Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెక్సికోలో వామపక్ష పార్టీ అయిన మొరెనా అధికారం సాధించింది. దానితో లాటిన్ అమెరికాలో మరోదేశం వామపక్షం వైపు చేరింది. మొరెనా పార్టీ సరళీకరణ ఆర్థిక విధానాలను వ్యతిరేకించే పార్టీ. ఆ పార్టీ నాయకుడు మెక్సికో దేశాధ్యక్షుడు అయిన లోపేజ్ ఓబ్రడార్ పదవీ ప్రమాణం చేస్తున్నప్పుడు చెప్పినమాటలు చాలా ప్రాధాన్యత కలిగినవి. సరళీకరణ విధానాలు ఒక వినాశకరమైన విపత్తులాంటివని అన్నారు.
మొరెనా పార్టీ కార్యక్రమం ప్రకారం ''ప్రపంచ ఆర్థిక సంక్షోభం సరళీకరణ విధానాలు విఫలమైన అంశాన్ని నిరూపించింది. ప్రపంచ ఆర్థిక సంస్థలు రుద్దిన ఆర్థిక విధానాల ఫలితంగా మెక్సికో ఆర్థిక అభివృద్ధి చాలా మందగించింది. అందుకని ఏ విదేశీ జోక్యం లేకుండా స్వదేశీ ప్రభుత్వమే దేశ అభివృద్ధికి బాధ్యత వహించి ముందుండి నడపాలి'' అని ప్రకటించింది. ఈ ప్రకటన వెలుగులో దేశాధ్యక్షుడు అయిన ఓబ్రడార్ ఆర్థిక వ్యవస్థలో సరళీకరణ విధానాలకు భిన్నంగా కొత్త విధానాలను అమలు జరుపుతున్నారు. మెక్సికోలో గత కొన్ని దశాబ్దాలుగా నాయకులు అమలు జరిపిన సరళీకరణకు ఇవి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇవి కార్పొరేట్ సంస్థలకు నష్టం చేసేవిగా ఉన్నందుకు పెట్టుబడిదారి విధానాన్ని బలపరిచే పత్రిక ది ఎకనమిస్ట్ అట్టమీద ఓబ్రడార్ బొమ్మవేసి ''మోసపుచ్చే విముక్తి ప్రధాత'' అని పేర్కొన్నది. పెట్టుబడికీ, కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు పత్రికలు అన్న శ్రీశ్రీ మాటలు ఎంత సత్యమో అవి నిరూపించాయి.
మెక్సికోలో క్రూడ్ ఆయిల్ పుష్కలంగా ఉన్నది. 1980లో ప్రభుత్వరంగంలో ఉన్న ఆయిల్ రంగాన్ని సరళీకరణ విధానాలను మెక్సికో తలకెత్తుకున్నప్పుడు ప్రయివేటీకరణ చేసింది. కెనడాకి సంబంధించిన బహుళజాతి గుత్త సంస్థలు వాటిలోకి ప్రవేశించాయి. విపరీతమైన లాభాలను గడించాయి. క్రూడ్ ఆయిల్‌ని శుద్ధిచేసే రిఫైనరీలు మెక్సికోలో చాలా చిన్నవి ఉన్నాయి. వాటి సామర్థ్యం పెంచకుండా అమెరికాకు పంపి అక్కడ శుద్ధిచేస్తున్నారు. దానిలోని లాభాలను అమెరికన్ కార్పొరేట్ సంస్థలు జుర్రుకుంటున్నాయి. మొత్తంగా చూస్తే ఆయిల్ రంగంలోని నాలుగు అంశాలు అన్వేషణ, వెలికితీత, శుద్ధిచేయడం, పంపిణీ అన్నీ విదేశీ సంస్థలే నిర్వహిస్తున్నాయి. ఆయిల్ నిల్వలు పుష్కలంగా ఉన్న దేశంలో ప్రజలు ఎక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేయాల్సి వస్తున్నది. అందుకే ఓబ్రాడోర్ ప్రభుత్వం క్రూడ్ వెలికితీసే సంస్థలను జాతీయం చేసింది. శుద్ధిచేసేందుకు క్రూడ్ ఆయిల్ అమెరికాకు తరలించే విధానాన్ని తగ్గించి స్వదేశంలో శుద్ధిచేసే కర్మగారాల యొక్క సామర్థ్యాన్ని పెంచుతున్నది. కాబట్టి ఈ రెండు ప్రక్రియలలో వచ్చే ఆదాయం నేరుగా ప్రభుత్వ ఖజానాలోకి ఇప్పుడు చేరుతున్నది. ఆ నిధులు దేశాభివృద్ధికి వెచ్చించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
ఆయిల్ పరిశ్రమల నుంచి ప్రభుత్వానికి పన్నుల రూపంలో కూడా ఆదాయం పెరిగింది. గతంలో ప్రయివేటు సంస్థలు పన్నులు సక్రమంగా కట్టేవికావు. ఇప్పుడు ప్రభుత్వ రంగంలోకి వచ్చినందున సరైన లెక్కలు చూసి కచ్చితంగా వసూలు జరిగి ఆదాయం పెరుగుతున్నది. ఈ విధంగా ఓబ్రాడార్ ఇతర రంగాలలో కూడా జాతీయకరణ చేస్తున్నారు. సరళీకరణను మెక్సికో సరిహద్దుల నుంచి వెళ్ళగొట్టేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. మెక్సికో కేంద్ర బ్యాంక్‌ను కూడా ప్రభుత్వ ఆదీనంలోకి తీసుకునే చర్యలు మొదలు పెట్టారు. అందుకే సామ్రాజ్యవాదులు ఆయనపై విష ప్రచారం చేస్తున్నారు.
మెక్సికో చరిత్రను పరిశీలిస్తే సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలను ప్రపంచంలో మెక్సికోలోనే ప్రారంభంలో ప్రవేశపెట్టారు. ఇదే మొదటి ప్రయోగశాల. అక్కడే నలభై సంవత్సరాల తరువాత ప్రజలు తమ అనుభవంలో సరళీకరణ విధానాలు విఫలం అయినవని గమనించి వాటిపై పోరాడుతున్నారు. ఇది ప్రపంచంలో ఒక శుభపరిణామం.
1945 నుంచి 1970 వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పెట్టుబడిదారీ విధానం యొక్క స్వర్ణయుగం అంటారు. అప్పుడు పారిశ్రామిక దేశాలలో పోగుపడిన సొమ్మును ఇతర దేశాలకు సామ్రాజ్యవాద శక్తులు ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ ద్వారా తరలించాయి. తర్వాత డబ్ల్యూటీఓ దాని షరతులు కలిసినాయి. షరతులతో అప్పులు ఇచ్చి ఆదేశాలలో పాలకులను కీలుబొమ్మలుగా చేసుకుని లాభాలు గడించారు. ఈ నమూనాకు ప్రయోగశాలగా మెక్సికోను వాడుకున్నారు. కొల్లగొట్టి గుల్లచేసి అప్పులకుప్పగా మార్చారు.
బొలీవియా, వెనెజులా నేడు మెక్సికోలో సహజవనరులను జాతీయం చేస్తున్నారు. ఇవే సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలను కాంగ్రెస్, బీజేపీలు మన దేశంలో ఒకరి తర్వాత ఒకరు అమలు చేస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయం లేదని (టీనా) ప్రచారం చేస్తున్నారు. దీనికి సోషలిజమే ప్రత్యామ్నాయం (సీటా) అనే నినాదం ఈ దేశాల నుండి, వాటి అనుభవాల నుండి ప్రపంచంలో ఆ విధానాలపై పోరాడేశక్తులకు స్ఫూర్తినిస్తున్నది.