Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పటివరకూ చరిత్రలో చాలా అబద్దాలు చూశాం. కానీ ఇప్పుడు అబద్దాలే చరిత్రగా మారడం చూస్తున్నాం. మహౌన్నతమైన ఈ దేశ స్వాతంత్య్రపోరాటంతోగానీ, తదనంతర దేశ నిర్మాణంతోగానీ ఏ సంబంధమూ లేని ఓ సమూహం, నేడు పాలనా పగ్గాలు చేపట్టిన ఫలితమిది. ప్రస్తుతమీ దుష్ఫలితానికి ప్రతీకలు ఒకటి ''జలియన్‌వాలా బాగ్'' చారిత్రక స్ఫూర్తిని చెరిపేయడం కాగా, రెండు ''జవహర్లాల్ నెహ్రూ'' జ్ఞాపకాల జాడలను తుడిచేయబూనడం. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో శతాబ్దానికి పైబడిన చరిత్రగల మహౌజ్వల స్మారకస్థలి జలియన్‌వాలాబాగ్. పేరు వినినంతనే రోమాలు నిక్కబొడవగా, త్యాగాల రక్తరాగాలు వినపడే ఆ చోటును ఫక్తు వినోద పర్యాటక స్థలంగా మార్చివేశారు. స్వతంత్ర భారతానికి తొలి ప్రధానిగా పదిహేడేండ్లు దేశ నిర్మాణానికి కృషి చేసిన జవహర్లాల్ నెహ్రూను చరిత్ర పుటల్లోంచి చెరిపేయజూస్తున్నారు. ఇది జాతి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం నెత్తుటి ఏరులైపారిన అమూల్యమైన బలిదానాలను అవమానించడమే. ఒక జాతినేత స్ఫూర్తిదాయకమైన నేతృత్వాన్ని అవహేళన చేయడమే.
నేటికి నూటారెండేండ్ల క్రితం, నాటి బ్రిటిషు ప్రభుత్వ క్రూర అణచివేత సాధనంగా ముందుకొచ్చిన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా, వేలాది మంది ఉద్యమకారులు జలియన్‌వాలాబాగ్‌లో సమావేశమైన సందర్భమది. ఇది సహించలేని జనరల్ డయ్యర్ సారథ్యంలోని బ్రిటిష్ సైన్యం... దారులన్నీ మూసివేసి, నిరాయుధలైన ఉద్యమకారులపై విచక్షణారహితమైన కాల్పులు జరిపింది. ఒకవైపు తుపాకులు గుండ్ల వర్షం కురిపిస్తుంటే గుండెలు ఎదురొడ్డుతూనే, మరోవైపు తప్పించుకునే మార్గంలేక పక్కన ఉన్న బావిలోకి దూకి వేలమంది అమరులైన రణక్షేత్రమది. భారత స్వాతంత్రోద్యమాన్ని పెనుమార్పులకు గురిచేసిన ఈ చారిత్రక విషాదస్థలి, నాటి జాతీయనేతల చేతుల్లో అమరుల స్మారక చిహ్నంగా రూపుదాల్చి, నేటికీ జాతికి స్ఫూర్తినిస్తూనే ఉంది.
ఇప్పుడు నవీనీకరణ పేరుతో ఆ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ దానినొక పర్యాటక కేంద్రంగా మలిచారు. నాటి చరిత్రకు ఆనవాళ్లయిన ఇరుకుదారిని సమూలంగా నిర్మూలించి, అందమైన కుడ్యశిల్పాలు నిర్మించారు. ఆధునిక త్రీడీ ప్రొజెక్షన్లు, లేజర్ అండ్ సౌండ్ షోలకు నిలయంగా మార్చారు. ''చరిత్రను కాపాడుకోవడం మా సర్కారు బాధ్యత'' అంటూ తీయని మాటలు చెబుతూనే చరిత్రను ధ్వంసం చేసిన సర్కారు తీరిది. ఆ చరిత్రలో తమ భాగస్వామ్యం లేనంత మాత్రాన, ఆ చారిత్రక వారసత్వం తమకు రానంత మాత్రాన చరిత్ర చరిత్ర కాకుండా పోతుందా..? త్యాగాల విలువ తెలిసినవారు ఈ పనిచేయగలరా? చరిత్ర పట్ల గౌరవం ఉన్నవారు ఇంతకు తెగించగలరా?
పంజాబ్‌లోని ఈ చారిత్రక పోరాట స్థలిని సుందర విహారస్థలిగా మార్చి, ప్రధాని ప్రారంభోత్సవం చేస్తున్న సమయంలోనే... పక్కనే ఉన్న హర్యానాలో ప్రభుత్వం రైతుల నెత్తురు కండ్లజూడటం గమనార్హం. నాటి రౌలత్ చట్టాన్ని వ్యతిరేకించిన జలియన్‌వాలాబాగ్ అమరులదీ, నేటి కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న అన్నదాతలదీ ఇరువురిదీ ఒకటే మార్గం. అది శాంతియుత మార్గం. న్యాయపోరాటం. కానీ నాడు స్వాతంత్య్ర ప్రియులను కాల్చిచంపిన బ్రిటిష్ ప్రభువులదీ, నేడు రైతుల రక్తాన్ని కండ్లజూసిన నయా భారత ప్రభువులదీ ఏ మార్గం? వీరు ఏ చరిత్రకు ప్రతినిధులో, ఎవరికి వారసులో అర్థం చేసుకోవడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది? ఇలాంటి వారు ప్రజల పోరాట చరిత్రను కాలరాయడంలో ఆశ్చర్యం ఏముంటుంది?
ఇక, ఇలా చరిత్రకు మసిపూయడంలో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ''అజాదీకా అమృత మహౌత్సవాలు'' మరో విషాదం. ఈ సందర్భంగా ''ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్'' విడుదల చేసిన పోస్టర్లో ఏకంగా తొలి ప్రధాని నెహ్రూ ఫొటోనే తొలగించేసారు. రాజకీయంగా ఎవరి అభిప్రాయాలు ఎమైనా కావొచ్చు. కానీ అంతమాత్రాన ఈ దేశ నిర్మాణంలో ఎవరి పాత్రనూ విస్మరించలేము కదా! ఎవరు అవునన్నా కాదన్నా నెహ్రూ మన జాతీయోద్యమ ప్రముఖుడు. ఆయన ఆ పోరాటంలో తొమ్మిదేండ్లు జైలు జీవితం అనుభవించాడు. దేశానికి తొలి ప్రధానిగా పదిహేడేండ్లు సేవలందించాడు. దేశ సమైక్యతకూ స్వావలంబనకూ విశేష కృషి చేసాడు. భిన్న జాతులు, భిన్న కులాలు, విభిన్నమైన మతాలు, సంస్కృతులతో కూడిన ఈ దేశాన్ని ఆధునిక లౌకిక గణతంత్ర రాజ్యంగా తీర్చిదిద్దడంలో కీలకమైన పాత్ర నిర్వహించాడు. అన్నిటికీ మించి పాకిస్థాన్‌లా భారత్ మతరాజ్యంగా మారకుండా నిరోధించాడు. అలాంటి నేతను విస్మరించడమేగాక, ఆస్థానంలో స్వాతంత్రోద్యమానికి ద్రోహం చేసి, బ్రిటిష్ వారి క్షమాభిక్ష కోసం దేబిరించిన సావర్కర్ ఫొటోను ప్రదర్శించడాన్ని ఏమనాలి?
అయినా కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు చరిత్రపై దాడికి తెగబడటం దేశం చూస్తూనే ఉంది. ప్రత్యేకించి జాతీయోద్యమంలో కీలకనేతలైన గాంధీ, నెహ్రూల ప్రాశస్త్యాన్ని క్రమేణా తగ్గించే కుతంత్రాలకు పాల్పడటం, మరో నిఖార్సయిన లౌకికవాదీ, స్వాతంత్రోద్యమ దిగ్గజమూ అయిన సర్థార్ వల్లభాయ్ పటేల్‌కు లేని సంఘ్‌పరివార్ లక్షణాలను ఆపాదించడం, తద్వారా తమకు లేని స్వాతంత్రోద్యమ వారసత్వానికై పాకులాడటం ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కాలం ప్రగతిశీలురకు ప్రతికూలం కావొచ్చు. విభజన, విద్వేష రాజకీయాలు కోరలు చాచి ప్రజా ఉద్యమాల చరిత్రను మింగేయాలని బుసలు కొడుతూ ఉండొచ్చు. కానీ అంతిమంగా చరిత్ర సత్యం ప్రకటిస్తూనే ఉంటుంది. ప్రజలకు మార్గదర్శనం చేస్తూనే ఉంటుంది.