Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీలంకలో ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వం ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించింది. ఆ దేశానికి అవసరమైన ఆహార పదార్థాలను దిగుమతి చేసుకోవడానికి అక్కడి ప్రయివేటు బ్యాంక్‌లలో విదేశీ మారక ద్రవ్యం కొరత ఏర్పడటంతో సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి సరుకుల అక్రమ నిల్వలు దాచుకుంటున్న వ్యాపారస్తులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి పూనుకున్నది. దీని కంతటికి కారణం కరోనా మహమ్మారి. దానితోనే ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది.
శ్రీలంక ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం, సముద్రమార్గంగా జరిగే సరుకుల రవాణా కీలకం. పర్యాటక రంగం 30లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. జాతీయ ఆదాయంలో 12శాతం దాని ద్వారానే వస్తుంది. అది పూర్తిగా మూతపడటంతో ఆర్థిక వ్యవస్థ ఒక కుదుపునకు లోనైంది. కరోనా కారణంగా పర్యాటకం ఆగిపోయింది. దానితో శ్రీలంకకు విదేశీ మారకద్రవ్యం వచ్చే మార్గం స్తంభించిపోయింది. శ్రీలంక దీవి కావడంతో నలువైపులా సముద్రతీరమే ఉంటుంది. సముద్ర మార్గంలో సరుకుల రవాణా, వాణిజ్యం జరుగుతుంటుంది. కరోనా ప్రభావంతో ఇది బాగా తగ్గిపోయింది. వెరసి శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది.
2020 ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ 3.6శాతం తగ్గింది. దానితో ప్రభుత్వం వాహనాల దిగుమతి, వంటనూనె, చింతపండుతో పాటు ఇతర సరుకుల దిగుమతిని నిషేధించింది. తద్వారా విదేశీ మారకద్రవ్యం మిగుల్చు కుని, మందులు వ్యాక్సిన్లు దిగుమతి చేసుకున్నది.
రెండువారాల క్రితం శ్రీలంక కేంద్రబ్యాంక్ వడ్డీరేట్లు పెంచింది. రుపాయి నిల్వలు పోగుపడతాయని భావించింది. కానీ ఇది ఆశించిన ఫలితం చూపించలేదు. జూలై చివరి నాటికి విదేశీ మారకద్రవ్యం 2.8 బిలియన్ డాలర్లకు పడిపోయింది. 2019 నవంబర్‌లో 7.5 బిలియన్ డాలర్లు ఉండేది. రూపాయి విలువ కూడా డాలర్‌తో పోల్చుకుంటే 20శాతం పడిపోయింది. ఈ పరిణామాలన్ని శ్రీలంక ఆర్థిక వ్యవస్థ ఎంత దిగజారిందో తెలియచేస్తున్నాయి. ఈ పరిస్థితిని మెరుగు పర్చుకునేందుకు అత్యవసరం అయితేనే వాహనాలను నడపాలని ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. తద్వారా పెట్రోల్, డీజిల్ దిగుమతులు తగ్గించి విదేశీ మారకద్రవ్య నిల్వలు పొదుపు చేసుకోవచ్చని ప్రభుత్వం చూస్తున్నది. ప్రజలు వాహనాల వాడకం తగ్గించుకోని పక్షంలో ఇందన సరఫరాపై రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టక తప్పదని ప్రభుత్వం హెచ్చరించింది.
గత పదిరోజుల నుండి కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు 4500 కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దాదాపు ప్రతి రోజు 200 మంది మరణిస్తున్నారు. దేశంలో వ్యాక్సిన్లు తెప్పించుకోవడానికి కూడా విదేశీ మారక ద్రవ్యం పొదుపు చేసుకుంటేనే సాధ్యం అయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఆహార కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం అక్రమ నిల్వలను అరికట్టేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించింది. ఆయన మాజీ సైనికాధికారి. ఆయనకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టింది. ఆయన క్రింద కొంత సిబ్బందిని ఇచ్చి వారికి కూడా ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. వారికి స్థానికంగా ప్రజలకు అవసరమైన ఆహార పదార్థాలను కొనుగోలు చేసి ప్రజలకు అందించే బాధ్యతను ఇచ్చింది. శ్రీలంకలో ఆహార భద్రతకు ఇబ్బందులు ఏర్పడటానికి ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు కూడా ఒక కారణంగా ఉన్నాయి. ''వ్యవసాయంపై ఒప్పందం''లో భాగంగా వాణిజ్య పంటలకు ప్రాధాన్యత పెరిగి స్వదేశంలో అవసరాలకు అనుగుణంగా ఆహార పంటలు పండించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ అవసరాలకు వాణిజ్య పంటలు పండించడమే ప్రాధాన్యతగా ముందుకు వచ్చి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవాల్సి రావడంతో మారక ద్రవ్యం కొరత ఏర్పడి విపరీతంగా ధరలు పెరిగిపోతున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు సడలించి, ప్రజాతంత్రీకరణ జరిగితేనే శ్రీలంక లాంటి దేశాలు బతికి బట్టకట్టగలుగుతాయి. దేశం నుండి ఎగుమతి చేసే టీ, రబ్బర్, రెడీమేడ్ దుస్తుల ద్వారా వచ్చే విదేశీ మారకద్రవ్యం దిగుమతులకు చెల్లించేందుకు సరిపోవడం లేదు. ఆలుగడ్డలు, ఉల్లిపాయలు, బియ్యం ధరలు అమాంతం పెరిగిపోయాయి. వంట గ్యాస్, పాలపొడికి పెద్ద ఎత్తున కొరత ఏర్పడింది.
శ్రీలంక లాంటి చిన్న దేశాలు కరోనా మహమ్మారి వలన సార్వత్రిక సంక్షోభం దశకు నెట్టబడ్డాయి. లాక్డౌన్ నిబంధనల వలన ఆర్థిక వ్యవస్థ పతనం అయింది. ఈ పరిస్థితులను తట్టుకోవడానికి కొత్త ఆంక్షలను దేశంలో పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ సమయంలో అంతర్జాతీయ సమాజం స్పందించి సహకారం అందిస్తే చిన్న దేశాలు తట్టుకుని నిలబడతాయి. భారతదేశంలో అపారమైన ఆహార ధాన్యాల నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. అయితే భారత ప్రభుత్వం ప్రస్తుతానికి తన దగ్గర ఉన్న నిల్వలను ఎతినాల్ తయారీకి అంతర్జాతీయ ధరల కంటే తక్కువకే ఇస్తున్నది. వాటిని కొంతమేర శ్రీలంకకు ఇస్తే లక్షలాది మంది ప్రాణాలను కాపాడవచ్చు. అమెరికా కూడా అఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో యుద్ధాల కోసం లక్షల కోట్లు వృధా చేసేబదులు ఇలాంటి దేశాలను ఆదుకోవచ్చు. భారత్ అమెరికాలే కాదు, ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీలంకకు సహాయమందించడం మొత్తం అంతర్జాతీయ సమాజం కనీస బాధ్యత.