Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా నేపథ్యంలో ప్రజల విశ్వాసాలు.. ప్రజారోగ్యం అనేవి ఒక జఠిలమైన సమస్యగా మారింది. ఇటు వ్యక్తులకూ, అటు వ్యవస్థలకూ అవి సున్నితమైన అంశమయ్యాయి. కోవిడ్ కారణంగా ఇవి ఒకదానికొకటి పరస్పర ఆధారితాలుగా, అవినాభావ సంబంధంగల విషయాలుగా రూపాంతరం చెందాయి. ఒక కుటుంబం గతంలో పెండ్లికో, ఫంక్షన్‌కో వెళ్లాలంటే ముందు ఖర్చులకు సరిపోను డబ్బులున్నాయా..? పోవాల్సిన ఊరికి రవాణా సౌకర్యం సరిగా ఉందా..? లేదా..? అని మాత్రమే ఆలోచించేవారు. కానీ కరోనా దెబ్బకు ఈ పరిస్థితి మారింది. డబ్బులు, బస్సు లేదా కారు సంగతి తర్వాత... ముందు పెళ్లికి వెళితే అక్కడ అంతా బాగానే ఉంటుందా..? లేదా ఏమైనా వైరస్ సోకుతుందా...? ఒకవేళ సోకితే మన పరిస్థితేమిటి...? మన ద్వారా ఇంట్లో వాళ్లకు కూడా కరోనా వస్తే ఆ పరిస్థితిని ఎలా తట్టుకోవాలి...? ఈ ప్రశ్నలన్నీ జనాల మెదళ్లను తొలుస్తున్నాయి. ఇదే సందిగ్దావస్థ వ్యవస్థలోనూ నెలకొన్నది. పండగలూ, పబ్బాలకు అనుమతివ్వాలా..? లేక నియమ నిబంధనలను కఠినంగా అమలు చేయాలా...? అనేది ప్రభుత్వాలకు, పాలకులకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ క్రమంలో త్వరలో ప్రారంభమయ్యే వినాయక చవితి వేడుకలు, ఆ సందర్భంగా గణేషుడి విగ్రహ ప్రతిష్టలు ప్రస్తావనలోకొచ్చాయి. ఈ పండుగ పేరుతో జనం గుమికూడితే కరోనా వ్యాప్తి ఎక్కువవుతుందంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కొంతమంది ఇతర మతాలను, సంబంధిత పండుగలను ఉటంకిస్తూ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానాలను వండి వడ్డించటం గమనార్హం. మసీదులు, చర్చిలకు లేని కరోనా నిబంధనలు.. బక్రీదు, మొహర్రానికి లేని కోవిడ్ నియమాలు వినాయక చవితి పండుక్కెందుకు...? అన్నది ఆయా కామెంట్ల సారాంశం.
సున్నితమైన ఈ అంశాన్ని పైపైన చూస్తే సమస్యకు పరిష్కారం దొరకదు. దీన్ని పునాది (లోతుగా, నిశితంగా, వాస్తవాలు, శాస్త్రీయత ఆధారంగా) ప్రాతిపదికన పరిశీలించాల్సిన అవసరముంది. కరోనా అన్నది ఇప్పుడప్పుడే మనల్ని విడిచిపెట్టి పోయే అవకాశం లేదన్నది కాదనలేని నిజం. జనం ఎక్కువగా గుమికూడినా, భౌతిక దూరం పాటించకపోయినా దాని వ్యాప్తి తీవ్రత పెరుగుతుందనేది కూడా అంతే నిజం. మరోవైపు ఒకేసారి కేసులు పెరిగితే, వాటికనుగుణంగా ప్రజలకు వైద్య సేవలందింంచే సామర్థ్యం మన ఆరోగ్య వ్యవస్థకు లేదన్నది వివిధ అధ్యయనాలు, గణాంకాలు చెబుతున్న వాస్తవం. ఈ నేపథ్యంలో ఒక్కో పండగ, ఆ సీజన్, అప్పుడున్న కరోనా భౌతిక పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వాలు, వైద్యాధికారులు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి కూడా. ఈ క్రమంలో ఎవరి మనోభావాలు, విశ్వాసాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంటుంది. సహేతుకతతో కూడిన ఇలాంటి అంశాలను పక్కనబెట్టి.. ప్రజల్ని మరింతగా రెచ్చగొట్టే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే వారిపట్ల జనాలు అప్రమత్తంగా ఉండాలి. ప్రసార, ప్రచార మాధ్యమాలు కూడా వీరిపట్ల జాగరూకతతో వ్యవహరించటం ద్వారా వీక్షకులు, పాఠకులకు సరైన దిశా నిర్దేశం చేయాలి.
మరోవైపు ప్రభుత్వాలు కూడా విశ్వాసాల కంటే మిన్నగా ప్రజలు కరోనా నిబంధనలను తూ.చా. తప్పకుండా పాటించేందుకు వీలుగా వారిలో చైతన్యం పాదుకొల్పాలి. ఇందుకోసం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించటం ద్వారా పండుగలు, మత సంబంధిత అంశాలపై అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో నిర్ణయాలు తీసుకోవాలి. అవసరమైతే సంబంధిత మత పెద్దలతో చర్చలు జరపటం ద్వారా ఒక సామరస్యపూర్వక వాతావరణాన్ని నెలకొల్పాలి. అలాగాక తమకు నచ్చిందే వేదం అనే రీతిలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే... 'అమాయకుల్ని రెచ్చగొట్టేవాడు రెచ్చగొడుతూనే ఉంటాడు, రెచ్చిపోయేవాడు రెచ్చిపోతూనే ఉంటాడు'. ఇలాంటి వాటి పర్యవసానాలు, ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నది అనుభవమే. ఇక్కడ మరో ముఖ్యమైన విషయాన్ని మనం ప్రస్తావించుకోవాలి. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్లు, గ్యాస్ ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. ఫలితంగా పేదలు, సామాన్యులు, మధ్యతరగతి వారిపై విపరీతమైన భారాలు పడుతున్నాయి. ఈ సమస్యలను ఏకరువు పెడుతూ ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపడితే.. సర్కారు వారు దాన్ని సహించే పరిస్థితి లేదు. రైతులు, కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు డిమాండ్ల సాధన కోసం పోరుబాట పడితే వారి నోరు నొక్కేయటం పరిపాటిగా మారింది. దీనికి సర్కారు కరోనా నిబంధనలను సాకుగా చూపుతున్నది. ఇటీవల బడుల తెరిచివేత సందర్భంగా కూడా ఇలాంటి చర్చే రాష్ట్రమంతటా నడిచింది. రాజకీయ నేతల మీటింగులు, సభలు, సమావేశాలకు లేని కరోనా బడులకు ఎందుకు..? అంటూ పలువురు వ్యంగ్యాస్త్రాలను సంధించటాన్ని మనం గమనించాం. ఇప్పుడు హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్తోపాటు, ఇతర ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించటమైనా, ప్రజా సంగ్రామ యాత్ర పేరిట బీజేపీ చేస్తున్న హడావుడైనా ఈ వ్యంగ్యాస్త్రాలకు అతీతం కాదు. అందువల్ల ప్రజల విశ్వాసాలను దృష్టిలో ఉంచుకుని... వాటికి సమాన స్థాయిలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనివ్వటం ద్వారా పాలకులు పూర్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అప్పుడే మన పండుగల్లో ఆనందం వెల్లివిరుస్తుంది.. ఉత్సాహం ఉప్పొంగుతుంది.