Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొన్న నిర్మల్లో జరిగింది చిన్న లొల్లి కాదు. ఆర్టీసీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యుద్ధానికి నమూన ప్రతిఘటన!
''ఊళ్ళన్నీ ప్రశ్నలై
గోస గొంతులై
జనం జండలై
ఊరు ఉద్యమమైతేనే...'' ('స్ఫూర్తి'చ్చిన స్ఫూర్తి మాటలు )
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపైన 2019 అక్టోబర్లో ప్రారంభించిన యుద్ధం ఆపలేదు. ఆర్టీసీ విధ్వంసం ఆగలేదు. కార్మికోద్యమం నడ్డివిరిచేశానని ప్రభుత్వం భరోసాతో ఉంది. ఐదు దశాబ్దాల పాటు ప్రజల రక్తమాంసాలతో ఇటుక, ఇటుకా పేర్చుకుంటూ నిర్మించుకున్న గూడును పలుగులతో, పారలతో కూల్చివేసే పనిలో ఉన్నట్టుంది. డొంకంతా కదలాలంటే ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరు తీగలాగాలి కదా! ఒక బాధ్యతాయుత అధికారే ఆ పనిచేశారు. నిర్మల్లో బయటపడ్డది కొండంత ఐస్గడ్డలో పిసరంత మొన మాత్రమే. టైటానిక్ సినిమాలా ఆర్టీసీ నౌక తలక్రిందులు కావడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.
ఇక్కడ సమస్య పాలకుడిది కాదు. పాలనది. 2001లో నాటి ఏపీఎస్ఆర్టీసీని తుంచేసి ముంచేయబోయిన పాలకులు 2004లో తామే మునిగిపోయిన చరిత్ర మనకెరికే! తెలంగాణ ఆవిర్భావానికి సరిగ్గా దశాబ్దం ముందటి పరిణామమది. ఆ పాలనపై వచ్చిన వ్యతిరేక తరంగాలపై సింహాసనాధీశుడైన వైఎస్ నైజం, కాపురం చేసే కళ కాలిగోళ్లనాడే' బయటపడ్డట్టు 2005లో జీఓ నం. 5తో బట్టబయలైంది. టీడీపీ తొక్కిన అడుసులోనే వైయస్ నడుస్తున్నారని కార్మికులు, ఇతర కష్టజీవులు అర్థం చేసుకున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడకుండా, ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు విధానాలను పల్లెత్తు మాటనకుండా కేవలం వ్యక్తుల గురించి మాత్రమే మాట్లాడి, పోట్లాడి, తొడలు చరిచి గోదాలో దిగిన నేతలు తాము ఎవరేసిన విత్తులకు నీళ్ళు పెడుతున్నారో, పాదులు కడుతున్నారో ఇప్పుడు ఆలోచించుకోవాలి. నిర్మల్లో లాగిన తీగకు చాలడొంకే కదులుతోంది. నిర్మల్లో ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ కోసం జరిగిన ఘటన. ఆర్టీసీ అధికారుల ఎన్.ఓ.సీ. ఉంటేనే సదరు ఆస్తుల లీజైనా ఇవ్వచ్చన్న షరతును కూడ పక్కనపెట్టి రెండు జిల్లాల్లో కలెక్టర్లు ఆర్టీసీ భూమి లీజు ఫైనలైజ్ చేసేశారు. సంబంధిత రీజనల్ మేనేజర్ మొత్తుకున్నా పట్టించుకున్న నాథుడులేడు. అనేక జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు తాము లీజుకు తీసుకున్న భూమికి కోట్ల రూపాయలు ఆర్టీసీకి బకాయి పడ్డారు. స్థానిక పత్రికల్లో పేర్లతో సహా వస్తున్నా ప్రభుత్వ పెద్దలు చప్పుడు చేయకపోవడం ఆశ్చర్యకరం.
అసలు దేశంలో ఆర్టీసీల వ్యవస్థనే కనుమరుగు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఆలోచన. అంటే అమెరికా తరహాలో ప్రజారవాణాని ధ్వంసంచేసి వ్యక్తిగత ట్రాన్స్పోర్ట్ని ప్రోత్సహించాలని బీజేపీ ప్రయత్నం. ఓలా, ఊబర్ల రంగ ప్రవేశంతో అటు ఆపరేటర్లు, ఇటు సామాన్యులు పడే బాధలు పెరుగుతున్నాయి. అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీలు నిర్వీర్యమయ్యాయి. ఆదారి ప్రమాదకరమని ఆ రాష్ట్రాల అనుభవం. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రారంభించిన విధ్వంసాన్ని బీజేపీ పరిపూర్తి చేసింది. కేంద్రం ఆర్టీసీలను నాశనం చేయ చూస్తోందని లేదా చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుందా? ఎమ్.వి.యాక్ట్ సవరణ బిల్లుపై 2015లో దేశవ్యాపిత సమ్మెలో పాల్గొని ఆ తర్వాత యూటర్న్ తీసుకుని అదిచట్టం కావడానికి సహకరించారు కదా! ఆర్టీసీల నాశనాన్ని బీజేపీతో కల్సి టీఆర్ఎస్ కూడా కోరుతోందని భావించాలా? లీజుల పేరున ముక్కముక్కా కొరుక్కు తినడం దానిలో భాగమేనా? విభజన నాటికి ఉన్న ఆర్టీసీ ఆస్తులు, ముఖ్యంగా ఖాళీ స్థలాలు ఎన్ని అన్యాక్రాంతమైనాయో రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిర్దిష్ట సమాచారమేమైనా ఉందా? ఎక్కడెక్కడ అన్యాక్రాంత మైనాయో ప్రభుత్వం చెప్పగలదా? యావన్మంది ఆర్టీసీ కార్మికులు, వారి వారి సంఘాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి చేయడమే గాక కేంద్ర విధానాలపై పోరాడకుంటే టీఎస్ఆర్టీసీ బతికి బట్టకట్టలేదు. యూనియన్ల, కార్మికుల రాజకీయాభిప్రాయాలకు కాక ప్రభుత్వ విధానాలపై సమక్యపోరుకు సన్నద్ధం కావాలి. 2021లో మరో 2001, మరో 2005 మరో 2019 పునరావృతమవ్వాలి. ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ ఆ ఉద్యమంలో అంతర్భాగమవ్వాలి.
కేంద్ర విధానాలను నిర్దిష్టంగా వ్యతిరేకంచకుండా, ప్రమాదకర ఆ విధానాల నుండి విడగొట్టుకోకుండా ఉపన్యాసాలకే పరిమితమైతే తెచ్చుకున్న తెలంగాణకే నష్టం. రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం నిలబడుతుందా లేదా అని తేల్చుకోవాలి.