి ఒలంపిక్స్‌లో 15 మెడల్స్ సాధించింది. అందులో ఏడు స్వర్ణం, మూడు రజతం, ఐదు కాంస్యం ఉన్నాయి.
ఇదే ఒరవడిలో అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న వెనెజులా కూడా ఒలంపిక్స్‌లో నాలుగు మెడల్స్ సాధించింది. జనాభా రీత్య వెనెజులా కూడా చిన్న దేశం. క్యూబా, వెనెజులా లాంటి దేశాలు అమెరికా సామ్రాజ్యవాదంకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఆంక్షలను ప్రతిఘటిస్తూ ముందుకు సాగుతున్నాయి. స్ఫూర్తిదాయకమైన పంథాను ప్రపంచం ముందు ఉంచుతున్నాయి. క్యూబా బాక్సర్లు క్రీడా ప్రపంచంలో ధృవతారలుగా నిలుస్తున్నారు. అమెరికా బాక్సర్లతో తలపడిన ప్రతి పోటీలో వీరోచితంగా పోరాడి గెలుస్తున్నారు. క్రీడా మైదానంలో సామ్రాజ్యవాద వ్యవస్థపై వారికి ఉన్న కోపాన్ని అక్కడ నిరూపించుకుంటున్నారా అన్న విధంగా ఉంటుంది.
టోక్యో ఒలంపిక్స్‌లో భారత్ హాకీలో మంచి ప్రదర్శన ఇచ్చింది. పురుషుల జట్టు మెడల్ సాధించింది. మహిళా జట్టు ఓడినా, వారి పోరాట పటిమతో అందరి మనసులు గెలుచుకున్నారు. దీనికి ఒరిస్సా ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రోత్సాహం ప్రధాన కారణం అనేది మరువరాదు. మెడల్స్ గెలిచిన ప్రతి క్రీడాకారిణికి ఒక బాధాకరమైన చరిత్ర ఉన్నది. అది ఇప్పుడు మనం గుర్తించాలి. హాకీ క్రీడాకారిణి రాణీ రామ్‌పాల్‌కు రెండు పూటలా కడుపునిండా తినటానికి అన్నం ఉండదు, వెయిట్ లిఫ్టర్ మీరాబారు ఇప్పటికీ ఇంటి కోసం అడవికి వెళ్ళి కట్టెలు తెస్తున్నది. బాక్సర్ లొల్లీనా ఇంటికి సరైన రోడ్డులేని గ్రామంలో ఉంటున్నది. హాకీలో హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన వందనా దళితురాలనే ఎగతాలిని అనుభవించాల్సి వచ్చింది. ఇలాంటి స్థితిమారాలి. ఒలంపిక్స్‌లో భారత చరిత్ర బాధాకరమైనది. 120 సంవత్సరాలలో కేవలం 28 పతకాలే గెలిచింది. ఈ పరిస్థితి మారాలి. అందుకు ప్రభుత్వం క్షేత్రస్థాయి నుండి చిన్న వయస్సులోనే క్రీడాకారులను గుర్తించాలి. వారికి ప్రత్యేక శిక్షణా ఏర్పాట్లు చేయాలి. కానీ ఈ రోజు మనదేశంలో గెలిచిన వారికి నజరాణాలు ప్రకటించడంలో పోటీ పడుతున్నారు తప్ప క్షేత్రస్థాయి నుండి అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టడంలేదు. ఈ విధానం మారాలి.
రెండోది ఒక క్రికెట్‌కే ప్రాధాన్యత, స్పాన్సర్స్ ఉండటం అనే పద్ధతి పోవాలి. రెండు చేతులా సంపాదించుకోవడానికి అవకాశం ఉన్న ఆట క్రికెట్. అందుకే దాని వెంట ఎగబడుతున్నారు. భారతదేశ జనాభాలో ఎక్కువ మంది యువకులు ఉన్నారు. ఇది మనకు మంచి అవకాశం. దాన్ని వినియోగించుకుంటే మంచి క్రీడాకారులు లభిస్తారు. కాబట్టి ప్రభుత్వం లాభసాటి వాటిని ప్రోత్సహించి మిగతా వాటిపై సవతితల్లిలా వ్యవహరించరాదు. ఒక సమగ్ర క్రీడావిధానాన్ని రూపొందించి అమలు జరపాలి. ఏది ఏమైనా టోక్యో ఒలంపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులందరినీ అభినందించి గెలిచిన వారికి ప్రత్యేక అభినందనలు తెలపాల్సిన సందర్భం ఇది. అందులో మన పివి సింధు కూడా ఉండటం మనకు గర్వకారణం. పారిస్ ఒలంపిక్స్ నాటికి మనదేశం కూడా గట్టి పోటీని ఇచ్చి ఎక్కువ మెడల్స్ సాధించే దేశంగా అభివృద్ధి కావాలని కోరుకుందాం.