Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెండా పండుగ ముగిసింది. ఈ సందర్భంగా డెబ్బయి అయిదేండ్ల స్వతంత్ర దేశం సాధించిన విజయాలు, వైఫల్యాలపై రాజకీయ ప్రసంగాలూ విశ్లేషణలూ అనేకం వెలువడ్డాయి. వీటన్నింటి మధ్య భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ చేసిన వ్యాఖ్యలు చాలా ప్రత్యేకమైనవి. అవి మన పార్లమెంట్ పనితీరుపట్ల ఆందోళణతో పాటు ఆలోచనలూ రేకెత్తిస్తున్నాయి. రోజు రోజుకూ దిగజారుతున్న చర్చల నాణ్యతమీద, చట్టాలు రూపొందుతున్న తీరుమీద ఆయన ప్రకటించిన అసంతృప్తి వర్తమాన భారత రాజకీయాలకు అద్దం పడుతోంది.
నిజానికి, ఇప్పుడు సమస్త రాజ్యాంగ వ్యవస్థలూ తీవ్రమైన దాడికి గురవుతున్న కాలంలో మనమున్నాం. ఇందుకు భారత పార్లమెంటూ మినహాయింపు కాదని అర్థం చేసుకోవడానికి తాజాగా ముగిసిన వర్షాకాల సమావేశాలే ఓ ఉదాహరణ. ఈ సమావేశాల ప్రారంభంనుంచీ, పెగాసస్ అక్రమ నిఘాలు, వ్యవసాయ నల్లచట్టాలపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుపట్టడమూ, అదికార పక్షం ససేమిరా అంటూ అంగీకరించకపోవడమూ, చివరికి ఈ ప్రతిష్టంభనల మధ్యే పార్లమెంట్ ముగిసిపోవడమూ మనం కండ్లారా చూశాం. విచిత్రమేమిటంటే ఇంతటి ప్రతిష్టంభనలలోనూ దాదాపు ఇరవైకి పైగా బిల్లులు ఏ చర్చాలేకుండానే ఆమోదం పొంది చట్టాలుగా మారిపోయాయి. ప్రజాస్వామ్యానికి ఇంతకంటే అనర్థం మరొకటుంటుందా..?! ''ప్రజల నుంచి, ప్రజల చేత, ప్రజల కొరకు'' అన్న ప్రజాస్వామ్య సూత్రానికి ప్రతిరూపం పార్లమెంటు. అది దేశానికి దిశా నిర్దేశం చేసే అత్యున్న విధాన నిర్ణయాక చట్టసభ. ఆ చట్టసభ ప్రతిష్ట మసకబారుతున్న తరుణంలో మన చీఫ్ జస్టిస్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఎంతో ప్రాధాన్యత సంతరిం చుకున్నాయి.
పడిపోతున్న చర్చల ప్రమాణాలు, అసలు చర్చే లేకుండా ఆమోదం పొందుతున్న చట్టాల పట్ల ఆయన విచారం దేశానికి కనువిప్పు కావాలి. గతంలో పార్లమెంట్లో వివేకవంతమైన నిర్మాణాత్మకమైన చర్చలు జరిగేవనీ, అవి చట్టాల ఉద్దేశాలను, లక్ష్యాలను అర్థం చేసుకోవడంలో గొప్ప తోడ్పాటునందించేవని ఆయన పేర్కొనడం గమనార్హం. ఈ సందర్భంగా గతంలో పారిశ్రామిక విధానాలపై జరిగిన చర్చనూ, ఆ చర్చలో పాల్గొన్న నాటి సీపీఐ(ఎం) ఎంపీ పి. రామ్మూర్తి చేసిన వివరణాత్మక ప్రసంగాన్నీ ఆయన గుర్తు చేసుకోవడం విశేషం. ఈ రకమైన చర్చలు లోతైన విశ్లేషణల ద్వారా ఆ చట్టాల ప్రయోజనమేమిటో స్పష్టంగా తెలిసేది అన్న న్యాయమూర్తి మాటలు అక్షర సత్యాలు. ప్రస్తుతం పార్లమెంటులో అలాంటి చర్చలే కరువయ్యాయన్న ఆయన స్పందనలు ప్రజాస్వామ్యానికి ప్రమాద సూచికలు.
ఇంతకూ ఇలా పార్లమెంటు ప్రతిష్ట భ్రష్టుపట్టడానికి కారణమేమిటీ? ప్రతిపక్షాలు సభను సాగనివ్వకపోవడమే అంటుంది అధికార పక్షం. మేం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడం, చర్చకు అనుమంతించ కపోవడమే అంటుంది ప్రతిపక్షం. నిజమే కదా.. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ప్రశ్నించడం ప్రతిపక్షాల హక్కు. జవాబుదారీతనం ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వానికి జవాబుదారీ తనమే ఉంటే, ప్రభుత్వం ఏ తప్పు చేయకుండా ఉంటే పెగాసస్‌పై సమాధానం చెప్పడానికి భయమెందుకు? వ్యవసాయ చట్టాలపై చర్చకు జంకెందుకు? ఇవి రెండూ దేశంలో వ్యవసాయం, ప్రజాస్వామ్యాల ఉనికికే ప్రమాదఘంటికలు మోగిస్తున్న అంశాలు కదా. వీటిపై చర్చ కేవలం ప్రతిపక్షాల డిమాండ్ మాత్రమే కాదు. ఈ దేశ ప్రజలందరి ఆకాంక్ష. ఇది గుర్తించకుండా, ఈ ఆందోళనలనే ఓ అవకాశంగా తీసుకుని అప్రజాస్వామికంగా బుల్డోజ్ చేసి మరీ బిల్లులు ఆమోదించుకున్న ప్రభుత్వ తీరును ఏమనాలి?
ఇదలా ఉంచితే, సభలో చర్చకు అవకాశం లేని గందరగోళ పరిస్థితులు తలెత్తినప్పుడు బిల్లులను పార్లమెంటరీ సెలక్ట్ కమిటీకి పంపడం ఒక పార్లమెంటరీ సంప్రదాయం. అన్ని పార్టీల ప్రతినిధులతో కూడిన ఆ కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటిపై నివేదిక ఇస్తుంది. దాని ఆధారంగా ఆ బిల్లులను చట్టంగా ఆమోదించవచ్చు. కానీ బీజేపీ అధికారంలోకొచ్చాక ఈ పార్లమెంటరీ కమిటీలు కూడా ఉనికిని కొల్పోవడం మరో విషాదం. ఉదాహరణకు గత కాంగ్రెస్ ప్రభుత్వ చివరి ఐదేండ్ల కాలంలో 71 శాతం బిల్లులు పార్లమెంటరీ కమటీల పరిశీలనకు వెళితే, అది బీజేపీ మొదటి విడత ప్రభుత్వంలో 27 శాతానికి, ప్రస్తుత రెండవ విడతలో 12 శాతానికి పడిపోయింది. దీనిని బట్టి ఏం అర్థమవుతోంది? పార్లమెంటులో చర్చించరు. సెలెక్ట్ కమిటీకి పంపించరు. ఏ చర్చా లేకుండానే, అసలు ఎంపీల ప్రమేయం కూడా లేకుండానే ఏకపక్షంగా చట్టాలు తయారు చేస్తారు, ఆమోదిం చుకుంటారు..! ఇదేమిటని ప్రశ్నిస్తే సభకు అడ్డుపడుతున్నారని ఎదురుదాడి చేస్తారు. అలాంటప్పుడు ఇక పార్లమెంటు ఎందుకు? దానికోసం ఇంత ప్రహసనం ఎందుకు? ఈ నేపథ్యం నుంచి న్యాయమూర్తి ఆవేదనను దేశం అర్థం చేసుకోవాలి. సమస్యకు పరిష్కారమూ ఆలోచించాలి.