Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఋక్కుల్లో రావిశాస్త్రిగారు 'గోవులొస్తున్నాయి జాగ్రత్త!' అన్న సందర్భం వేరు. నేటి స్థితి వేరు. దాదాపు అర్థశతాబ్ది దొర్లిపోయేసరికి తోడేళ్ల సీజనొచ్చేసింది. తోడేళ్లు కూడ వచ్చేశాయి. ఎన్నికలు రెండేండ్లుండగానే పెట్టుబడి పెంపుడు కోయిలలన్నీ కోరస్ ఎత్తుకోడానికి ఇది ''మల్లెల వేళ''నీ కాదు. ''వెన్నెల మాసమ''నీ కాదు. ప్రపంచంలోనూ, మనదేశంలోనూ సరళీకృత ఆర్థిక విధానాలు వికటించాయి. దాంతో ప్రజల బాధలు పెరిగాయి. వారిలో అసంతృప్తీ పెరుగుతోంది. దొరికినంత ఆబగా జుర్రుకునే పెట్టుబడి దగ్గర పరిష్కారాలు లేవు. దాంతో ''ముక్కలు'' అటు విసిరి, 'బొక్కలు' మాత్రం ఇటు పడేసే పనిలో 'కాపలాదారు'లున్నారు. ఈ 'కాపలాదారు'ల్లో అగ్రతాంబూలం అందుకోవల్సిన పార్టీ భారతీయ జనతాపార్టీనే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రారంభించిన ఆర్థిక విధానాలను మరింత శక్తివంతంగా, మరింత నిరంకుశంగా, మరింత నిర్దాక్షిణ్యంగా, మరింత కర్కశంగా అమలు చేస్తోంది బీజేపీనే కాబట్టి! పైకి లేచే గొంతుకల మెడమీద కత్తి పెడ్తోంది. ఐక్యమయ్యే చేతుల్లో నిప్పులు పోస్తోంది. దాని చేతిలో కులం, మతం అనే రెండు ఆయుధాలున్నాయి. యుద్ధోన్మాదాన్ని జాతీయోన్మాదంలో రంగరించి 'మతం'తో 'పోపేసి' రుచిగా వడ్డన చేస్తోంది. కూలిపోతున్న వారి కలల సౌధాన్ని 2019లో నిలిపింది ఆ 'వంటకమే!' ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయునా.. అన్ని రాష్ట్రాల బీజేపీ నాయకులూ ఆ పనిలోనే ఉన్నారు.
మొన్నటి 'సంజయ ఉవాచ' ఓ ఉదాహరణ. ''మసీదుల నుండి, చర్చీల నుండి యాత్రలు ప్రారంభిస్తే మతోన్మాదులు కారా? (ఎవరు ప్రారంభించారో, ఎప్పుడు ప్రారంభించారో ఈ పెద్ద మనిషి చెప్పలేదనుకోండి!) తాను హిందువును కాబట్టి, తనకు భాగ్యలక్ష్మి అమ్మవారంటే భక్తి కాబట్టి అక్కడి నుంచి యాత్ర ప్రారంభించాలనుకుంటే తనని మతోన్మాదులన్నారని సంజయుని ఆక్రోశం. మసీదుల నుండి, చర్చీల నుండి ఎవరైనా యాత్రలు ప్రారంభించి రాజకీయాల్లోకి పాపం! దేవుళ్లని లాగితే వారు కూడా మతోన్మాదులే! బీజేపీ నేతలకే అగ్రతాంబూల మివ్వాలన్నది ఎందుకంటే.. ''రామజన్మభూమి ఉద్యమం పూర్తిగా రాజకీయమైనది. మతంతో దానికి సంబంధం లేదు'' అని 2000 ఏప్రిల్‌లో భోపాల్ మీడియా ముందు (క్రీ.శే.) శ్రీమతి సుష్మాస్వరాజ్ చెప్పారు. అంతకు మరో దశాబ్దం ముందు 1989 జూన్ 11న పాలంపూర్‌లో బాబ్రీపై తీర్మానం ఆమోదింప జేసుకున్న తర్వాత శ్రీ ఎల్.కె. అద్వానీ ''ఇది ఓట్లుగా మారుతుందని నాకు నమ్మకముంది'' అన్నారు. ''నేను రాముణ్ణి చక్కగా వినియోగించు కోలేకపోయుండినట్లైతే న్యూఢిల్లీ నుండి గెలిచి ఉండేవాడిని కాదు'' అని జూన్ 18, 1991న అన్నారు. (ఆరెస్సెస్, ఎ మినేస్ టు ఇండియాలో ఎ.జి. నూరాని) ఇంత బాహాటంగా తమ భావాలు బయటపెట్టుకున్న వారిని మించిన మతోన్మాదులుంటరా?
''జనం ఆశీర్వదించా''లంటూ కేంద్ర మంత్రి రాష్ట్రానికి ఒక మూలనుండి ''యాత్ర'' లాంటిది అయిందనిపించారు. పెట్రోల్, డీజిల్‌ని సెంచరీ కొట్టించినందుకు దీవించాలో, వంటనూనెల్ని డబుల్ సెంచరీ దగ్గరికి చేర్చినందుకు దీవించాలో, వంటగ్యాస్ వెయ్యి చేసినందుకు దీవించాలో మంత్రిగారు సెలవిస్తే బాగుండేది. మనదేశ వ్యవసాయాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెడుతున్నందుకు దీవించాలో, దానికి వ్యతిరేకంగా తొమ్మిది నెలలుగా రైతాంగం పోరాడుతున్నా లక్ష్య పెట్టనందుకు దీవించాలో, వారి బి.ఎమ్.ఎస్.తో సహా దేశంలోని కార్మిక సంఘాలన్నీ కార్మిక కోడ్లను నిరశిస్తున్నా పట్టించుకోనందుకు దీవించాలో కేంద్రమంత్రి ఈ యాత్రలో పేర్కొని ఉంటే జనం సంతోషించి ఉండేవారు. వాస్తవానికి రాష్ట్ర బీజేపీలో సాగుతున్న అంతర్గత పోరుకు బహిరంగ రూపమే ఈ యాత్ర. సంజరుగారి 'బండి'ని వెనక్కి నెట్టి మంత్రిగారి రథం ఓ చిన్న రౌండ్ కొట్టి మంత్రిగారి మాటల్లో ఆయన ''పుట్టింటి'' దగ్గర సేదదీరి (అంబర్‌పేట) ప్రస్తుత మెట్టినింటి దగ్గర (సికింద్రాబాద్) ముగించారు.
ఇక రాష్ట్ర అధ్యక్షులవారు ''ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకుంటార''ట! సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల వాగ్దానమెటుపోయిందో అటు మంత్రివర్యులు గాని, ఇటు రాష్ట్ర అధ్యక్షులేకాదు, బీజేపీ నేతలెవరూ సమాధానం చెప్పేందుకు సిద్ధంగా లేరు. అవీ చునావీ జుమ్లా జాబితాలోకి చేరిపోతాయేమో!
దేశంలో ప్రజల మూడ్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉందని అర్థమైందేమో ''భారతదేశ చరిత్రలో సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహించిన దాఖలాల్లేవని సర్వశ్రీ వెంకయ్యనాయుడు వాక్రుచ్చటం బహుశా '8వ ప్రపంచ వింతే!' ఎన్నో ఉదాహరణలు, ఎక్కడి నుంచో తీసుకోవాల్సిన అవసరం లేదు. మొన్న శ్రీ వెంకయ్యనాయుడుగారు మాట్లాడిన హెచ్.ఎ.ఎల్. బెంగుళూరుకే పోదాం. హెచ్.ఎ.ఎల్.వారి హిందూస్థాన్ టర్బో ట్రెయినర్ల నిర్మాణ సంఖ్యని కుదించడం కూడా సామ్రాజ్యవాద వ్యతిరేకతేనా? 126 యుద్ధ విమానాల కోసం హెచ్ఎఎల్కు టెక్నాలజీ బదలాయించడానికి ద సాల్ట్ కంపెనీ సిద్ధమవుతున్న దశలో నాటి రక్షణ మంత్రికి కూడ తెలియకుండా మోడీ నేరుగా 36 రఫేల్ విమానాలు కొనడం కూడా సామ్రాజ్యవాద వ్యతిరేకతేనా ఉపరాష్ట్రపతిగారూ?! మిగిలిన 90ని కూడా దిగుమతి చేసుకుంటారా? లైట్కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు హెచ్ఎఎల్ 'తేజస్సు' ఇంజన్ బదులు రూ.5500కోట్ల ఆర్డర్ అమెరికాకు చెందిన జి.ఇ.కివ్వడం కూడ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడమా? బీజేపీ వైఖరి, ఎన్డీఏ ప్రభుత్వ ధోరణి తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదమన్నట్లే ఉంది. మనం జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం!