Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''భూమిని తవ్వడానికి పుట్టినవాడు తన కొరకు ఒక గోరీ తవ్వుకోకుండానే చస్తాడంటావా?... వాడు బానిస. పుట్టిన క్షణం నుండి బానిస. జన్మంతా బానిసే!'' అని కష్టజీవిని ఎగతాళిగా దేశ దిమ్మరి పాత్ర అంటుంది మాక్సిమ్ గోర్కీ కథలో..
ఆ బృందం దేశ దిమ్మర్లు కారు. సంచార జాతులవారు అసలేకాదు. వారిదొక ''మిషన్''. వారికొక లక్ష్యం. బానిసల కళ్ళల్లో 'కత్తులు' మొలిపించడం వారిధ్యేయం. వందేండ్ల కార్మికోద్యమ ఫలాల్ని కార్పొరేట్ల కోసం విధ్వంసం చేసే మోడీ సర్కార్ అనుపానులు కార్మికులకు అర్థం చేయించడం, మరో పోరాటానికి పురికొల్పడ మొకటి కాగా, రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలను మంచిగా ''అరుసుకోవడమే'' తన విద్యుక్తధర్మంగా ఫీలయ్యే కేసీఆర్ ప్రభుత్వ విధానాలను కార్మికులకు ఎరుక పరచడం, కనీస వేతనాల జీఓలు రాకపోవడానికి వెనకున్న కారణాలను వివరించడం వారి లక్ష్యం. పాదయాత్ర లక్ష్యాలు గత అనేక నెలలుగా రాష్ట్రంలో ప్రచారంలో ఉన్నవే. కాని హఠాత్తుగా నాలుగు జతల పాదాలు రాజ్యాన్ని భయపెట్టాయి. రెండు రోజులకే, రెండు పారిశ్రామిక వాడలు చుట్టేసరికే పెట్టుబడి గుండెలదిరాయి. జనారణ్యంలోనే, జాతీయ రహదారులకంటుకునే తమ ఫ్యాక్టరీలున్నా ఏ''దుష్టశక్తి'' చూపూ వాటిపై పడకుండా పైదేశాల నుండి ఏనుగు పొట్టంత సైజులో బూడిద గుమ్మడికాయలు తెప్పించి వేలాడేసినా ఇంత కాలానికి కనీస వేతనాలంటూ, పనిగంటలంటూ తమ కార్మికుల బుర్రలు ''చెడగొడ్తే'' పెట్టుబడి ఉలిక్కి పడదా?! ''కొట్టే చేతిని పట్టుకోవడం, తిట్టేనోటి కెదురుతిరగడం కూడ శాంతికి భంగాలంటారు. క్రూర మృగం నిన్ను పట్టుకు తింటోంది. కదిల్తే కల్లోలం తప్పదు. కదలకుండా దాన్ని భోంచేయనీరు'' అని కా.ర. మాస్టారి కథా ''యజ్ఞం'' సరిగ్గా యాభైయేండ్ల క్రితం చెప్పింది.
దానికి మరికొంత ముందు సీఐటీయూ ఆవిర్భావసభలో అంతకు ముందటి కాలాన్ని సమీక్షిస్తూ కామ్రేడ్ బి.టి.ఆర్. ''తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభంగా మారుతోంది. దాని అర్థం పోలీసుల జోక్యం, జైళ్ళు, లాఠీ చార్జీలు, పోలీసు కాల్పుల్లో అమరులవడమే కాదు, నీ ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలు ముగించుకుని, నీ ఇంటి సందు తిరగంగానే వెనక నుండి గూండాల కత్తిపోట్లుంటాయి. వర్గపోరాటం తీవ్రమవడం అంటే ప్రత్యేకించి బెంగాల్, కేరళల్లో సాధారణ టి.యు. పోరాటాలు కూడ కత్తిపోట్లకు, రక్తపాతానికి, హత్యలకు గురికావడం మామూలైపోయింది'' అన్నారు. ఈ అర్థశతాబ్దంలో ఎన్ని మారినాయి! సరళీకృత ఆర్థిక విధానాలు ముదిరి పాకాన పడుతున్న వేళ ఆర్థిక సంక్షోభం తీవ్రమైంది. ఒకవైపు శతసహస్ర, కోటీశ్వరులు గుప్పెడు మంది, రెండవ వైపు సముద్రమంత విస్తారంగా నిరుపేదలు. కొత్తగా మోడీ సర్కార్ పేదరికం కొలతలు మార్చారు. గ్రామాల్లో 2200 క్యాలరీలు, పట్టణాల్లో 2100 క్యాలరీల శక్తి నిచ్చే ఆహారం తినగలిగిన వారిని పేదరిక జాబితా నుండి తప్పించారు. డాక్టర్ అక్ట్రాయిడ్ ఫార్ములా గాలికి పోయింది. ఈ లెక్కన కూడ పోషక విలువలున్న ఆహారం తీసుకోగలిగిన వారి సంఖ్య దారుణంగా పడిపోయింది. 2011-12కి 2017-18కి మధ్య తలసరి నిజవినిమయ ఖర్చు గణనీయంగా తగ్గినట్టు ఎన్ఎస్ఎస్ఒ డేటా తెలియజేస్తోంది. పాదయాత్ర నాయకులను ఆత్మీయంగా గుండెలకు హత్తుకున్న కార్మికులు పెట్టగలిగింది, పెడుతున్నదీ పచ్చి పులుసు, పప్పుచారు, ఆలు, వంకాయ కర్రీ వంటివే! కార్మికుల స్థితిని ఇది చెప్పకనే చెప్తోంది కదా!
ఈ పాదయాత్ర పథికులకే కాదు, సామాన్య కార్మికులకూ నడక నేర్పుతోంది. మాటలు కూడ నేర్పుతుందేమోనని పెట్టుబడికి ఉలికిపాటు. ఇటీవల రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసుకున్న 'ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ ఆర్డినెన్స్'' కూడ వర్తించే టాటా ఎయిరోస్పేస్ పరిశ్రమ పాదయాత్ర దార్లో ఉంది. పైగా ఇది సెజ్. అక్కడ సంఘాలు పెట్టుకోవడం నిషేధం. మోడీ పుణ్యాన అవతరించిన ఐ.ఆర్.కోడ్ కార్మికులు కూడబలుక్కుని క్యాజువల్ లీవ్ పెట్టినా, ఓ.టీ. చేయనన్నా శిక్షార్హులే. సమ్మెలూ నిషేధమే. నిషేధించేది ఎవరో కోడ్ స్పష్టం చేయలేదు. అంటే యజమానే నిషేధిస్తాడన్నమాట! పెట్టుబడి బకాసుర భోజనానికి కార్మికుల ప్రయోజనాలను నైవేద్యం పెట్టడమంటే ఇదే కదా!
''కోర్టులు, పత్రికలు, మేథావులు పట్టించుకోకుండా మిగిలిపోయిన వాస్తవాలివి.'' ఈ దశలో కార్మికుల హక్కుల గురించి మాట్లాడేదెవరు? పోట్లాడే వాళ్ళెవరు? రాజ్యం అసలు రూపాన్ని బహిర్గతం చేసే ఘటనలు మన చుట్టూ అనేకం జరుగుతుంటాయి. పోలీసు తుపాకులకు శరీరాలు తెగి పడినప్పుడో, జైళ్ళు నోరు తెరుచుకున్నప్పుడో ''రాజ్యం''పై చర్చ జరగడం దురదృష్టకరం. అంతా ప్రశాంతంగానే ఉన్నట్టు భావించే సమాజాన్ని కార్మిక వర్గమే తట్టి లేపాలి. కులం, మతం, ప్రాంతం, భాషల పేరుతో ప్రజల ఐక్యతకు చిచ్చుపెట్టేది కూడా రాజ్యమే. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఢిల్లీ రైతు ఉద్యమం చూస్తే ప్రజలు వర్గపోరాటంలో ఏవిధంగా ఐక్యమవుతారో అర్థమవు తుంది. అందుకే వర్గ పోరాటాలకు పదునుపెట్టడమే నేటి కర్తవ్యం.
చట్టాలు రద్దుచేసేస్తే కార్మికుల్ని బానిసలుగా చేయలేరు. అది పెట్టుబడి పేరాశే. అడువుల్లో పుట్టిన ఏనుగు పిల్లలైనా, జిరాఫీ పిల్లలైనా తల్లి పొదుగు ఎక్కడుందో కళ్ళు తెరవకముందేత గుర్తించగలవ్. సంఘాలను వందేండ్లు అనుభవించి, సమ్మెల ఫలాలను పొందిన కార్మికులను బానిసలుగా చేస్తామనుకోవడం, చేయగలమనుకోవడం పెట్టుబడిదార్ల భ్రమే. ప్రజా కోర్టులో తేలాల్సిన సమయం దగ్గరికొస్తోంది.