Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఎక్కడ స్వచ్ఛమైన వివేకధార ఇంకిపోకుండా ఉంటుందో, ఎక్కడ నిరంతర ఆలోచన, ఆచరణ వైపు నీవు బుద్ధిని నడిపిస్తావో... ఆ స్వేచ్ఛాస్వర్గానికి నా దేశాన్ని మేల్కొలుపు' అని గీతాంజలిలో రవీంద్రుడు పలికిన పలుకులు ఫలించి ఉంటే బాగుండేది. పరాయి పాలనకు భరతవాక్యం పలికేలా ప్రాణాల్నే పణం పెట్టిన కోట్లాది మంది అవిరళ త్యాగనిరతే దారిదీపమైతే ఏడున్నర దశాబ్దాల స్వాతంత్రం ఈ సరికే స్వేచ్ఛాస్వర్గంగా మారి ఉండేదనడంలో సందేహం లేదు. ప్రపంచ యువత అభివృద్ధి సూచిలో మందగమనంతో, దేశ ప్రగతికి చోదక శక్తులుగా భావితరాల్ని తీర్చిదిద్దలేని మందభాగ్యంతో 'ఆశలు ఆకాశంలో అవకాశాలు పాతాళంలో' అన్న చందంగా నిట్టూర్పు సెగలు చుట్టుముడుతున్న సమయమిది. ప్రపంచ యువత అభివృద్ధి సూచిలో భారత్ 122వ స్థానంలో నిలిచింది. విద్య, ఉపాధి, ఆరోగ్యం, సమానత్వం, శాంతి, భద్రత, రాజకీయ తదితర 27అంశాల్లో యువత పాత్ర, అభివృద్ధిపై 181 దేశాల్లో సర్వే నిర్వహించింది 'ది కామన్వెల్త్' సంస్థ. సింగపూర్ మొదటి స్థానంలో నిలవగా.. స్లోవేనియా, నార్వే, మాల్టా, డెన్మార్క్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. చాద్, ది సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, దక్షిణ సుడాన్, అఫ్గానిస్థాన్ జాబితాలో అడుగున చేరాయి.
2010-18 వరకు ప్రపంచవ్యాప్తంగా 15-29 ఏండ్ల మధ్యవారిపై అధ్యయనం చేశారు. ఈ వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా యువత పరిస్థితులు 3.1శాతం మెరుగుపడ్డాయని నివేదిక వెల్లడించింది. కానీ పురోగతి నెమ్మదిగా ఉన్నట్టు కూడా తెలిపింది. 'కరోనా వైరస్' ఊసైనా లేని సమయంలో సేకరించిన వివరాలైనా.. ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా ఇప్పటివరకు సాధించిన ప్రగతి కూడా నీరుగారే అవకాశం ఉందని హెచ్చరించింది. తక్షణం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. ర్యాంకింగ్స్ విడుదలకు ముందు 'ది కామన్వెల్త్' ప్రధాన కార్యదర్శి పాట్రిసియా స్కాట్లాండ్ మాట్లాడుతూ.. 'ఉజ్వల భవిష్యత్తు అందించడంలో యువత పాత్ర కీలకమని' పేర్కొన్నారు. అవును కదా ఏదేశ నిర్మాణానికైనా యువతరమే కీలకం. కానీ మన దేశంలో యువత పరిస్థితేమిటి? అభివద్ధిలో వారి పాత్ర ఏమిటి..? నిజానికి అపారమైన మానవ వనరుల నెలవు మన దేశం. మన దేశ జనాభాలో 50శాతానికి పైగా యువజనులే..! ప్రపంచంలో మరేదేశానికి ఇంతటి యువసంపత్తి లేదంటే అతిశయోక్తి కాదు. కానీ విషాదమేమిటంటే మానవ వనరుల అభివృద్ధిలో మాత్రం ఈ దేశానిది అట్టడుగు స్థానం...!? ప్రగతి లక్ష్యాల్ని అలవోకగా వల్లెవేసే ప్రభువులు... అందుకు దీటైన మానవ వనరుల అభివృద్ధిపై దీర్ఘకాలిక వ్యూహంతో, యువతరాన్ని భారత భాగ్యవిధాతలుగా రూపొందించే పటుతర కార్యాచరణతో నిష్టగా నిబద్ధతతో కదిలి ఉంటే ఈ దేశ ప్రగతికి ఆకాశమే హద్దయి ఉండేది.
జాతి నిర్మాణంలో క్రియాశీల భూమిక పోషించగలిగేలా యువతరాన్ని నైపుణ్య శక్తులుగా ఇప్పటికీ తీర్చిదిద్దుకోలేకపోవడమే దిగులు పుట్టిస్తోంది. ఒకవైపు చదువుకు తగిన ఉపాధిలేక, ఉపాధికి అవసరమైన చదువు అందక నిరుద్యోగం దిన దిన ప్రవర్థమానమవుతుంటే, మరోవైపు దేశంలో ప్రబలుతున్న అసహనం, అరాచకం, మతోన్మాదం, దిగజారుతున్న విలువలు యువతరం భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. తమ ప్రభుత్వం అందిస్తున్న నైపుణ్యాభివృద్ధిని అందిపుచ్చుకొని యువత అభివృద్ధిలోకి రావాలంటున్నారు మోడీ గారు. కానీ వాస్తవాలు అందుకు విరుద్దంగా ఉన్నాయి. పాలకులు ఉద్బోధలను పక్కన పెట్టి, జీవన నైపుణ్యాలను పాఠశాల స్థాయిలోనే ప్రవేశపెట్టి పనికొచ్చే చదువులతో భావితరాల్ని తీర్చిదిద్దే మహాక్రతువును ఆరంభించాలి. 'ఎంత చదువుకు అంత నిరుద్యోగిత'గా గుల్లబారిన వ్యవస్థను ప్రక్షాళించి, రేపటి అవసరాలకు దీటైన జాతి రత్నాలుగా తీర్చిదిద్దగలిగితే ఈ దేశానికి భవిష్యత్తని ప్రభుత్వాలు గుర్తించాలి.
అంశాలవారీగా చూస్తే.. విద్యలో స్వీడన్, సమానత్వంలో లక్జెంబర్గ్, రాజకీయ, పౌర చైతన్యంలో ఇండోనేషియా, ఉపాధి, ఆరోగ్యం, శాంతి, భద్రత అంశాల్లో సింగపూర్ ముందంజలో ఉన్నాయి. కానీ.. మహిళల భద్రత విషయంలో పురోగతి కనిపించలేదని నివేదికలో వెల్లడైంది. 102 దేశాల్లోని యువత.. రాజకీయాలపై తక్కువ ఆసక్తి కనబర్చుతున్నట్టు తేలింది. కానీ, యువతే దేశాన్ని నిర్మించడానికి అవసరమైన రాజకీయ చైతన్యాన్ని అందిపుచ్చుకోవాలి. తమ భవిష్యత్తును, దేశ భవిష్యత్తును నిర్దేశించే చట్టసభల్లో భాగస్వామ్యం కోసం పోరాడాలి. భారతీయుడి సగటు వయసు 29ఏండ్లు కాగా.. పార్లమెంట్ సభ్యుల సగటు వయసు 56 ఏండ్లు. దీనిని బట్టి మనదేశంలో రాజకీయా లకూ యువజనానికి మధ్య ఉన్న అగాధాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ అగాధాన్ని పూడ్చాలి. అందుకు యువత రాజకీయాల్లోకి రావాలి. తమను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసే నేతలకు గుణపాఠం చెప్పాలి. దేశ జనాభాలో యువతరం 75శాతానికి చేరుకుంటున్న నేపథ్యంలో వారి ఆలోచనలకు, అభివృద్ధికి తగిన రాజకీయాల నిర్మాణం నేటి అవసరం.