Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంతకాదనుకున్నా పొగడ్తకు లొంగని మనిషుంటాడా? ఉండడు. 'నువ్వు గొప్పవాడివి, మంచివాడివయ్యా' అని అంటే, ఎక్కడో లోపట సంచరిస్తున్న ఆత్మారాముడు ఆనందపరవశుడయి ఒక్కింత కాలరు ఎగరేయకుండా వుంటాడా! ససేమిరా ఉండనే ఉండడు. పొగడ్త అంటే మరీ పొగడటమే కాదు, వాస్తవికమైన మంచితనాన్ని, మంచి విషయాన్ని ప్రశంసించటం, అభినందించటం అవసరమేనంటాను. అది మరింత మంచితనాన్ని నిబద్ధంగా కొనసాగించేందుకూ దోహదం చేస్తుంది కదా! కానీ అతిశయోక్తులు, అనవసర ఆడంబర పొగడ్తల పట్ల జాగ్రత్త వహించాల్సిందే. అందుకే చలం 'నువ్వు గొప్పోడివోరు' అని నీ భుజం మీద చెయ్యేసి పొగుడ్తున్న వాడిపట్ల చాలా జాగ్రత్తగా ఉండాలంటాడు
అయితే ఈ పొగడ్తలు, అభినందనలు, ప్రశంసలు, సన్మానాలు కోరుకుని మరి పొగిడించుకునే సంఘటనలనూ మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా కవుల, రచయితల సభలలో ఎక్కువగానే కనపడుతుంటాయి. ధనాన్ని వెచ్చించి మరీ సన్మానాణ్నృ పొగడ్తనూ పొందుతుంటారు. అలాగే రాజకీయరంగంలోనూ ఈ అతిశయాలు ఎక్కువే. పదవులు, అభ్యర్థిత్వాలు, పోటీల్లో నిలబడటం మొదలైన అవసరాలరీత్యా నాయకుల, అధిపతుల ముందు తమ ఘనమైన కీర్తిని ప్రదర్శించడం సర్వత్రా జరుగుతున్నదే. మన దేవుళ్ళను పొగిడినంతంగా ప్రపంచాన ఎక్కడా ఉండదు. ఆ విధంగానే నాయకుల పొగడ్తా అలవాటయింది. ఎంతయితే పొగడ్తలుంటాయో తెగడ్తలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి రాజకీయాల్లో. దక్షిణాది ప్రాంతాల్లో ప్రేమయినా, కోపమయినా, అభిమాన మయినా, ద్వేషమయినా ఒకింత ఎక్కువగా వ్యక్తమవుతుందని ఒక అభిప్రాయం ఉంది. అవును వ్యక్తులు, నాయకుల పూజలు, అనుసరించడం, వీరాభి మానాలు కనపడతాయి. తమిళనేలలో మరీ ఎక్కువగా చూస్తాము. అక్కడ సినిమా నటి కుష్బూకు గుడినే కట్టారు. ఎం.జి.రాంచంద్రన్, జయలలితలను ఆరాధించడాన్ని, సాష్టాంగ ప్రణామాల్ని కళ్ళారా చూశాం. కరుణానిధి, ఎన్టీ రామారావు పట్ల వీరాభిమానాల్ని కన్నాం. వాటన్నింటినీ సంపూర్ణంగా ఆస్వాదిస్తూనే వాళ్ళంతా ముందుకుపోయారు. ఇవన్నీ ఫ్యూడల్ వ్యవస్త భావజాల ప్రభావాలు...
దేశంలోనైతే 'ఇండియానే ఇందిర, ఇందిరనే ఇండియా' అని ఇందిరాగాంధిని బారువా పొగిడితే అందరూ చప్పట్లు కొట్టి సంతోషపడటమూ స్వయంగా ఇందిర ముసిముసిగా నవ్వుకోవడమూ మనకు తెలుసు. పొగడ్తల ఉచ్ఛస్థితికి ఇవి కొన్ని ఉదాహరణలు. సాధారణ రాజకీయాలు అటుంచితే కమ్యూనిస్టు రాజకీయాల్లో ఉన్న సుందరయ్య, జ్యోతిబసు మొదలైన నిబద్ధ ప్రజానాయకుల త్యాగాలను, నిర్విరామ సేవనూ అభిమానించే లక్షలాది జనం నేటికీ ఉన్నారు. కానీ ఎప్పుడూ అతిశయోక్తులకూ, అనవసర పొగడ్తలకు వారు అవకాశమివ్వలేదు. దేశంలోనే అత్యున్నత నిరాడంబర జీవితాలను వాళ్ళు గడిపారు. ఆ ఉద్యమాలు అందించే ప్రేరణలు చైతన్యాలు అలాంటివి.
అయితే ఈ మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, తన పార్టీ సహచరులకు, మంత్రులకు, శాసనసభ్యులకు ఒక హెచ్చరిక చేస్తూ, తనను ఎవరూ పొగడవద్దని, ప్రశంసించవద్దని తెలిపారు. ఒకవేళ అలా చేస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటానని కూడా సెలవిచ్చారు. అతిగా స్పందించడం, ప్రవర్తించడం ఉండే వాతావరణంలో ఇలాంటివి స్వాగతించాల్సిన విషయాలే. అంతేకాక విద్యార్థులకు పంచాల్సిన బ్యాగులపై జయలలిత, పళనిస్వామి ఫొటోలున్నప్పటికీ వాటిని మార్చడం వల్ల కోట్ల రూపాయలు వృధా అవుతాయని, బొమ్మలు మన పనులను ప్రభావితం చేయలేవని పంపకాలు చేయండని చెప్పడంలోనూ తన ఆదర్శాన్ని ప్రకటించుకుని వార్తల్లోకి వచ్చారు. అలాగే కేరళ ప్రభుత్వం అక్కడి ఆలయాల్లో దళితులను అర్చకులుగా నియమించుతున్న ఆదర్శాన్ని తమిళనాడులో కూడా చేస్తామని ప్రకటించారు. మోడీ తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ ప్రథమంగా తీర్మానం చేసినట్టుగానే, తమిళనాడులోనూ చేశారు. పినరయి విజయన్ చేపడుతున్న ప్రజానుకూల విధానాలను కొన్నింటిని స్టాలిన్ అనుకరిస్తూ జనాదరణను పొందుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు వాళ్ళకు అప్పజెప్పటం దేశ సంక్షేమానికి గొడ్డలిపెట్టనీ వ్యతిరేకించారు. మరి ఇంతవరకూ తెలుగు రాష్ట్రాల వాళ్ళు నోరే విప్పలేదు. ఇక కేరళలో అయితే పాలక్కడ్జిల్లాలోని మాధుర్ గ్రామ పంచాయతీలో ప్రజలు ఏ అవసరానికి కార్యాలయానికి వచ్చినా అర్జీరాసినా 'సర్', 'మేడమ్' అనే బ్రిటిష్ వలస పాలనా భాషను ఉపయోగించరాదని, వారు నిర్వహిస్తున్న పదవుల పేర్లనీ, వ్యక్తుల సొంతపేర్లతోని సంబోధించాలని నిర్ణయించి అమలు చేయటం అందరి మన్ననలూ పొందుతోంది. ఇవన్నీ ఆచరణలో రూపానికి సంబంధించినవే కావచ్చు. కానీ ఆహ్వానించాల్సినవే. సారం, ఫలితాలు అన్నిటినీ భవిష్యత్తు ఎలాగూ స్పష్టపరుస్తుంది, తేలుస్తుంది.
కాబట్టి పొగడ్తలకు, అతిశయోక్తులకు అలవాటు పడిన మన భూస్వామిక భావజాల సంప్రదాయాలను ఒక్కొక్కటీ వదిలించుకోవటం అత్యంత అవసరమైనదే. అయితే అదొక్కటే గొప్ప ఫలితాలను తెచ్చి పెడుతుందని కాదు. అదే రకమైన ఆదర్శనీయ ఆచరణనూ, నిరాడంబరమైన నిబద్ధతనూ, ప్రజా ప్రయోజనాల్ని లక్ష్యంగా చేసుకుని ముందుకుపోతేనే ప్రగతి.