Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూఢత్వానికి హద్దేలేకుండా పోతోంది. అసలే విపరీతమయిన నమ్మకాలున్న సమాజం మనది. నమ్మకాలు, విశ్వాసాలు ఎవరివి వాళ్ళకు ఉండనీగాక.. వాటిల్లో మూఢత్వాన్ని పెంపొందించి, ఇతరుల, సామాజికుల, ముఖ్యంగా మహిళల, బాలికల హక్కులను సైతం కాలరాస్తూ జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చీకటి యుగంలోకి పయనిస్తున్నామన్న తీవ్ర వ్యాకులత కలుగుతున్నది. ఇక ఈ మూఢత్వానికి మూర్ఖత్వమూ తోడైతే అది ఉన్మాదంగా మారి అరాచకాలకు దారితీస్తోంది. సాంస్కృతిక పరమైన ఈ నీచత్వానికి దిగజారే భావాలు పాలక వర్గాల మూలంగానే పెరిగి పోషించబడుతున్నాయన్నది నేటి విషాద సందర్భం.
మధ్యప్రదేశ్‌లో మొన్న జరిగిన సంఘటన యేదో యాధృచ్ఛికంగానో, దుష్టుతో ఆకతాయిలో జరిపిన చర్య కాదు. దేశం మొత్తంలోనే ఇలాంటి మూఢమైన, మధ్యయుగాల ఆలోచనలకు తిరిగి ఊపిరి పోస్తున్న శక్తుల మూలంగానే ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి. వర్షాల కోసం ఆరుగురు బాలికలను నగంగా గ్రామంలో ఊరేగించడం, జనులు అంతా మౌనంగా దాన్ని తిలకించటం, అలా చేస్తేనే వర్షాలు పడతాయనే అంధత్వాన్ని పెంచి పోషించటం ఇరవయ్యొకటవ శతాబ్దంలో అత్యంత దారుణమైన విషయం. వర్షాలు కురవటానికి, కురవకపోవటానికి ఉన్న కారణాలను విజ్ఞాన శాస్త్రాలు ఎప్పుడో తేట పరిచాయి. ఏ విజ్ఞాన సంపదాలేని కాలాన మనుషులు ఏర్పరచుకున్న మూఢనమ్మకాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తే వరుణుడు కరుణిస్తాడు అనే పురాణ సమాధానాల వెంట ఈనాడూ పరుగెత్తడం తెలివితక్కువ తనమే. ఇదొక్కటే కాదు, గత ఏడు సంవత్సరాల నుండి సమాజంలో ఇలాంటి మూఢ విశ్వాసాల ప్రచారం యథేచ్ఛగా సాగుతోంది.
సాక్షాత్తూ మన దేశాధినేత సైన్సుసభలో వినాయకుడి తల గురించి మాట్లాడుతూ ప్లాస్టిక్ సర్జరీ ఆనాడే మనకుందని అన్న నాడే మన ఆలోచనలు ఎటువైపుగా వెలుగుతున్నాయో పసిగట్టి ఉండాల్సింది. విజ్ఞానాన్ని పురాణాల్లో వెతుక్కోవడాన్ని ఏదోలే అని పట్టించుకోలేదు గానీ, అది ఇలా విస్తరిస్తున్న సంగతి గుర్తించాలి. కరోనాను పారద్రోలటానికి దీపాలను వెలిగించిననాడైనా, ఆవుమూత్రం దివ్యౌషదంగా పనిచేస్తుందని నుడివిననాడైనా, బురదలో బొర్లే థెరపీని ప్రచారంచేసిన రోజైనా మనం వారి అవగాహనను గుర్తించి ఉండాలి. అసలు విజ్ఞానదాయకమైన పరిష్కారాలను, ప్రజావైద్య అవసరాలను, పర్యావరణ పరిరక్షణను చేయలేని, చాతకాని వాగాడంబరులు చేసే అత్యంత తేలికయిన పనులు ఇలాంటివే. రేపుపంటలు పండకపోతే, కల్తీ విత్తనాలతో పంటలన్నీ నాశనమైతే యజ్ఞం తలపెట్టి అగ్నిలో ఆజ్యం పోయాలని అప్పుడే ఫలితముంటుందనీ చెబుతారు. నిరుద్యోగం పెరిగి బతకటం కష్టమైనప్పుడు, అన్నింటికీ దేవుడున్నాడని ఆకాశంవైపు చూపి దేవున్ని ప్రార్థించమని సలహా ఇస్తారు. ధరలు పెరగటమూ, ఖర్చులు పెరిగి తట్టుకోలేక ప్రజలు ఆకలితో అనారోగ్యంతో కష్టాలు పడుతుంటే పూర్వ జన్మ పాపఫలమనీ, కర్మను అనుభవించాలనీ సెలవిస్తారు. ప్రజలు అన్నమో రామచంద్రా అంటుంటే, ఆదానీ అంబానీలకు మాత్రం వందల శాతం లాభాలతో ఆదాయాలు పెరిగిపోవడాన్ని, వాళ్ళు పెట్టి పుట్టారని, పూర్వజన్మ సుకృతమనీ వాక్క్రుచ్చుతారు!
వాళ్ళు చేసే ఘనకార్యాల ఫలితంగా ప్రజలు పడుతున్న బాధలకు, సవాళ్ళకు మూఢ విశ్వాసాల్లో పరిష్కారాలను వెతుక్కోమని ప్రోత్సహించడం వాళ్ళకు అవసరమైనపని. ఇకపోతే మరీ మూర్ఖమైన చర్యలనూ, ఉన్మాద ప్రవర్తనలనూ మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. మనదేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని బీజేపీ నాయకులను ప్రశ్నిస్తే, అఫ్ఘనిస్తాన్ వెళ్ళండని, అక్కడ చౌకగా ఉంటుందని వెటకరించారు. ఇక కర్నాటక ఎమ్మెల్యే అయితే తాలిబన్ సంక్షోభం వలననే భారత్‌లో పెట్రోలు, గ్యాస్ ధరలు పెరిగాయని సెలవిచ్చారు. అఫ్ఘన్ పరిణామాలకంటే ముందునుండే మనదగ్గర ధరలు పెరుగుతున్న విషయానికి కూడా మసిపూసేసారు. ఇంకొంత వెనక్కి వెళితే, మహాత్మాగాంధీ బొమ్మను పిస్టల్‌తో కాల్చి, క్రూరమైన ఆనందాన్ని పొందటం ఎంతటి ఉన్మాదచర్య! అదే నాయకురాలు నాధూరాంగాడ్సేని దేశభక్తుడని పొగడటంలోని మానసిక రోగ వికారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి! అంతేకాక స్త్రీలు వంటింటికీ, పిల్లలను కని పెంచటానికే ఉన్నారని బహిరంగంగానే వివక్షపూరిత ఆలోచనలను ప్రకటించడం మనదేశంలో జరిగాకే, నేడు అఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు వచ్చాక మళ్ళీ వింటున్నాం.
ఇంకా వికృతమైన మూర్ఖపు చర్యను త్రిపురలో మనం చూశాం. అక్కడి మార్కిస్టుపార్టీ కార్యాలయాలపై దాడిచేసి పగలగొట్టటం, కాల్చివేయటం, దివంగత గిరిజన మహానేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన దశరథ్దేబ్ విగ్రహాన్ని పగలగొట్టటం, పోలీసు, మిలటరీ సమక్షంలోనే అరాచకంగా మూకదాడులకు పాల్పడటం చూస్తుంటే ఇది ఎంతటి మూర్తీభవించిన మూర్ఖత్వమో తెలుస్తోంది.
ఒకవైపు మూఢత్వంతో, మరోవైపు మూర్ఖత్వంతో సామాజిక, రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తున్న వారి ఆటలు కొంతకాలమే సాగుతాయి. సామాజిక పురోగమనాన్ని, ప్రజల ఆలోచనల ముందడుగును చరిత్ర ఎక్కడా ఆపలేకపోయింది. మహామహులెందరో కాలగర్భంలో కలిసిపోయారు. మూఢత్వంపై శాస్త్రీయత విజయం సాధిస్తుంది. మూర్ఖత్వంపై ఉన్మాదంపై మానవీయత, ఆధునిక ప్రజాస్వామికత గెలుపు అనివార్యం.