Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''టోక్యో పారాలింపిక్స్‌లో 15 పతకాలు సాధిస్తాం''.. ఇది క్రీడల ఆరంభానికి ముందు మన పారా అథ్లెట్లు బృంద సభ్యుల ధీమా! దానిని కూడా హేళన చేసిన మాటలు చాలా విన్నాం. 'ఇలా చాలా చెప్తారు.. కానీ తీరా పోటీల్లో మాత్రం పతకాలు రావు', 'ఒలింపిక్స్‌లోనే సాధారణ అథ్లెట్లు అంచనాలను అందుకోలేకపోయారు.. ఇక పారా అథ్లెట్లు ఏం సాధిస్తారు?' అడుగడుగునా ఎన్నో అనుమానాలు, అవమానాలు, మరెన్నో ప్రశ్నలు.. 'అరవై ఏండ్ల పారాలింపిక్స్ చరిత్రలో మన దేశం సాధించింది పన్నెండు పతకాలే.. ఇక ఇప్పుడు ఒక్క టోక్యోలోనే 15 పతకాలా? ఆశకు హద్దుండాలనే' మాటలు విని .. 'ఒంటికె వైకల్యము మనస్సుకంటనీకు' అని బలంగా నమ్మిన మన పారా అథ్లెట్లు చక్రాల కుర్చీలతో.. కృత్రిమ కాళ్లతో.. పనిచేయని చేతులతో.. పారాలింపిక్స్‌లో వైకల్యాన్ని దాటి.. సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఆ అనుమానాలను పటాపంచలు చేశారు. ఆత్మవిశ్వాసం అండగా.. పోరాటమే శ్వాసగా .. ఆట మీదే ధ్యాసతో.. అద్భుత ప్రదర్శనతో దేశానికి పతక వెలుగులు పంచారు.
'అవిటితనం కన్న ఆత్మవిశ్వాసం మిన్నా / అదికాస్త లేకున్నా అంగములున్నా సున్నా' అన్న కవి వాక్కులను నిజం చేస్తూ మన పారా అథ్లెట్లు ఆత్మవిశ్వాసం, పట్టుదలతో విశ్వక్రీడా యవనికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. వాళ్ల క్రీడా ప్రతిభ ముందు వైకల్యం తలవంచింది. వారు ఇప్పుడు దేశానికే ఓ స్ఫూర్తి.. ఓ ఆదర్శం. అన్ని అవయవాలు సక్రమంగా ఉండి.. అన్ని వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ.. తామేమీ సాధించలేమనే నిరాశలో కుంగిపోతూ చాలా మంది తమ జీవితాలను మధ్యలోనే ముగిస్తారు. కానీ, వీళ్లది కష్టాల కడలిలాంటి జీవితం.. ఆ జీవన ప్రయాణంలో అడుగడుగునా అడ్డంకులే అయినా, వెన్నుచూపలేదు. భయపడి చీకటిలోనే ఉండిపోలేదు. అన్నింటిని అధిగమించి ఆటల్లో సత్తాచాటి దేశ ఖ్యాతిని చాటారు. అరవైఏండ్ల చరిత్రలో పన్నెండు పతాకా లను సాధిస్తే.. టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాలను సాధించి మరో చరిత్రకు నాంది పలికారు.
టేబుల్ టెన్నిస్‌లో భవీనాబెన్ పటేల్ రజతంతో మొదలైన పతకాల వేట.. షూటింగ్లో అవని లెఖరా ప్రపంచ రికార్డును సమం చేస్తూ పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచారు. జావెలిన్‌త్రో, బ్యాడ్మింటన్, షూటింగ్లలో సుమిత్ అంటిల్, ప్రమోద్ భగత్, కృష్ణ నాగర్, మనీష్ నర్వాల్ బంగారు వన్నెలు అద్దారు. షూటింగ్ రేంజిలో తమ గురికి తిరుగు లేదని చాటుతూ అవని, సింగ్రాజ్లు చెరో రెండు పతకాలతో నూతన అధ్యాయనాన్ని లిఖించారు. పారాలింపిక్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన బ్యాడ్మింటన్‌లో విశేషంగా రాణించి దేశానికి స్వర్ణ, రజితాలను అందించారు. అయిదేండ్ల్ల క్రితం రియో పోటీలతో పోలిస్తే పతకాల పట్టికలో 24వ స్థానానికి దూసుకువచ్చింది. చిన్నతనంలోనే పోలియో కోరల్లో చిక్కినా, ఎదిగిన వయసులో తీవ్ర ప్రమాదాలకు గురై వైకల్యం పాలైనా చెక్కుచెదరని ఆత్మస్థైర్యంతో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన విజేతల అపూర్వగాథలన్నీ భావితరాలకు అద్వితీయ పాఠాలు.
దేశీయంగా వికలాంగులకు అసలు అవకాశాలు ఎంత మేరకు లభిస్తున్నాయన్నదే అసలు ప్రశ్న! పాలకులను ఈ ప్రశ్న వేయాల్సిన అనేక గొంతులు.. వికలాంగులను కించపరిచే ప్రశ్నలను సంధించాయి. వాస్తవాలు గమనిస్తే.. దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది ఉంటే.. కేవలం 34 లక్షల మంది మాత్రమే ఉపాధి అవకాశాలు పొందుతున్నట్టు ఇటీవల ఓ అధ్యయనం వెలుగులోకి తీసుకువచ్చింది. 'వికలాంగుల కోసం అమలు చేస్తున్న పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయి. తనిఖీ చేస్తే భయంకర వాస్తవాలు నిగ్గుతేలతాయి' అని తెలంగాణ హైకోర్టు గతేడాదే వ్యాఖ్యానించిందంటే పరిస్థితి సంక్లిష్టత అర్థమవుతుంది. సంఘటిత, అసంఘటిత రంగాల్లో వారికి ప్రోత్సాహం అంతంతమాత్రమే, స్వయంఉపాధికి ప్రభుత్వ పథకాలుసైతం వారికి అక్కరకు రావడం లేదన్నది వాస్తవం.
రాజ్యాంగం వికలాంగులకు అనేక హక్కులు కల్పించింది. కానీ క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడంలేదు. ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ తదితర దేశాలు సరికొత్త విధానాలతో వారికి ఆలంభనగా నిలుస్తుంటే.. మాట్లాడితే ఆయా దేశాలతో పొల్చుకుంటూ దేశ, రాష్ట్రాల రూపురేఖలే మార్చేస్తాం అని చెప్పుకునే మన నేతలకు.. దుర్భర స్థితిలో ఉన్న వికలాంగుల హక్కులు హరించబడ్డ విషయాలు కనబడవు. విద్య, ఉపాధుల్లో వారికి అవరోధంగా ఉన్న వ్యవస్థలకు చరమగీతం పాడాలి. వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో ఎదిగేందుకు చేయూతనందించాలి. పారాలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మక క్రీడల్లో పోటీపడటానికి అవరోధాలుగా ఉన్న మౌలిక సదుపాయాలు, నిధులు కొరతను అధిగమించే ఏర్పాట్టు చేసి అంకితభావాన్ని ప్రకటించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా అంతర్జాతీయ యవనికపై భారతీయ క్రీడా స్ఫూర్తిని చాటే దిశగా అడుగులేస్తాయని ఆశిద్దాం.