Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''భలే మంచి చౌక బేరము/ ఇది సమయము మించినన్ దొరుకదు త్వరన్ గొనుడు సుజనులార /భలే మంచి చౌక బేరము'' అంటూ శ్రీకృష్ణ తులాభారంలో కృష్ణుడిని బేరానికి పెడతాడు నారదుడు. ఇప్పుడు అచ్చం అలాగే ప్రజల ఆస్తులను అంగట్లో అమ్మకానికి పెట్టింది మోడీ సర్కార్. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన నిర్ణయాల ప్రాతిపదికగా నిటి ఆయోగ్ రూపొందించిన 'నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్‌ను (ఎన్ఎంపీ)' ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఆవిష్కరించారు. రహదారులు, రవాణా, రైల్వే, విద్యుత్తు, సహజవాయువు, పౌర విమానయానం, షిప్పింగ్, రేవులు, జల మార్గాలు, టెలీకమ్యూనికేషన్లు, ఆహారం, ప్రజాపంపిణీ, మైనింగ్, బొగ్గు, గృహనిర్మాణం మొదలైన 20కి పైగా రంగాల్లో ప్రభుత్వ ఆస్తులను నగదుగా మార్చే కార్యక్రమం జరుగుతుందని ఆమె వెల్లడించారు. పైగా వీటికి అంతగా ఆదాయంరాని, వినియోగంలో లేని ప్రభుత్వ రంగ సంస్థలు అంటూ ట్యాగ్ లైన్ తగిలించేశారు. నిత్యం వాడుకలో ఉండేవీ, మౌలిక రంగంలో కీలకమైనవీ అయిన రోడ్లు, రైళ్లు, విద్యుత్, గ్యాసు వంటివి అంతగా వినియోగం లేనివీ, ఆదాయం రానివీ ఎలా అవుతాయో ఏలినవారికే తెలియాలి! ఇవి నిజంగానే వినియోగం లేనివీ, ఆదాయం రానివీ అయితే వీటి విక్రయం ద్వారా 6 లక్షల కోట్లు ఎలా సమీకరిస్తారు?
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆర్థిక రంగంలో ఇన్ని జిమిక్కులు బహుశా ఎవరూ చూసి ఉండలేదేమో. దేశానికి వెన్నుదన్నుగా నిలిచిన నవరత్నాలను పూర్తిగా నిర్వీర్యం చేసి.. డబ్బున్నోళ్ల కబంధహస్తాల్లోకి నెట్టేసి.. దేశ ఆర్థిక వ్యవస్థ సమూల నాశనం కోసం ధ్వంసరచనకు పూనుకున్నది మోడీ ప్రభుత్వం. పెట్టుబడుల ఉపసంహరణపేరుతో ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా వదిలించుకోవడానికే ఈ చర్యలన్ని. అయితే ఆయా ఆస్తులపై యాజమాన్య హక్కులు ప్రభుత్వానివేనని, నిర్ణీతకాలం తర్వాత ప్రయివేటు భాగస్వామి ఆస్తిహక్కును ప్రభుత్వానికి తిరిగి అప్పగించడం తప్పనిసరి అని ఆర్థిక మంత్రి నమ్మపలుకుతున్నా.. ఒక్కసారి ప్రయివేటు చేతికి వెళ్లిన ఆస్తులేవీ తిరిగి ప్రభుత్వం చేతికి వచ్చిన దాఖలాలు ఇప్పటి వరకు చరిత్రలో లేవన్నది వాస్తవం. అధికారంలోకి రావడానికి ముందు పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వ్యతిరేకించి, మన్మోహన్సింగ్ ప్రభుత్వంపై విరుచుకుపడిన బీజేపీ, ఇప్పుడు అదే పనిని అంతకంటే వేగంగా, కర్కషంగా చేస్తున్నది. తోపుడుబండిపై 'హరేక్‌మాల్' అన్న చందాన ఎంత వీలైతే అంత మేరకు అమ్మేయడమే లక్ష్యంగా పెట్టుకొన్నది. 50శాతం పైగా
ఉన్న వాటాలను 49శాతానికి పరిమితంచేసి.. యాజమాన్య హక్కును నిస్సిగ్గుగా విక్రయించాలని నిర్ణయించింది.
ప్రజల ఆస్తులన్నీ కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతూ 'అభివృద్ధిలో దూసుకుపోతున్నాము... అగ్రరాజ్యాలతో పోటీ పడుతున్నాము' అంటూ చెప్పే పాలకుల వాగాడంబరం చూస్తోంటే 'ఊపర్ షేర్వాణి.. అందర్ పరేషానీ' అన్న సామెత గుర్తుకు రాక మానదు. నిజంగానే దేశం అభివృద్ధిలో దూసుకుపోతుంటే ప్రభుత్వ ఆస్తులు ప్రయివేటుకు ఎందుకు కట్టపెడుతున్నట్టు? అప్పటి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దాదాపు ఏడు ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటే.. మన్మోహన్ ప్రభుత్వం పదేండ్లలో మూడు సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించింది. ఇక ఈ ఏడేండ్ల మోడీ పాలనలో ఏకంగా 23సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించారు. 2014 ఎన్నికల ప్రచారంలో 'నేను రైల్వేస్టేషన్లో చాయ్ అమ్ముకున్నానే తప్ప దేశాన్ని అమ్మను' అంటూ ఊదర కొట్టిన ఆయన.. ఇప్పుడు అదే రైల్వేశాఖను ముక్కలు చెక్కలు చేసి ప్రయివేట్ సేట్లకు అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు. ప్రపంచంలోనే అతి పెద్ద బీమా సంస్థ ఎల్ఐసీని సైతం ప్రయివేట్ పరం చేయాలని కంకణం కట్టుకున్నారు. బంగారు బాతులను ఎవరైనా కోసుకొని తింటారా? కానీ మోడీ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నపని అక్షరాలా ఇదే. వాస్తవానికి సంపదను సృష్టించడం, దానిని తన జాతి ప్రజలకు అందించడం ప్రభుత్వం ప్రాథమిక విధి. ఈ దేశంకోసం.. ఎందరో మహామహులు మేధోశక్తినీ, ప్రజల సొమ్మునూ ధారపోసి ప్రభుత్వరంగంలో పలు సంస్థలను స్థాపించాయి నాటి స్వాతంత్య్రానంతర తొలి ప్రభుత్వాలు. ఇవి ఈ దేశ స్వాలంభనకు వెన్నముకగా నిలిచాయి. అద్భుతమైన ప్రగతిని సాధించాయి. అలాంటి ఈ సంస్థలను ఇప్పుడు మోడీ ప్రభుత్వం అంగట్లో వేలానికి పెడుతున్నది. ఈ ఏడేండ్ల పాలనలో నిత్యం ఏదో ఒక రంగం ఎవరో ఒకరికి ధారాదత్తమవుతూనే ఉన్నది.
మనది ప్రజాస్వామ్య లౌకిక సర్వసత్తాక గణతంత్ర దేశం.అంటే యావత్తు దేశం స్వీయ సంపుష్టి పొందడం. స్వావలంబన సాధించడం. ఇప్పుడు అదే ప్రమాదంలో పడింది. మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు దేశ వనరులను, దేశ సంపదను, దేశ శ్రమను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు కారుచౌకగా ధారపోస్తున్నాయి. దేశ స్వావలంబన కోసం ప్రధాన రంగాలైన రక్షణ, రవాణా కమ్యూనికేషన్, ఆర్థికానికి నాడీ వ్యవస్థలైన బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, మౌలిక సదుపాయాల కల్పనలతో పాటు, ప్రధాన వనరులైన చమురు, ఇనుము, ఉక్కు విద్యుత్తు వంటి పరిశ్రమలన్నీ ప్రభుత్వ రంగంలో ఉంటేనే దేశాభివద్ధి సాధ్యమన్నది సామాజిక, ఆర్థిక వేత్తల మాట. కాగా, సమస్త ప్రభుత్వరంగాన్ని ప్రయివేటుకు అప్పగించాలన్నది మోడీ సర్కారు పాట. అందుకే ఇప్పుడు ప్రజలు పట్టాలి పోరుబాట.