Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుష్టత్వాన్ని వివరించేటప్పుడు వ్యక్తుల గురించి, సమూహాల గురించిన మాటలు విషయానికి పరిపూర్ణత్వాన్నివ్వవు. అందుకే, మరీ ముఖ్యంగా 2021 భారతదేశంలో సాగే చర్చలో తాలిబానిజం ప్రమాదమే'వస్తువు'గా ఉంటే సంపూర్ణత్వం, సమగ్రత చేకూరుతుంది. నేడు సోషల్ మీడియా, మరీ ముఖ్యంగా గోడీ మీడియా మన పొరుగింటికి పొరుగున తాలిబాన్ల ''దుష్కార్యాలు, దుర్మార్గాలు'' పాతవాటితో రీమిక్స్సీన్లు ప్రచారంలో పెట్టింది. ఊచకోతలు, రేప్‌లు విచ్చలవిడిగా సాగిపోతున్నాయని, గర్భవతుల గర్భాలు చీరి పిండాలను విసిరేస్తున్నారని ఈ ప్రచారం సాగుతోంది. 2002లో గోద్రానంతర పరిణామాలకు తాము సాగించిన భీభత్స మారణకాండతో దాన్ని సరిపోల్చుతున్నారు. 30ఏండ్ల అనుభవం గల దౌత్యవేత్త ఎమ్.కె. భద్రకుమార్ ఇవన్నీ గాలివార్తలేనని కొట్టేస్తున్నారు. అనుభవం కలిగిన రాజకీయ విశ్లేషకులు తాలిబాన్లు తమ రాజకీయాధికారాన్ని స్థిరపరుచుకున్న తర్వాతే వారి పాలన అసలు రూపం అర్థమౌతుందని చెపుతున్నారు.
తాలిబాన్ల దుర్మార్గాలు ప్రపంచానికి తెలియనివికావు. మాలాలాయూసుఫ్జాయ్ వంటివారిని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. 1996లో, 2001లో వారి రాక్షస పాలనను ఆ దేశ ప్రజలకు రుచి చూపించడమే కాదు, ప్రపంచానికీ తెలియచెప్పింది. నేటి ఆఫ్ఘన్ పరిణామాల వెనుకున్న సామ్రాజ్యవాదాన్ని ప్రజల దృష్టి నుండి తప్పించాలని బీజేపీ నేతల ప్రయత్నం. ఆఫ్ఘనిస్తాన్ అంటే తాలిబాన్ల రాజ్యమేనన్నట్టు సాగే ప్రచారం యెడల అప్రమత్తంగా ఉండాలి. బాలికల విద్య కోసం, మహిళా సమానత్వం కోసం 1921లోనే ఆదేశంలో ప్రయత్నాలు జరిగాయి. 1923, 1964, 1976, 1987ల్లో ఆఫ్ఘన్ రాజ్యాంగంలో మహిళల హక్కులు, ఇతర సాంఘిక సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయి. కూలీన వర్గాల కోసం పైనుండి మహమూద్ టార్జి వంటి రాజులు, కింది నుండి కమ్యూనిస్టుల పోరాటాలు దానికి కారణం.
ఇవి ప్రజల్లో ఆలోచనలు రేగొట్టినాయి. దాంతో మితవాదులు సంఘటితమయ్యారు. కాబూల్ విశ్వవిద్యాలయంలో ఇస్లామిక్ మతంపై బోధించే బుర్హనుద్దీన్ రబ్బానీ నేతృత్వంలో ఏకమయ్యారు. పాకిస్థాన్ సరిహద్దులో పెట్టిన శిక్షణా శిబిరాలకు సౌదీ నుండి పెట్రోడాలర్లు, అమెరికన్ల సైనిక శిక్షణతో 1990ల్లో తాలిబాన్లు రూపొందారు. అంతకు ముందు రద్దు అయిన బహుభార్యత్వాన్ని రబ్బానీ పునరుద్ధరించాడు. బాలికా విద్యను రద్దుచేశాడు. 1993లో ఇస్లామిక్ సుప్రీంకోర్టు ఆడవారు ఇంట్లోంచి బయటికి రాకూడదని చట్టం చేసింది. ''పాఠశాలలన్నీ వేశ్యావాటిక''లన్నది. ఆఫ్ఘన్ సమాజం వెనక్కి నడవడం ప్రారంభమైంది.
మనుధర్మశాస్త్రాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగే పరివార్ నేతలు గాజు కొంపలోనుండి రాళ్ళు విసరలేరు. చాతుర్వర్ణ వ్యవస్థను నెలకొల్పడం వీరిలక్ష్యం. ఏకులంలో పుట్టినా స్త్రీల స్థానం తాలిబాన్లు ఇచ్చినదే. ''నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి'' అని మనుధర్మ శాస్త్రం 9వ అధ్యాయంలో రాసే ఉన్నారు. స్త్రీలు ఆచరించే యజ్ఞాలు అంగీకార యోగ్యం కాదని 4వ అధ్యాయంలో రాశారు. అందుకే 1992లో జరిగిన సాధువుల 'ధర్మ సంసద్' ప్రస్తుత భారత రాజ్యాంగాన్ని ''హిందూ వ్యతిరేకమైంది''గా పేర్కొంది. గొల్వల్కర్ రాసిన 'పాంచజన్యం'లో ముస్లింలు, క్రైస్తవలు, కమ్యూనిస్టులు ప్రధాన శత్రువులుగా ప్రకటించారు కాబట్టి అక్కడికే ఆరెస్సెస్ ఆగదని చెప్పేందుకే పైవాక్యాలు. ప్రస్తుతం ముస్లింలపై దాడి కేంద్రీకృతమై ఉంది.
2015లో గోమాంసం తిన్నాడనే డౌట్ వచ్చి 58ఏండ్ల మొహమ్మద్ అఖ్లాక్ను కొట్టి చంపేశారు. అక్కడినుంచి నిన్న రాజస్థాన్‌లో ఆటో తోలే వాడి వరకు ఆరేండ్లుగా ఈ దాడులు సాగుతూనే ఉన్నాయి. 'జైశ్రీరాం' అననివాళ్ళని గతంలో కొట్టి చంపారు. ఇప్పుడు 'మోడీ జిందాబాద్' అనకపోతే విరగ్గొట్టారు. హిందువులుండే గల్లీలోకి, అదీ 'రక్షాబంధన్' దినం రోజు ముస్లిం గాజులు అమ్ముకునే వ్యక్తి ప్రవేశించాడని విపరీతంగా కొట్టారు. ముస్లిమ్‌లంతా కల్సి సంబంధిత పి.ఎస్. ముందు ఆందోళన చేస్తే కొట్టిన వారిపై కేసు పెట్టారు. కొద్దిసేపట్లోనే ఒకమ్మాయి ఫిర్యాదు చేసిందని చిన్న పిల్లలపై అత్యాచారం చేశాడనే పోక్సో కేసు నమోదు చేశారు. ఇటువంటివి దేశంలో యధేచ్ఛగా సాగిపోతున్నాయి. వీటిని వీడియోతీసి సోషల్‌మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. చేస్తున్న వారి ధైర్యాన్ని ప్రచారం చేసే ఫాసిస్టు చర్యలు ఇవి.
తాలిబాన్ల గురించి విపరీతమైన ప్రచారం చేస్తూ దాన్ని మనదేశంలో ముస్లింలపై దాడులకు సంఘ్ పరివార్ వినియోగించుకుంటోంది. భారతదేశంలో మతం పేరుతోనైనా, కులం పేరుతోనైనా హిందూ తాలిబాన్లు తమ టెంటకిల్స్ మన సమాజంలో విస్తరిస్తూనే ఉన్నారు. మొన్నటిదాక ఉత్తర భారతానికి పరిమితమైన ''కాఫ్ పంచాయత్''లు, కులోన్మాద హత్యలు మన రాష్ట్రానికీ విస్తరించాయి. ఇదంతా తాలిబానిజమే. అందుకే ప్రమాదం తాలిబాన్లది మాత్రమే కాదు. తాలిబానిజానిది.