Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికా 2001లో ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించింది. తాలిబన్లను, ఆల్‌ఖైదాను అంతం చేసి ఆధునిక ఆఫ్ఘనిస్తాన్‌ను నిర్మిస్తామని ప్రకటించింది. 2021నాటికి ఉగ్రవాదం అంతం కాలేదు, ఆధునిక ఆఫ్ఘన్ నిర్మాణం కాలేదు. అదే తాలిబాన్లు మల్లీ ఆఫ్ఘనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్నారు. అమెరికా దాని మిత్రపక్షాలు పెట్టే బేడా సర్దుకుని చల్లంగా జారుకున్నారు.
1978లో డెమాక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కమ్యూనిస్టు అయిన నజీబుల్లా నాయకత్వంలో ఆవిర్భవించింది. ఆఫ్ఘనిస్తాన్ నాటి సోవియట్ యూనియన్ సరిహద్దు దేశం. సోషలిస్టు దేశాల విస్తరణ జరగడాన్ని సహించలేని అమెరికా మతభావాలు గల తాలిబాన్లను తయారుచేసి నజీబుల్లా ప్రగతిశీల ప్రభుత్వంపై తిరుగుబాటు చేయించి ప్రభుత్వాన్ని కూల్చింది. నజీబుల్లాని హత్య చేశారు. ఆఫ్ఘన్ తాలిబాన్ల వశం అయింది. మత విశ్వాసాల ప్రకారం అక్కడ ఆటవిక పాలన సాగించారు. ప్రగతి ఆగిపోయింది. కాలక్రమంలో అమెరికాకు వ్యతిరేకంగా మారి 2001లో అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాలను విమానాలతో ఢకొీట్టి కూల్చివేశారు. ఈ సంఘటనను సాకుగా చూపి అమెరికా ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించింది. కాని అసలు లక్ష్యాలు వేరే ఉన్నాయి.
ఆఫ్ఘనిస్తాన్‌లో అపారమైన ఖనిజ సంపద, క్రూడ్ ఆయిల్, లితీనియం నిల్వలున్నాయి. వాటిని అమెరికా సొంతం చేసుకోవాలి. భౌగోళికంగా ఇది వ్యూహాత్మక ప్రాంతం. చైనా, భారత్‌లకు పొరుగు నుంటుంది. యుద్ధంపేరుతో ఆయుధాలు అమ్ముకోవచ్చు. దేశాన్ని ద్వంసం చేసి పునర్నిర్మాణం పేరుతో అమెరికా కంపెనీలకు చేతినిండా పని ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు అమెరికాకు ఉన్నందుకు ఆఫ్ఘనిస్తాన్‌ను బలిపశువును చేశారు.
సామ్రాజ్యవాద అమెరికా 2001లో ప్రారంభించిన ఉగ్రవాదంపై యుద్ధంలో ఇప్పటి వరకు జరిగిన ఆర్థిక - ప్రాణ నష్టం పెద్దమొత్తంలో ఉన్నది. రెండులక్షల కోట్ల డాలర్లు ఖర్చయింది. ఇప్పటికి లక్షన్నర మంది పౌరులు, 65వేల మంది ఆఫ్ఘన్ సైనికులు, పోలీసులు చనిపోయారు. అమెరికా సైనికులు 2300మంది చనిపోయారు. ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధికి దూరం అయింది.
తాలిబాన్లకు అమెరికా నుండి సౌదీ అరేబియా ద్వారా నిధులు అందినాయి. అధికారంలోకి వచ్చిన అమెరికా తొత్తులు అయిన రాజకీయ నాయకులు కూడా విపరీతంగా అవినీతికి పాల్పడ్డారు. ఆస్రాప్ ఘనీ తమ దేశం విడిచి వెళ్ళే సమయంలో పెద్దమొత్తంలో డబ్బులు తీసుకుపోయినట్టు వార్తలు వస్తున్నాయి.
ఒబమా కాలం నుండి ఆర్థిక సంక్షోభం వలన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలనే నిర్ణయానికి అమెరికా వచ్చింది. సహజంగానే ఆఫ్ఘాన్ ప్రజలు పరాయి పాలనను ఇష్టపడరు. దానితో ప్రజలలో విపరీతమైన వ్యతిరేకతను అమెరికా మూటకట్టుకున్నది. అందుకని ప్రత్యక్షంగా సైన్యం పెట్టి పాలించడం కంటే పరోక్ష పద్ధతుల ద్వారా పాలించుకోవచ్చనే నిర్ణయానికి వచ్చింది. డ్రోన్లు, వైమానిక దాడులపై ఆధారపడేందుకు తన వ్యూహాన్ని మార్చుకున్నది. సైన్యాన్ని ఉపసంహరించింది. ఇప్పుడు తాలిబాన్లు మొత్తం దేశాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. మీడియాకు వారు ఇస్తున్న సమాచారం ప్రకారం తాము మారామని కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అన్ని పక్షాలతో చర్చిస్తున్నామని, కొత్త ప్రభుత్వంలో మహిళలు కూడా చేరవచ్చని చెపుతున్నారు. ఇస్లాం మతం ఆధారంగా ప్రభుత్వం నడుస్తుందని ప్రకటించారు. మహిళల ఉద్యోగాలు చేయవచ్చని, విద్యా, ఆరోగ్య రంగాలలో మాత్రమే మత పద్ధతులకు లోబడి చేసుకోవాల్సి ఉంటుందని పరిమితిని ప్రకటించారు. తాలిబాన్లు అధికారంలో స్థిరపడాలంటే ఇతర దేశాల సహాయ సహకారాలు అవసరం ఉంటుంది. కావున మారాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఆచరణను బట్టి ఇవి తెలుస్తాయి.
తాలిబాన్లు కొంతకాలంగా చైనా, రష్యా, ఇరాన్ ప్రభుత్వాలతో చర్చలు జరిపారు. ఆ సందర్భంలో ఆ దేశాలు కూడా తాలిబాన్ల నుండి ఒక అంశంపై హామీ తీసుకున్నారు. రాబోయే కాలంలో ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుండి ఉగ్రవాద కార్యక్రమాలు జరగకుండా కట్టడి చేయడానికి ఒప్పించుకున్నారు. భారత్ ఇప్పటి వరకు ఏమి ప్రకటించలేదు. అమెరికా సంకలో చేరినందుకు అమెరికా చెప్పినట్లు చేయవచ్చు. స్వతంత్ర నిర్ణయం ఉండకపోవచ్చు.
ఏది ఏమైనా ఒక విషయం మనం గమనించాలి. దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజలు కేంద్రంగా ఏది జరగలేదు. ప్రజల అభివృద్ధి గురించి పట్టించుకున్న నాథుడే లేడు. అమెరికా తన లాభం గురించి పనిచేసింది. తాలిబాన్లు తమ ప్రాబల్యం పెంచుకునేందుకు కృషి చేసారు. అధికారంలో ఉన్న నాయకులు అవినీతికి పాల్పడి సొమ్ములు చేసుకున్నారు. ఒకమాటలో చెప్పాలంటే సామ్రాజ్యవాదం, మతోన్మాదం స్వప్రయోజనాలకే పాకులాడాయి తప్ప ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పనకు పూనుకోలేదు.