Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''తెలుగు భాష తియ్యదనం.. తెలుగు జాతి గొప్పతనం.. తెలుసుకున్న వాళ్ళకు తెలుగే ఒక మూలధనం.. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా... తెలుగు మరచిపోతే వాళ్ళని మరచినట్టురా..! మరువబోకురా!'' అంటూ మాతృభాష తియ్యదనాల, గొప్పదనాల గురించి బాగానే పాడుకుంటాం. పాడుకున్నంత తొందరగానే మరచిపోవటమూ చేస్తాం. అనుబంధాలను మరచినట్టుగానే, భాషను మరచిపోతే మనుషుల్ని మరచిపోయినట్టేనని ఎందుకన్నాడు! భాష పుట్టిందే మానవ సంబంధాల్లోంచి. అనుబంధాల్లో ఆప్యాయతల్లో అది మరింత అభివ్యక్తీకరించబడి సాంస్కృతిక మానవుణ్ణి నిర్మించింది. 'ఒక భాష అంతరించి, కనుమరుగైపోవడమంటే, ఆ భాషను మాట్లాడే జాతి అంతా అంతరించినట్లేనని' శాస్త్రవేత్తలన్న మాట వాస్తవం.
మనిషిని మహౌన్నతుణ్ణి చేసిన సాధనం భాష. సామాజిక జీవనంలో శ్రమలోంచి పుట్టిన మాట భాషగా పురుడుపోసుకుంది. ఉత్పత్తి క్రమంలో పుట్టిన భాష, మనిషి సమస్త ఆలోచనలకు ఆచార వ్యవహారాల సాంస్కృతిక వ్యక్తీకరణల వాహికగా మనిషి తనపు ప్రతిబింబమై నిలుస్తుంది. భాషలేకుండా ఆలోచనలు, భావాలు ఉండవు. నేటి ప్రపంచ నాగరికతా నిర్మాణానికి మనిషి యేర్పరుచుకున్న ప్రాథమిక పరికరమే భాష. అందుకే భాష, ఆచరణ, ఆలోచనల ఆయువుపట్టు.
భాష ఒక ప్రవాహం లాంటిది. మన ఆచరణ, పని విస్తరించిన కొలది అది సంపన్నమవుతుంది. ఎదుగుతుంది. తిరిగి మన ఆలోచనలను విస్తృతమొనరిస్తుంది. ఇలా భాషకున్న గొప్ప తనాల గురించి ఎన్నయినా చెప్పుకోవచ్చు. కానీ భాషలకు ఎదురవుతున్న సవాళ్ళు, ఆపదలను చర్చించుకోవాల్సిన సందర్భం నేడు ఎదురవుతున్నది. ఒక భాషకు ఆపద వచ్చిందీ అంటే అది ఆ సమూహానికి వచ్చిన ఆపదే. మనుషులను అణచివేయడం లాంటిదే భాషను అణచివేయటం. ఇది సాంస్కృతికపరమైన దాడి. అందుకే మనం మనుషులుగా నిలబడే పోరాటంలోనే భాష కూడా నిలబడుతుంది. ప్రపంచీకరణ పేరుతో వచ్చిన గ్లోబల్ వ్యాపార మార్కెట్, దేశాలను, సమూహాలను వినియోగదారులుగా మార్చి తమ భాషా వినియోగదారులుగా కూడా చేసింది. ఇప్పుడు మార్కెట్ ఆధిపత్య వర్గాల భాషే అన్ని బృందాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నది. ఇదొక వాస్తవ పరిస్థితి. భాష కేవలం భాషగానే ఉండదు. భావాల రూపంలో, ఒక సంస్కృతిలోకి మనను దింపుతోంది. అది మనది కాని సంస్కృతి. అందుకే మన సంప్రదాయాలను మానవ సంబంధాలనూ ధ్వంసం చేస్తూ ఉన్నది. ఇదొక సమస్య.
ఇక రెండవ సమస్య, స్థానిక మాతృభాషలకు పెద్ద సవాలుగా పరిణమిస్తున్నది, జాతీయవాదం పేరుతో మెజారిటీ ప్రజల ఆధిపత్య విస్తరణ. మతతత్వవాదులు సాంస్కృతిక పరమైన ఆధిపత్యం కోసం ఒక ఏకీకృత భాషను రుద్దే ప్రయత్నమూ పెరిగింది. ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన విధానం. హిందీ భాషను అన్ని ప్రాంతాలలో తప్పనిసరిగా అమలు పరచాలనే ఆలోచన అందులోభాగమే. అందుకనుగుణంగానే ఇంటర్, డిగ్రీ తరగతులలో తెలుగు తప్పనిసరిగా నేర్వాలన్న నిబంధనను మన స్థానిక ప్రభుత్వాలూ తొలగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మొత్తం ప్రాథమిక స్థాయి నుండి ఆంగ్ల మాధ్యమంలో చదువు నేర్పడానికి పూనుకుంది. తెలుగుభాషను ప్రేమించడమంటే ఇతర భాషలను ద్వేషించడం కాదు. అవసరాల రీత్యా అన్ని భాషలను నేర్వవచ్చు.
ఇక మూడో సమస్య మాతృభాషా పండిత ప్రకాండుల నుండి ఎదురయ్యేది. భావితరాలు భాషను సరళంగా, వ్యవహారికంగా, నేర్చుకోవడానికి వీలుగా మార్చుకునే ప్రయత్నాలకు వీరు అడ్డుగా నిలుస్తారు. అంటే సాధారణ ప్రజల నిత్య వ్యవహారిక భాషను, పలుకుబళ్లను, నానుడులను పాఠ్యాంశ బోధనలలోనూ ఉపయోగించినట్టయితే ప్రజల సంస్కృతీ గుర్తింపుతో ఉత్సాహాన్ని పొంది ముందుకుపోగలుగుతారు.
ఆ రకమైన భాషోద్యమాన్ని తెలుగు నేలపైన నడిపిన గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా మన తెలుగుభాషా దినోత్సవాన్ని జరుపుకుని చర్చించుకుంటున్నాము. సంప్రదాయక కుటుంబంలో పుట్టినప్పటికీ ఛాందస పండిత వర్గాలకు వ్యతిరేకంగా వ్యవహారిక భాషోద్యమాన్ని ఆరంభించిన మహౌన్నతుడు, ప్రజాస్వామిక వాది గిడుగు. ప్రవహించే నీరు తేటగా ఉన్నట్లే, భాష కూడా నిత్య వ్యవహారంలోనే సజీవమవుతుందన్న భాషా పరిణామ సూత్రాన్ని గ్రహించి, భావితరాలకు వ్యవహారిక భాషలోనే బోధన ఉండాలని తీవ్రంగా కృషి చేశాడు. గురజాడ అందుకు తోడుగా నిలిస్తే, సంప్రదాయ పండితులు ఆయనను తూలనాడి సామాజిక బహిష్కరణకూ పూనుకున్నారు. అయిననూ పట్టువదలక ఆదివాసీ సవరభాషకు వ్యాకరణాన్ని నిర్మించి, ఆధునిక తెలుగు భాషకు ఊపిరిలూదిన యోధుడు గిడుగు. అందుకే ఆయన స్మరణలో మన తెలుగుభాష గురించి చర్చ చేస్తున్నాము.
బంగ్లా భాషోద్యమంగా ఆరంభమై జాతీయోద్యమంగా మారి ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్న చరిత్ర మన కళ్ళముందున్నది. భాషా గ్రంథాలయోద్యమంగా మొదలైన ఆంధ్రమహాసభ తెలంగాణలో సాయుధ పోరాటంగా పరిణామం చెంది చరిత్రకెక్కింది. కాబట్టి భాష కేవలం మాధ్యమమేకాదు అదొక ప్రజా ఉద్యమం కూడా. తెలుగు తీయనిది, మధురమైనదీ అని వర్ణించి పొగిడితే సరిపోదు. భాషా ప్రాధాన్యాలను గుర్తించి అభివృద్ధికి కృషి చేయాల్సి ఉంది.