Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికా ప్రపంచానికి ఒక ఆకర్షణ. మరీ ముఖ్యంగా న్యూయార్క్ నగరం. అమెరికా రాజధాని వాసింగ్టన్ డీసీ ప్రపంచంలో ఏ దేశంపైనైనా పంజా విప్పడానికి సిద్ధంగా ఉన్న సైనిక శక్తికి కేంద్రం. న్యూయార్క్ నగరం దోపిడీ, యుద్ధంలో జగత్ జెట్టీలుగా నిలిచిన అపర కుబేరులందరికీ రాజధాని. ఒకవైపు అంబరాన్ని చుంబించే ఆకాశ హర్మ్యాలు, మరోవైపు సబ్‌వేలు, చీకటి గుయ్యారాలు. ఇవే న్యూయార్క్ నగరం చీకటి వెలుగులు.
తాజాగా న్యూయార్క్ నగరాన్ని ఇడా తుఫాన్ అతలాకుతలం చేసింది. వర్షాకాలంలో రహదారులు తెగిపోవడం, ఆనకట్టలు గల్లంతవటం, రవాణ స్తంభించటం, జనావాసాలు జలాశయాలుగా మారడం, ముంబాయిలోనో, బ్యాంక్కాక్లోను మాత్రమే కనిపించే ప్రత్యేకతలు కాదు. ఇటువంటి వైఫల్యాలు పెట్టుబడి కేంద్రాలు అయిన నగరాలను కూడ అతలాకుతలం చేస్తున్నాయి. ఇడా పెనుతుఫాను దెబ్బకు న్యూయార్క్ నగరం జలాశయంగా మారడానికి గంటసేపు కూడ పట్టలేదు. రెండు రోజుల్లో సగటున 21 సె.మీ. వర్షపాతం ''భూతల స్వర్గాన్ని'' జల ప్రళయానికి దగ్గర చేసింది. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది వలస కార్మికులు నిరాశ్రయులయ్యారు. వలస కార్మికులకు నివాసాలుగా మారిన సబ్‌వేలు, సెల్లార్లు, డార్మెటరీలు జలాశయాలుగా మారాయి. ప్రపంచ సంపదనంతా పోగువేసుకున్న అమెరికా తన దేశాన్ని వరద ముంపునకు గురికాకుండా కాపాడుకోలేకపోయిందా?
లేజర్ గైడేడ్ మిసైల్స్‌తో యుగస్లోవియా, కోసావో, ఇరాన్, ఇరాక్, సిరియా లిబియా, ఆఫ్గానిస్తాన్‌లలో తలదాచుకున్న ఉగ్రవాదులను హతమార్చగల సామర్థ్యం అమెరికా సొంతం. అటువంటి అతి ఆధునిక సాంకేతిక సామర్థ్యాన్ని గుప్పెట్లో పెట్టుకున్న అమెరికా స్వదేశంలో ప్రజలను భారీ వరదల నుండి కాపాడలేకపోయిందా? ఇవి ప్రపంచాన్ని కలవరపెడుతున్న ప్రశ్నలు మాత్రమే కాదు. పెట్టుబడీ ప్రపంచీకరణను సవాలు చేస్తున్న ప్రశ్నలు కూడా.
కోవిడ్ ఉత్పాతం నుండి అమెరికా వ్యవస్థను (కంపెనీల లాభాలను) కాపాడటానికి దాదాపు నాలుగు లక్షల కోట్ల డాలర్ల విలువైన సహాయక పథకాలు అమలు చేసింది. అఫ్ఘానిస్తాన్‌పై అర్థంలేని యుద్ధం చేయడానికి రెండు లక్షల కోట్ల డాలర్లు వెదజల్లింది. ఇదే కాలంలో కత్రినా, ఇడా, లెస్సీ లాంటి తుఫానులు, కారుచిచ్చులు అమెరికాను చుట్టుముట్టాయి. కోట్లాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాజ్యమేలడానికి పర్యావరణ సంక్షోభమే కారణం. సామ్రాజ్యవాద ప్రపంచీకరణే దానికి పునాదులు వేసింది. లాభాలే అన్నింటికి మూలం అని పర్యావరణాన్ని నాశనం చేసే పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ప్రపంచ వ్యాప్త ఉత్పత్తి విధానంగా మారిన గత రెండువందల ఏండ్లలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఒకడిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగింది. ఫలితంగా అకాల వర్షాలు, భరించలేని విధంగా వాతావరణ ఉష్ణోగ్రతలు ప్రతిఏటా పెరిగిపోతున్నాయి. మంచుకొండలు కరిగిపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు ఆయా ప్రాంతాలలో సామాజిక, జీవనోపాధి సంక్షోభాలకు కారణమవుతున్నాయి.
జలవిలయం న్యూయార్క్ నగరాన్ని ముంచెత్తిడంతో ఆఫీసుల నుండి ఇండ్లకు చేరుకునే దారిలో 48మంది చనిపోయారు. సిగల్స్ అందక నిలిచిపోయిన ట్రామ్‌లు, లోకల్ సబర్బన్ ట్రైన్లలో ఆక్సిజన్ చాలక చనిపోయిన వాళ్ళ వివరాలు, ఇండ్లముందు వీధుల్లో పార్కింగ్ ప్రదేశాల్లో నిలబెట్టిన కార్ల నుండి బయటపడలేక కార్లతో సహా మునిగిపోయినవారి సంఖ్య ఇంకా లెక్కకురాలేదు. వలస కార్మికులు, రంగుజాతి ప్రజలకు పేవ్మెంట్లు, సబ్‌వేలు, పార్కింగ్ ప్రాంతాలే నివాస స్థలాలు అయ్యాయి. ప్రపంచీకరించబడిన పెట్టుబడిదారీ వ్యవస్థ తన లాభార్జన కోసం సృష్టించిన గృహ వసతి సంక్షోభమే దీనికి కారణం. పర్యావరణ శాస్త్రవేత్తలు, వాతావరణ విభాగం అధికారులు ముందస్తు హెకచ్చరికలు జారీ చేసినా న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం నివారణా చర్యలు తీసుకోలేకపోయింది. న్యూయార్క్‌లోని మురుగునీరు వ్యవస్థ వందేండ్ల ముందు నిర్మించినది. దానిని ఆధునీకరించడానికి ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. దానితో మురుగునీరు, తాగునీరుకలిసి పారుతున్నాయి. సరళీకరణ ఆర్థిక విధానాల్లో భాగంగా పౌరసేవలు, మౌలిక వసతుల కల్పన ప్రభుత్వాల బాధ్యత కాకుండా పోయింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఏ శాఖకు ఆ శాఖ, ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ తమ నిర్వహణకు కావల్సిన సొమ్ము తామే వసూలు చేసుకోవాలన్న వికేంద్రీకరణ సూత్రాలే కొంప ముంచాయి. అమెరికా అనుభవాలు కండ్లముందున్నప్పటికీ పురపాలక సంస్కరణలు, విద్యుత్ సంస్కరణలు, రవాణా రంగ సంస్కరణల పేర్లతో పలు వర్థమాన దేశాలు భవిష్యత్ ప్రమాదాలకు రంగంసిద్ధం చేస్తున్నాయి.
వరదలొచ్చినప్పుడు ముందుగా మునిగేది లోతట్టు ప్రాంతాలే. అటువంటి ప్రాంతాల్లోనే పేదలు నివసిస్తారు. వారికే ప్రాణనష్టం, ఆర్థిక నష్టం ఎక్కువ జరుగుతుంది. అందుకే ప్రకృతి వైఫరీత్యాలకు కూడా ''వర్గ పక్షపాతం'' ఉంటుందా అని న్యూయార్క్ అనుభవం ప్రశ్నిస్తున్నది.