Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకవైపు కరోనా విపత్తు, మరోవైపు ఆర్థిక సంక్షోభం.. కారణాలేమైనా దేశంలో సగటు జీవుల బతుకు ఆగమవుతోంది. ఉపాధికి దూరమై, ఆదాయం లేక పస్తులుంటున్నారు. ప్రభుత్వాలు పుండు మీద కారం చల్లినట్టు ధరలను పెంచుతూ పోతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత ధరల నియంత్రణ విషయంలో శ్రద్ధలేదన్నది పచ్చినిజం. అసలే నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి బతుకుబండి భారమైపోతోంది అని జనం లబోదిబోమంటుంటే, తాజాగా వంటింట్లో గ్యాస్ మంటలను ఎగదోస్తూనేవుంది. కేంద్ర ప్రభుత్వం మరోసారి సిలిండర్ ధరను పెంచి గుదిబండగా మార్చింది. ఇప్పటికే భగ్గుమంటున్న ఇంధనధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్న సామాన్యుడు కట్టెల పొయ్యే నయమంటున్నాడు. దీనికి తోడు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్యుల వంటింటి బడ్జెట్ ఉల్టా అవుతుంది. దీంతో కొన్ని సరుకులు కొనకుండా ఉన్న వాటితో సర్దుకునే పరిస్థితి. కందిపప్పు, మినపప్పు ధరలు రూ.130కు చేరాయి. ప్రతీ నెలా రేషన్ కార్డుపై 20 కేజీల బియ్యం రూ.20కి వస్తున్నా, పప్పు, ఉప్పు, మంచినూనెల ధరలు శక్తికి మించిన భారంగా మారాయి. పాలు, పెరుగు అధనం. దీంతో ఆయా కుటుంబాల్లో ఆర్థిక అసమానత ఏర్పడి చికాకులు తలెత్తుతున్నాయి. దీంతో ప్యొయి కిందే కాదు .. ప్యొయి మీద కూడా మంట మండుతుంది. పెరుగుతున్న ధరలను తట్టుకోలేక సామాన్యుడి జీవితం అర్థాకలి పాలవుతుంది.
వంట గ్యాస్ వినియోగంలో ఇండియా 2030 నాటికి చైనాను అధిగమించి ప్రపంచంలోనే తొలిస్థానంలో నిలుస్తుందని ఉడ్ మెకంజీ నివేదిక గతంలోనే వెల్లడించింది. ఇంధనంపై విధించే పన్నుల్లో ఇండియా ఇప్పటికే ప్రపంచ రికార్డు సాధించేసింది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలే కాదు, గ్యాస్ బండ రేట్లూ జన సామాన్యం గూబలదరగొడుతున్నాయి. నెలకు ఒక్కో సిలిండరుపై రూ.25 వడ్డించేస్తుంటే బతుకు బండి బోల్తా కొట్టి 'బండ' కింద నలుగుతుంది. ఏప్రిల్ తరవాతే చమురు ధరలు దిగివస్తాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఫిబ్రవరిలోనే ప్రకటించారు. ఏప్రిల్ కాదు కదా ఆగస్టు వచ్చినా ధరలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. దీంతో గ్యాస్ బండ వెయ్యి రూపాయలకు చేరుతుందన్న అంచనాలు భీతి కలిగిస్తున్నాయి. గ్యాస్ బండ ధరాభారం ఇంటి బడ్జెట్ ను తలకిందులు చేస్తోందన్నది వాస్తవం. వంటగ్యాస్ ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో ఇస్తూ వచ్చిన రాయితీ క్రమంగా కోతలకు గురవుతున్నది. 2017లో సబ్సిడీయేతర సిలిండర్ ధర వెయ్యి రూపాయలుగా ఉన్నప్పుడు రాయితీ అత్యధికంగా రూ.535 కాగా.. ఫిబ్రవరి నుంచి రాయితీ రూ.41లోపే ఉంటుండగా, వారం వారం పెరుగుతున్న ధరలతో వంట గ్యాస్ మంట జనం జేబుల్ని కాల్చేస్తోంది. నిరుపేద వర్గాల పట్ల క్రూర పరిహాసమిది! సబ్సిడీల అర్థం మారిపోయింది. లేనివాడిని కొట్టి ఉన్నవాడికి పెట్టడంగా మారిపోయింది. బడాపెట్టుబడిదారులకు రాయితీలు ఇస్తూ పేదల నోళ్లు కొడుతూ..పెద్దల జేబులు నింపుతుంటే.. మన ప్రధాని తరచూ ఉచ్ఛరించే 'సబ్కా సాత్ సబ్కా వికాస్' అంటే అర్థం ఇదేనా అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
సాధారణ పొయ్యిపై చేసిన వంట గంటకు నాలుగొందల సిగరెట్లు కాల్చినంత విషధూమంతో సమానమని- దానివల్ల కోట్లాది గృహిణుల ఆరోగ్యం పొగచూరిపోతున్నదంటూ మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజనను పట్టాలకెక్కించింది. మూడేండ్ల కాలంలో రూ.8,000 కోట్ల వ్యయంతో దారిద్య్రరేఖ దిగువన ఉన్న కోట్లాది మందికి ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చే బృహత్ పథకమది. స్త్రీ సాధికారత, స్వచ్ఛ ఇంధనం, స్వస్థత వంటి లక్ష్యాలతో నాలుగేండ్ల వ్యవధిలోనే ఎనిమిది కోట్ల మంది పేదలకు వంటగ్యాస్‌ను అందుబాటులోకి తెచ్చామని, నేడు దేశవ్యాప్తంగా 29 కోట్ల గ్యాస్కనెక్షన్లు ఉన్నాయని చమురు శాఖ కార్యదర్శి గతంలోనే ఘనంగా ప్రకటించారు. ఆ పథకాన్ని మరింత సరళతరం చేసి వచ్చే రెండేండ్లలో మరో కోటి కనెక్షన్లు అందిస్తామంటున్న ప్రభుత్వం, గ్యాస్ బండల భారాన్ని నిరుపేదలకు మోయలేని భారంగా మార్చింది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు తక్కువకు దొరుకుతున్నప్పుడు కూడా ధరలు పెరగడానికి కారణం ప్రభుత్వం విధించే పన్నులు పెంచడమేనని నిపుణులు చెబుతున్నారు. ఇటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతుండటంపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకవైపు కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ప్రజల ఆదాయంపై ప్రభావం పడిన వేళ ఈ ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుండడం ఆందోళనకర పరిణామం. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతల ఫొటోలను మీమ్స్ రూపంలో నెటిజన్లు ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారు. చవీశీసఱఖీబవశ్రీూషaఎ వంటి హ్యాష్‌ట్యాగ్‌లు కూడా ట్విట్టర్లో కనిపిస్తున్నాయి. సామాన్యుడి జేబు మీద పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ దాడి చేస్తున్నాయి. వీటి ప్రభావంతో నిత్యావసర ధరలు కూడా పెరుగుతున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు బతుకులు ఛిద్రం అవుతున్నాయి.