Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేలు పట్టుకొని నడిపించే నాన్న లేడు.. ఆకలి వేస్తే తినిపించే అమ్మ లేదు.. ఉండడానికి ఇల్లు లేదు.. చదువుకునేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు.. అమ్మానాన్న వైద్యం కోసం చేసిన అప్పులు తప్ప.. కరోనాతో తల్లి, తండ్రి మృతిచెందగా చిన్నారులు అనాథలయ్యారు. భవిష్యత్ అంధకారమైంది. ఇలాంటి హృదయ విదారకమైన ఘటనలు ఈ రెండేండ్ల నుంచి అనేకం. కరోనా జీవితాలను కకావికలం చేసింది. అనాధలుగా మారిన పిల్లల పరిస్థితి చూసి హృదయం ద్రవిస్తున్నదని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. వారి భవిత సుడిగుండంలో ఊగిసలాటగా మారిందని అత్యున్నత న్యాయస్థానమే వ్యాఖానించిదంటే పరిస్థితి తీవ్రత అర్థం అవుతుంది.
కొవిడ్19 మహమ్మారి వల్ల దేశంలో ఇప్పటివరకు బాల స్వరాజ్ పోర్టల్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం పోయినేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది ఆగస్టు 23వరకు కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు 8,161 మంది.. తల్లి లేదా తండ్రిని కోల్పోయి నోళ్లు 92,475 మంది. మొత్తం 396 మంది అపహరణకు గురయ్యారని ఎన్సిపిసిఆర్ పేర్కొన్నది. ఈ అంశంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఒక మధ్యప్రదేశ్లో అపహరణకు గురైన చిన్నారుల సంఖ్య 226 అని నివేదిక వెల్లడించింది. అనాథలుగా మారిన చిన్నారుల వివరాలను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఈ లెక్కల్లోకి రాని బాధిత చిన్నారులు చాలా ఎక్కువ మందే ఉంటారు. ఇదంతా ఒక సమస్య కాగా, మరోవైపు సామాజిక మాధ్యమాల వేదికగా పిల్లల దత్తతకు సంబంధించిన పోస్టులు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. లక్షలలో బేరసారాలు నడుస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వాలు ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా... మానవ అక్రమ రవాణాకు దారితీసే ప్రమాదం పొంచి ఉంది. బాధిత చిన్నారులను భద్రంగా చూసుకోకపోతే, లైంగిక వేధింపులకు గురయ్యే పెనుముప్పు కూడా ఉంది. అసాంఘిక శక్తుల చెరలో పడితే వారి భవిత దుర్భరమవుతుంది. పిల్లల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలపై వివరాలు సమర్పించాలని కేంద్రాన్ని, తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలనూ న్యాయస్థానం ఆదేశించింది. చిన్నారుల వివరాలను ఎప్పటికప్పుడు బాలస్వరాజ్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించింది. వారి బాగోగులు చూసేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేకించి నోడల్ అధికారులను నియమించాలని స్పష్టంచేసింది. పీఎం కేర్స్ నుంచి ప్రతి ఒక్కరికీ రూ.10 లక్షల కార్పస్నిధిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, ఉన్నత విద్య సమయంలో నెలవారీ ఉపకార వేతనాన్ని అందిస్తామని కేంద్రం ప్రకటించింది. 23ఏండ్లు వచ్చిన తరవాత వ్యక్తిగత, కెరీర్ అవసరాల నిమిత్తం ఆ కార్పస్నిధి మొత్తాన్ని ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించారు. ఉన్నత విద్యకు తీసుకునే రుణాలపై వడ్డీ చెల్లిస్తామని, 18ఏండ్లు వచ్చే వరకు ఆయుష్మాన్ భారత్ కింద అయిదు లక్షల రూపాయల మేర ఆరోగ్య బీమా కల్పించి, ప్రభుత్వమే ప్రీమియం చెల్లింస్తుందని కేంద్రం అట్టహసంగా ప్రకటించింది. అయితే ఇవన్నీ భవిష్యత్తులో ఉపయోగపడే సహాయాలే కానీ, తక్షణం ఆదుకునే విధానం ఒక్కటీ లేకపోవడం విచారకం. ముందుగా బాధిత చిన్నారులను నిర్దిష్టంగా గుర్తించడమే కీలకం. వారి సంరక్షణ, ఆలనాపాలనకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇంట్లో ఆర్జించే వ్యక్తిని కోల్పోవడం పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎదుగుదలనూ ప్రభావితం చేసే ముప్పుంది.
ఆ చిన్నారులు చదివే పాఠశాలల యాజమాన్యాలు స్పందించి వారు అదే బడిలో చదువుకునేలా తోడ్పడాలి. ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న పిలల్ల ఫీజుల విషయంలో ఆయా సంస్థలు మినహాయింపు ఇవ్వకుంటే రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈ క్రమంలో కొవిడ్ బాధిత పిల్లల దత్తత ప్రక్రియను తగిన పర్యవేక్షణలతో సరళతరం చేయాలి. అదేసమయంలో అనధికారిక దత్తత కార్యక్రమాలనూ నిలువరించాలి. అన్నింటికన్నా ముఖ్యంగా, అనాథలుగా మారిన చిన్నారులకు రక్షణ కల్పించడం తక్షణావవసరం. ఇందుకోసం తక్షణ సంరక్షణ బాధ్యతలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వాలు ఈ సమస్యపై మానవీయంగా స్పందించి ప్రత్యేక ఏర్పాటుతో చిన్నారుల భవిష్యత్తుకు భద్రత కల్పించాలి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఇలాంటి అనాథ చిన్నారుల భవిష్యత్ గురించి ఆలోచించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. కేవలం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ ఏర్పాటుచేసి కుటుంబసభ్యులు చేరదీయని చిన్నారులను జిల్లాకేంద్రాల్లోని ట్రాన్సిట్ హౌమ్స్కు తరలించి చేతులు దులుపుకొంటున్నారు. ఇప్పటికీ తమిళనాడు, మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ 'పీఎం కేర్స్' కన్నా గొప్పగా తెలంగాణ సంరక్షణ విధానం ఉండాలని ముసాయిదాలు రూపొందించే పనిలో ఉందంట తెలంగాణ సర్కార్. ఈ ట్రాన్సిట్ హౌమ్స్ టోల్ ఫ్రీ నెంబర్లను 250కి పైగా అనాథలు సంప్రదించారని స్త్రీ, శిశుసంక్షేమ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పీఎం కేర్స్ కార్పస్ ఫండ్ అమలు కోసమైనా కేసీఆర్ సర్కారు అనాథ పిల్లల గుర్తింపు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకొని కుటుంబ పెద్ద పాత్ర పోషించాల్సిన సమయమిది. తద్వారా అనాథలైన పిల్లలకు అండగా నిలబడటం, వారికి భరోసా ఇవ్వడం, మానసిక స్థైర్యాన్ని అందించడం ప్రభుత్వాల బాధ్యత. చేయూత మాటల్లో కాదు.. చేతలలో కనబడాలి. వారి భవిత నిలబడాలి.