Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చాలా సందర్భాల్లో మౌనం పూర్ణాంగీకారం లాగే ఉంది. బహుశా దీన్ని ప్రధాని మోడీ నుంచే రాష్ట్ర నేతలు నేర్చుకున్నట్టున్నారు. జీఎస్టీ కౌన్సిల్లో వారు నోరిప్పకపోతే తెలంగాణ ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఇటీవల ఆ కౌన్సిల్‌కు సభ్యుడిగా ఎంపికైన రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆ మీటింగుకు వెళ్తారా..? లేదా...? అనే విషయాన్ని అధికారగణం సైతం చెప్పలేకపోవటం ఆశ్చర్యమే మరి. తాజాగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత నెంబర్ వన్, టూలతో 'వన్ టూ వన్...' చర్చల తర్వాత పరిస్థితి మరింత సందేహాస్పదంగా తయారైంది. విద్యుత్, వ్యవసాయ చట్టాలపై పిల్లి మొగ్గలు రాష్ట్ర ప్రయోజనాలను తీవ్ర నష్టం కలిగించనున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం లక్నోలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశమనే సవాలును రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొంటుందనేది కీలకం. ఆ భేటీకి వెళ్లాలా..? వద్దా...? అనే సందిగ్దంలో టీఆర్ఎస్ సర్కారు కొట్టుమిట్టాడుతున్నది. వెళ్లకపోతే ఒక బాధ, వెళితే మరో బాధలా పరిస్థితి తయారైంది. ఈ కౌన్సిల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సభ్యుడు కూడా. ఒకవేళ ఆయన అందులో సభ్యుడు కాకుండా ఉంటే... మిగతా రాష్ట్రాల విత్త మంత్రుల్లాగా ఆయన కూడా కేంద్రం విధానాలపైనా, తెలంగాణకు రావాల్సిన నిధులపైనా గళమెత్తే అవకాశముండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేకపోయింది. సంబంధిత కౌన్సిల్లో సభ్యుడైన తర్వాత నోరెత్తలేని పరిస్థితి. వెరసి రాష్ట్ర ప్రభుత్వానికి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అనే దుస్థితి తలెత్తింది.
పోనీ ఈ విషయాన్ని కాసేపు పక్కనబెట్టి... కౌన్సిల్లో సభ్యుడైనా, కాకపోయినా తెలంగాణ ప్రయోజనాల కోసం గళమెత్తాలని భావించినా, గులాబీ బాస్ నుంచి ఆదేశాలొస్తేగానీ ఆ పని జరగదు. కానీ ఇంతవరకూ ఆ ఆదేశాలు గానీ, అందుకు సంబంధించిన ఆలోచనగాని ఉన్నట్టు కనబడటం లేదు. పలు రాజకీయ కోణాలు ఇందులో దాగున్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాలు, ఇక్కడి ప్రజల ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టటం ద్వారా మన ప్రభుత్వాధినేతలు ఏం సాధించదలచుకున్నారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ యేడాది ప్రారంభంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు, ఏకరువు పెట్టిన అంశాలు, ఆర్థికంగా నష్టపోయామంటూ పెట్టిన గోసను పరిశీలిస్తే... అప్పడు అలా నిధుల గురించి నొక్కి వక్కాణించిన గులాబీ సర్కారు, ఇప్పుడిలా చెవిటి వాడి ముందు శంఖం ఊదిన చందంగా ఎందుకు వ్యవహరిస్తున్నది..? అనే సందేహం కలగక మానదు. 'గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో పదిహేను ఆర్థిక సంఘం తెలంగాణకు సంబంధించి చేసిన సిఫారసులను మోడీ సర్కారు అమల్జేయకపోవటం వల్ల రాష్ట్రం రూ.723 కోట్లను నష్టపోయింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి విడుదల చేయాల్సిన రూ.900 కోట్లను ఇవ్వకుండా కేంద్రం రిక్తహస్తం చూపింది. మహిళా సంఘాల కోసం రూపొందించిన యాభై శాతం వడ్డీ రాయితీ పథకాన్ని రాష్ట్రంలోని సగం జిల్లాలకే వర్తింపజేస్తున్నారు...' ఇవన్నీ జనవరిలో స్వయంగా తెలంగాణ ప్రభుత్వం చెప్పిన విషయాలే. ఆ తర్వాత జూన్‌లో నిర్వహించిన 44వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనూ కేసీఆర్ సర్కారు మరికొన్ని అంశాలను లేవనెత్తింది. 'కరోనా రెండో దశ కారణంగా రాష్ట్రంలో మేలో మరోసారి లాక్‌డౌన్‌ను విధించాల్సి వచ్చింది. ఫలితంగా రాష్ట్రం రూ.4,100 కోట్లను నష్టపోయింది...' ఇవి కూడా మన విత్తమంత్రి విడమరిచి చెప్పిన సంగతులే. వీటితోపాటు 2020లో వచ్చిన కరోనా మొదటి దశతో రాష్ట్రం ప్రత్యక్షంగా రూ.50 వేల కోట్లు, పరోక్షంగా మరో రూ.50 వేల కోట్లు నష్టపోయిందంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రకటించిన సంగతి జనులందరికీ ఎరుకే. వీటన్నింటినీ ఒకటికి పదిసార్లు చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. కేంద్రంపై ఒత్తిడి తేవటం ద్వారా నష్టపోయిన వాటాలు, నిధులనూ రాబట్టాల్సిన తరుణమిది. మరోవైపు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ రేట్ల మోతతో సామాన్యుల నడ్డి విరుగుతున్నది. వీటి ప్రభావంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటు తుండటంతో సామాన్యులు బతకలేని పరిస్థితి. ఈ క్రమంలో జీఎస్టీ భేటీలో చర్చించటం ద్వారా పెట్రో మంటల నుంచి జనాన్ని రక్షించాలని యావత్ ప్రజానీకం కోరుకుంటున్నది. ఈ క్రమంలో ఇలాంటి సార్వజనీన అంశాలపై పెదవి విప్పటం ద్వారా మోడీ సర్కారు బట్టలూడదీసి, దాని నిజ స్వరూపాన్ని బహిర్గతం చేయాలి. అయితే వీటన్నింటిపై పిడికిళ్లు బిగించేంత సీను గులాబీ పార్టీకి లేదన్నది మొన్నటి సీఎం ఢిల్లీ పర్యటనతో తేలిపోయింది. అలాంటప్పుడు కనీసం మనకున్న పరిధులు, పరిమితుల మేరకు గళమెత్తాలి. లేదంటే తెలంగాణ పాలకులు గతంలో ఊదరగొట్టిన 'ఫెడరల్ ఫ్రంట్.. రాష్ట్రాల హక్కులు.. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు...' లాంటివన్నీ ఉత్త గ్యాసేనని తేలిపోతుంది. అందుకే... తన రాజకీయ ప్రయోజనాలరీత్యా కేంద్రం ముందు మౌనంగా ఉండటమా..? లేక వీరోచితంగా గళమెత్తటమా..? అనేది గులాబీ సర్కార్ తేల్చుకోవాలి.