Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నికల్లో గెలవడానికి పాదయాత్రలు చేసేవారున్నారు. ప్రస్తుతం చేస్తున్నారు కూడ. తమ పార్టీలోని ముఠాల అడ్డంకులను పక్కకి నెట్టేసుకుంటూ గెలుపు తీరాలకు నావ నడపడానికి పాదయాత్రలు చేసేవారిని గతంలో చూశాం. 2021లో చూస్తున్నాం. వాటికి అధికారమే పరమావధి. నేటి నుంచి సిటు నేతలు ఏడు జిల్లాల్లోని సుమారు 42 పారిశ్రామిక క్లస్టర్లలో 23రోజుల పాటు చేసే పాదయాత్ర పెట్టుబడిపై 'గర్జన'. కేంద్ర ప్రభుత్వ విధానాలను, ముఖ్యంగా కార్మికుల్ని సుమారు నూటాయాభై ఏండ్ల నాటి స్థితికి తీసుకెళ్ళే 'కోడ్'ల కబంధహస్తాల్లోకి నెట్టే విధానాలను వివరించి, రగిలించడానికే ఈ పాదయాత్ర.
ఎటొచ్చి ఎటు పోయినా ప్రస్తుత 2వ విడత పదవీకాలం ముగిసేలోపే తమ మిత్రులకు ఒట్టేసి చెప్పినవన్నీ ఆసాంతం ముగించాలనే తొందర్లో మోడీ సర్కార్ ఉంది. దేశ, విదేశీ కార్పొరేట్ల కోసం గత ఏడేండ్లుగా సాగే మహాయజ్ఞంలో ఇది అడుగడుగునా కనిపిస్తోంది. ''ప్రభుత్వరంగం పుట్టిందే చావడానికి. కొన్ని ముందే చస్తారు. కొన్ని కాలక్రమంలో చస్తాయ''ని సింహాసనాధీశుడవంగానే ఎటువంటి శషభిషలకూ తావివ్వకుండా చెప్పాడు దేశ ప్రధాని. వాటిని పేరు పేరునా 'స్వాహా' అని అగ్నికి ఆహుతి చేస్తోందీ ప్రభుత్వం. ఇది ఆ రంగ కార్మికుల సమస్యగానే ఉండకూడదు. ఆ ప్రక్రియకు పెట్టిన ముద్దుపేరు ''కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన''. గరిష్టపాలన అఘోరించిన తీరు కరోనా దెబ్బ దేశానికి చూపింది. ఆకలి తీరని కార్పొరేట్ల దావానలం ఎగిసిపడుతూనే ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా కంపెనీలు 'స్వాహా' అంటూ ఆ మంటలకు ఆహుతి చేస్తోంది మోడీ సర్కార్. ఇదీ ఆ రెండు రంగాల ఉద్యోగుల గోసగానే మిగల కూడదు. చివరకు దేశ రక్షణరంగాన్ని దేశీయ అనుంగు మిత్రులకే గాక వారి విదేశీ బాస్‌లకు కట్టబెట్టే చర్యలు ముమ్మరంగా మోడీ సర్కార్ సాగిస్తోంది. దేశంలోని ఆరేడు శాతం కార్మికులకు మాత్రమే వర్తించే కార్మిక చట్టాలను చుట్టిపడేశారు. గత 30ఏండ్లుగా, ఆ మాటకొస్తే 1978లో నాటి జనతా నుండి 1998 నాటి భారతీయ జనతా వరకు ఏ ప్రభుత్వమూ, ఏ ప్రధానీ చేయలేని పని తాను చేయగలిగినందుకు 56 అంగుళాల ఛాతి ఇంకా ఉప్పొంగింది. అన్ని పార్లమెంటరీ సాంప్రదాయాలను కాలరాస్తూ ఉమ్మడి జాబితాలోని కార్మిక చట్టాలను, రాష్ట్రాల జాబితాలోని వ్యవసాయాన్ని ప్రతిపక్షాన్ని మెడపట్టి బయటికి నెట్టేసి మరీ చట్టాలు చేసుకుంది. మోడీ సర్కార్ బరితెగింపునకు ఇది పరాకాష్ట.
రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్ల కార్మికులు కూడా మనుషులేనన్న స్పృహ కేసీఆర్ సర్కార్కుందా అనే సందేహం రావడం సహజం. వివిధ పరిశ్రమల్లో పనిచేసే సుమారు పదిలక్షల మంది కార్మికులు, ఇతర రంగాల్లోని సుమారు కోటి మంది కార్మికులకు 10-15 సంవత్సరాలుగా వేతనాలు పెరగలేదు. రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ అవసరాల రీత్యా జీహెచ్ఎంసీ కార్మికుల వంటివారికి పెరిగినా అది మినహాయింపు మాత్రమే. కనీస వేతనాల సలహా మండలి సిఫార్సులు బుట్టదాఖలవుతున్నాయి. ప్రభుత్వ బొక్కసం నుండి పైసా ఖర్చయ్యే అవకాశం, అవసరంలేని ఇన్ని లక్షల మంది కార్మికులకు కనీస వేతనాల జీఓలు సవరించాలనే ఇంగితజ్ఞానంలేని ప్రభుత్వం శాసనసభ్యుల, శాసనమండలి సభ్యుల వేతనాలు రూ.1.5లక్షల నుండి రూ.2.5లక్షలకు పెంచుకుంది. కనీస వేతనాలను అమలు చేయాల్సిన కార్మికశాఖ నిద్రలో జోగుతోంది. లేదా నిద్ర నటిస్తోంది. వచ్చిన ఐదు జీఓలను కూడా యాజమాన్యాలు అడ్డుకుంటున్నాయి. చంద్రబాబు కాలం నాటి తనిఖీల రద్దు నిర్ణయం కేసీఆర్‌కు మహారుచికరంగా ఉంది. రాష్ట్రంలోని అనేక పరిశ్రమల్లో మన రాజ్యాంగమిచ్చిన ప్రాథమిక హక్కయిన సంఘం పెట్టుకునే హక్కునే దాదాపు గత ముప్పయ్యేండ్లుగా అనుమతించడం లేదు. ఇంకా ఆటవిక పాలనే సాగుతోంది. నిన్న ఎన్సీఆర్ ప్రాంతంలోని డైకిన్ అయినా, మన రాష్ట్రంలోని ఓసీటీఎల్ అయినా, మొన్న హర్యానాలోని హౌండా ఫ్యాక్టరీ అయినా మన రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక వాడలైనా అంతటా ఫ్యాక్టరీ యజమానుల రాజ్యాంగేతర పాలనే నిర్విఘ్నంగా సాగుతోంది.
అనేక జిల్లాల్లోని పారిశ్రామిక వాడల్లోని పరిస్థితి, కార్మికులపై సాగుతున్న దోపిడీ చూస్తే 1845లో ఎంగెల్స్ రాసిన ''ఇంగ్లండులో కార్మికుల స్థితిగతులు'' జ్ఞాపకం రాకమానదు. దాదాపు రెండు శతాబ్దాల ప్రయాణ చక్రాన్ని వెనక్కి తిప్పేందుకు ప్రపంచ పెట్టుబడి తిప్పలు పడుతోంది. అందులో భాగమే మోడీ సర్కార్ కృషి. ఫ్రాన్స్‌లో, గ్రీస్‌లో పెద్దఎత్తున పోరాడి పాలకుల దూకుడుకు కళ్ళెం వేయగలిగారు. అనేక లాటిన్ అమెరికన్ దేశాల్లో సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలను వ్యతిరేకించే పాలకులకే పట్టం కడుతున్నారు ఆ దేశ ప్రజలు. ''యజమానులకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలను రాజ్యానికి వ్యతిరేకంగా, ప్రధాన స్రవంతి మీడియాకు వ్యతిరేకంగా, పోలీసు వ్యవస్థకు, జైళ్ళ పద్ధతికి వ్యతిరేకంగా, పెరుగుతున్న ఫాసిస్టు పద్ధతికి వ్యతిరేకంగా, పర్యావరణ విధ్వంసకులకు వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాలతో అనుసంధానం చేసినప్పుడే కార్మికోద్యమం ముందుకు పోగలదు'' అని ''కార్మికవర్గం ఈ ప్రపంచాన్ని మార్చగలదా?'' అనే గ్రంథంలో మైఖేల్ యేట్స్ రాసింది యాత్ర గమనంలో ఉంది.
అందుకే ఈ పద యాత్ర ప్రభువులను ప్రశ్నిస్తోంది. ప్రభుత్వాలకు తాఖీదులిస్తోంది. కార్మికుల్లో చైతన్య బీజాలు నాటుతోంది. మరో రాష్ట్ర స్థాయి పోరాటానికి దారులు పరుస్తోంది. ఎర్రని జెండాలను కార్మికుల గుండెల నిండా నింపుతోంది.