Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'విస్తరించిన మౌనాలు ప్రేక్షక పాత్ర వహిస్తున్న కాలంలో, ఆకృత్యాలు రక్తమోడుతూనే ఉన్నాయి. గుండెలన్నీ చుట్టూ ఉన్నా కొట్టుకోవటం మరచిపోయాయా! అమానవీయతను చుట్టుకున్నాయా?' అని ఆవేదన చెందుతాడోకవి. నిజమే, మన కండ్లముందు జరగకూడనివి, దుర్మార్గమైనవి జరుగుతున్నప్పుడు మౌనంగా ఎలా ఉండగలం! మౌనంగా ఉండి మనుషులం ఎలా కాగలం! ఈ మౌన సంస్కృతిని ఛేదించకపోతే మారాలని కోరుకుంటున్న సమాజం ఎలా మారుతుంది. మనుషులు ఇంత శక్తి హీనంగా చైతన్య రహితంగా ఎందుకు మారారు? ఎవరి విషాదాలు వారివేనా! రేపు మనకూ ఎదురైతే! మనదాకా వచ్చినప్పుడు ఎవరుంటారు, ఎవరింటారు! మనల్ని మనం వెన్నుపై చరచుకుని మెలుకువ తెచ్చుకోవాల్సిన సమయం. లేకుంటే సమూహంలో ఎడారితనం తాండవిస్తుంది. మనుషులపైన నమ్మకం నశిస్తుంది.
అది నడిరోడ్డు, జనారణ్య కూడలి. అందరూ దృశ్యవీక్షకుల్లా చుట్టూ చేరుకునే ఉన్నారు. పదుల సంఖ్యలో కదులుతూనే ఉన్నారు. ఆటోదిగిన అమ్మాయిని ఉన్మాది కత్తితో పొడుస్తూ పొడుస్తూ కసిగా చంపేస్తున్నాడు. ఆయుధం దిగిన లేడిపిల్లలా రక్తంలో కూలిపోయింది రమ్య. తల్లిపేగును దు:ఖంలో ముంచి తల్లడిల్లుతూ ఊపిరి వొదిలేసింది. ఈ సంఘటన గుంటూరు రమ్యదొక్కటే కాదు. ఇలాంటి దృశ్యాలు అనేకంగా జరుగుతూనే ఉన్నాయి. దారుణాలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. నేరం చేసిన వాడికి శిక్ష పడవచ్చుగాక, ఏ నేరమూ చేయని ఆడకూతురుపై శిక్షకు కారకులెవ్వరు. ఎలా జరుగుతుంది న్యాయం! చూస్తూ నిలబడ్డవాళ్ళు నేరస్తులు కారా? అన్యాయం జరిగిపోయాక జరిగే న్యాయమేముంటుంది? అనేక దశాబ్దాలుగా వేసుకుంటున్న ప్రశ్నలే ఇవి. ఇప్పటి దు:ఖం కేవలం రమ్య కుటుంబానిదే కాదు. మనమందరమూ దు:ఖించాల్సిన విషయం. నిస్సహాయ సమూహంలో భాగమైనందుకూ నిలువరించ వీలున్నా నిస్సత్తువ ఆవహించినందుకూ మనం దు:ఖించాలి. కత్తులకు, తుపాకులకు, తూటాలకు ఎదురొడ్డి పోరాడి సాధించుకున్న స్వేచ్ఛాతలాన ఎందుకింత నిర్వీర్యత!
ఇప్పుడన్నీ వ్యక్తిగతాలే... సంతోషమయినా, ఆనందమయినా, సుఖమయినా దు:ఖమయినా. సమూహపు చైతన్యం సన్నగిల్లి చాలా కాలమయ్యింది. అందరి కోసం ఒక్కడు, ఒక్కడి కోసం అందరూ అనే సామాజిక సహకార దృక్పథం ఎప్పుడో అంతరించింది. నేను, నాది, నాకే అనే ఆలోచన విశ్వరూపం కొనసాగుతున్నది. ఎవరేమయినా నాకేంటి నేను బాగుంటే చాలానే భావన 'పెట్టుబడి'కి పుట్టిన భావావరణం. తన సుఖం కోసం, సంతోషం కోసం ఇతరులు పనిచేయాలనే వ్యాపార లాభాల వ్యవహారమే మానవుల మధ్య సంబంధాలుగా విస్తరించింది. అందులోంచే నువ్వు నన్ను ప్రేమించు. నేను చెప్పినట్టు విను. నాకు సుఖాన్ని అందించు. లేదంటే నువ్వెందుకు? నాకు పనికిరాని వాళ్ళను లేకుండా చేయడమనే ఆలోచనకు పునాది వేస్తుంది. ఇది సరుకు సంస్కృతి. సరుకు అమ్మకం, కొనటంలో లాభం ముఖ్యమైనది. మనుషుల సంబంధాలలో కూడా వ్యక్తిగత లాభాలే ప్రధానమైపోతాయి. ప్రేమ కూడా ఒక సరుకు స్థాయికి దిగజారడం నేటి సమాజపు విషాదం.
మానవీయ విలువలను పెంపొందించాలంటే మౌన సంస్కృతిని బద్ధలు కొట్టాలి. మనుషుల మధ్య ఐక్యత నెలకొన్నప్పుడు కొత్తశక్తి జనిస్తుంది. విశ్వాసం పెరుగుతుంది. కానీ నేడు మతంపేరుతోనో, కులం పేరుతోనో మనుషుల మధ్య చీలిక తెస్తున్నారు. మధ్య యుగ మత ఛాందస భావాలను నూరిపోస్తున్నారు. ఆడపిల్లలు బలహీనులని, పిల్లల్ని కనటానికి, ఇంటి పనికోసమే అని బహిరంగంగానే ప్రకటిస్తున్న అనాగరిక విధానాన్ని చూస్తూనే ఉన్నాము. ఇవే పరిస్థితులు నేటి అఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ మతోన్మాదులు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా మహిళల అణచివేతకు పూనుకుంటున్నారు. పురుషుల ఆధీనంలోనే మహిళలు జీవించాలంటున్నారు. ఒక్క అఫ్ఘనిస్తాన్లోనే కాదు, మతం, సంప్రదాయం పేరు చెప్పి మానవుల, మహిళల హక్కులను, స్వేచ్ఛను హరించి ఉన్మాద ప్రవృత్తిని ప్రదర్శించటం ఎక్కడైనా ఒకే విధంగా ఉంటుంది. మన దేశంలో కూడా ఈ మత ఛాందసం ఉన్మాద రూపంలో వెర్రితలలు వేస్తూనే ఉన్నది. డ్రెస్ కోడ్ పేరిట, ఖాఫ్ పంచాయతీల పేర, పరువు హత్యల పేర ఆడపిల్లలపై అఘాయిత్యాలు దౌర్జన్యాలు పెరుగుతూనే ఉన్నాయి. మార్కెట్ వ్యక్తిగత విలాస సంస్కృతి ఒక వైపు, మత ఛాందస తిరోగమన భావజాలం మరోవైపు సమాజంపై దాడిని కొనసాగిస్తూనే ఉన్నవి. దీని పర్యవసానంగానే ప్రేమ అనే అందమైన పేరుతో మృగ కాంక్షలు కొనసాగుతున్నాయి. మౌన సంస్కృతి దర్శనమిస్తోంది.
ఆడపిల్లలను రక్షించాలనే ఉద్దేశ్యంతో దేశమంతా జరుపుకునే ఈ 'రక్షాబంధన' పండుగ సందర్భంగా మన తోబుట్టువులపై పెచ్చరిల్లుతున్న దాడులను అరికట్టటం కోసం పూనుకుంటామనే సంకల్పాన్ని ప్రకటించాలి. మౌన సంస్కృతిని వొదిలి మానవీయ విలువల కోసం మనవంతు కృషిని మొదలెయ్యాలి. ప్రభుత్వాలు, వ్యవస్థలు ఆడపిల్లల రక్షణకు ఒక సమగ్రమైన చర్యలప్రణాళికను రూపొందించాలి. ఆడపిల్లలు అబలలు కాదని చెప్పే రుజువులెన్నో ఉన్నాయి. మగ పిల్లలకు సమానమైన శక్తియుక్తులు కలిగి ఉన్నారని, ఉంటారని పాఠశాల స్థాయి నుండే అవగాహన కలిగించాలి. మన విద్యా లక్ష్యాల్లో సమానత ప్రధానాంశం కావాలి. ప్రశ్నించడం, అన్యాయాన్ని ఎదిరించడం ప్రాథమిక స్థాయినుండే అలవడ్డనాడు మాత్రమే మౌన సంస్కృతి శిథిలమవుతుంది. క్రూర సంఘటనలు నివారించబడతాయి.