Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డెబ్బయి ఐదేండ్ల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న సందర్భం ఇది. దేశాన్ని గురించీ, దేశభక్తిని గురించీ తెలుగు చలనచిత్ర రంగాన వెల్లువెత్తిన సాహిత్యం చాలానే ఉంది. పాటల రూపంలో ఎంతో ప్రభావాన్ని, చైతన్యాన్ని కలిగించిన గీతాలు ఇప్పటికీ మనల్ని ఉత్తేజితులను చేస్తూనే ఉంటాయి. సామాన్యుల నాలుకలపై ఆడుతూనే ఉంటాయి. దేశంపై ప్రేమను, దేశంలో తలెత్తుతున్న సమస్యలను ప్రతిబింబిస్తూనే, కర్తవ్యబోధనూ చేస్తుంటాయి.
'నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నాయిల్లు అందులో కమ్మని ప్రదేశము, నా సామిరంగ హైహై నా సామిరంగ, నడిచేదారిలో నవ్వే పువ్వులు, శాంతినాదాలతో ఎగిరేపిట్టలు' అంటూ దేశపు సొగసును, ప్రేమను పొంగిస్తుంది పాట. 'భారత మాతకు జేజేలు, బంగరు భూమికి జేజేలు, ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు' అన్న బడిపంతులు చిత్రంలోని గీతంలో భారతదేశపు గొప్పతనాన్ని వివరిస్తూ 'సహజీవనము, సమభావనము, సమతావాదము వేదముగా, ప్రజాక్షేమమే లక్ష్యములైన విలక్షణ భూమి' అని రాజ్యాంగపు మౌలిక సూత్రాలను పాటగా మలిచారు. 'జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపీ గరీయసీ...' అని, 'పుణ్యభూమి నాదేశం నమో నమామీ' అని దేశ గొప్పతనాన్ని చాటుకుంటూనే ఉన్నాం. అరవైలలో వచ్చిన రాముడు భీముడు సినిమాలో 'ఉందిలే మంచికాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నంద నందానా, ఎందుకో సందేహమెందుకో, రానున్న విందులో నీవంతు అందుకో' అని ఒక ఆశావహ అభివృద్ధిని కలగనటం పాటలో కనపడుతుంది. మంచికాలమంటే ఏమిటనే ప్రశ్న పాటలోనే వేసి, 'దేశ సంపద పెరిగే రోజు, మనిషి మనిషిగా బతికేరోజు' అని సమాధానం చెబుతారు. కానీ ఇప్పుడు సంపద పెరిగిందేమో కానీ మనిషి మనిషిగా బతికే రోజు ఇంకారాలేదు. మూడు పూటలా కడుపునిండా అందరు తినే రోజూ రాలేదు మరి! అందరికోసం ఒక్కడు నిలిచి, ఒక్కని కోసం అందరు కలిసి, సహకారం ఊపిరిగా బతకాలని బోధిస్తారు. కానీ కొందరి కోసం అందరూ కోల్పోతున్న భారతాన్ని చూస్తున్నాం.
'పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయగీతికా, నేడే స్వాతంత్య్ర దినం వీరుల త్యాగఫలం, నేడే నవోదయం... స్వాతంత్య్రం వచ్చెననీ సభలే చేసి సంబర పడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోరు' అని చెబుతూ 'ఆకాశం అందుకొనే ధరలొకవైపు, అంతులేని నిరుద్యోగమింకొకవైపు, అవినీతి బంధుప్రీతి చీకటి బజారు, అలుముకున్న ఈ దేశం ఎటుదిగజారు, పదవీ వ్యామోహాలు, కులమత బేధాలు, భాషాద్వేషాలు చెలరేగే నేడు, ప్రతి మినిషి మరియొకని దోచుకునే వాడే..'' అని వివరిస్తూనే సమసమాజ నిర్మాణమే నీధ్యేయం సకల జనుల సౌభాగ్యమే లక్ష్యమని పదనిర్దేశన చేస్తారు.
ఆనాటి బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా వీరులుగా పోరాడిన వారి చరితలను దృశ్యమానం చేసిన గొప్ప చిత్రాలలో అల్లూరి సీతారామరాజు ఒకటి. అందులోని 'తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా, దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా, దారుణ మారణ కాండకు తల్లడిల్ల వద్దురా నీతిలేని శాసనాలు నేటి నుండి రద్దురా!' అని విన్నప్పుడల్లా ఢిల్లీలో గత ఎనిమిది నెలలుగా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని పోరాడుతున్న రైతులే గుర్తుకు వస్తారు. నీతిలేని శాసనాలు అప్పుడు తెల్లవాళ్ళు చేస్తే ఇప్పుడు మన నల్లదొరలే చేస్తున్నారు. ఇదీ చిత్రం!
'ఆకాశం గుండెల్లో అగ్నికణం సూర్యుడై, ఆవేశం గుండెల్లో అరుణం ఒక వీరుడై, బగ్గున ప్రళయించునపుడు వచ్చిందొక విప్లవం, దిక్కులు జ్వలియించి తెచ్చి ఇచ్చిందీ స్వరాజ్యం... ఉరికొయ్యల త్యాగాలకు వెయ్యి జన్మలొస్తే, ఉద్యమ భవిష్యత్తు నీకు కొత్త వెలుగునిస్తే, గుర్తించని స్వరాజ్యం గుండె బరువుకాదా!' అని త్యాగాలపై వచ్చిన స్వతంత్రం ఎవరికి దక్కిందన్న ప్రశ్న సూటిగానే పాటలో మ్రోగింది. 'అర్థరాత్రి స్వతంత్రం, అంధకార బంధురం, అంగాంగం దోపిడయిన కన్నతల్లి జీవితం, ఇదే ఇదే నేటి భారతం, భారతమాత జీవితం, శరీరమంతా కారాగారం, సంకెళ్ళేనా అలంకారం, ఉరితాడే మెడలో హారం, కన్నీళ్ళేనా జీవాధారం' అంటూ సాగే పాటలో దేశసంపదను దోచుకుంటూ, ప్రశ్నిస్తున్నవారిని నిర్బంధాలకు గురిచేయడాన్ని పాట కళ్ళకు కడుతుంది. ఇలా ఎన్నో ప్రశ్నల్ని పాటల్లో సంధిస్తూనే దేశమంటే ఏమిటో గురజాడ చెప్పిన పల్లవిని తీసుకుని స్వాతంత్ర దేశపు అనర్థాలను ఎండగడతారు కవి. ''దేశమంటే... మతం కాదు, గతం కాదు, అడవి కాదోరు, గొడవ కాదొరు, క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోరు, దేశమంటే.. గట్టి నుండి గగనమంటిన కుంభకోనం కాదు కాదోరు చట్టసభలో పట్టుకున్న జుట్టుజుట్టు కాదు కాదు... రాజధానుల రాచభవనపు రాసలీలలు కాదు కాదోరు, అబలపై అంకాన్ని చల్లే అరాచకమే కాదు కాదోరు పరిగి చాటిన గాలివార్తలు కాదు కాదోరు.. దేశమంటే మట్టికాదోరు దేశమంటే మనుషులోరు' అని చాలా గాఢంగా చెబుతారు. 'దేశం మనదే, తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే, ఏ కులమైనా, ఏ మతమైనా భారతమాతకొకటే లేరా' అన్న పాటలోని భావానికి పూర్తి భిన్నంగా మతాల మధ్య, కులాల మధ్య ద్వేషాలను పెంచుతున్నారు.
'ఈ జెండ పసి బోసి చిరునవ్వురా, దాస్య సంకెళ్ళు తెంచిందిరా, ఈ జెండ అమరుల తుది శ్వాసరా, రక్తతిలకాలు దిద్దిందిరా! మన స్వాతంత్య్ర పోరాట తొలిపిలుపురా, వెలలేని త్యాగాల ఘన చరితరా, అన్న బాబి సినిమాలోని గీతం స్ఫూర్తితో భారతదేశ పోరాట స్ఫూర్తిని మన లక్ష్యం చేరుకునే దాకా కొనసాగించడమే మన కర్తవ్యం.