Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాటిన్ అమెరికాలో పరిణామాలు ద్రవ్య పెట్టుబడికి సవాళ్ళు విసురుతున్నాయి. ప్రత్యేకించి లాటిన్ అమెరికా దేశాల్లో పెరుగుతున్న సమరశీల ప్రజా ఉద్యమాలు విదేశీ పెట్టుబడిదారులకు వణుకు పుట్టించే స్థాయికి చేరాయని రేటింగ్ సంస్థ ఫిచ్ నిర్ధారించింది. ఈ ప్రజా ఉద్యమాల నేపథ్యంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు, పార్టీలు ముందుకు తెచ్చే విధాన ప్రత్యామ్నాయాలతో అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడి లాభాల వేటకు సంస్థాగత అవరోధాలు సృష్టించే అవకాశం ఉన్నదని ఫిచ్ ఆందోళన వ్యక్తం చేసింది.
నేడు ప్రపంచ వ్యాప్తంగా అమలు జరుగుతున్న సరళీకరణ ప్రయివేటీకరణ విధానాలకు తొలి ప్రయోగశాల లాటిన్ అమెరికా. మరి ఈ దేశాల్లో అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి పగ్గాలు వేసే అవకాశాలు ఎలా ముందుకు వచ్చాయో గమనించడం ఉపయోగం. ఇప్పటికే క్యూబా, వెనెజులా, లాటిన్ అమెరికాలో వామపక్ష రాజకీయాలకు కంచుకోటలుగా ఉన్నాయి. ఇప్పుడు వాటికి తోడుగా చిలీ, పెరూ, మెక్సికో, బ్రెజిల్, కొలంబియా, ఈక్వెడార్ జత కలిసాయి. లాటిన్ అమెరికాకు వెలుపల నార్వేలో వామపక్ష లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వీటిన్నింటిలో దండలో దారంలా కనపడేది సరళీకరణ విధానాలకు తీవ్రవ్యతిరేకత, రెండోది ప్రయివేటీకరణ జరిగిన ప్రభుత్వ రంగ సంస్థలను మళ్ళీ ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడం. పొదుపు చర్యలలో భాగంగా తొలగించిన సామాజిక భద్రతా సౌకర్యాలను పునరుద్ధరించాలనే డిమాండ్‌తో పెద్ద ఎత్తున జరుపుతున్న కార్మిక పోరాటాల ఫలితంగా ఈ మార్పులు జరుగుతున్నాయి అనేది కీలక పరిణామం.
క్యూబాలో అమెరికా విధించిన ఆంక్షల కారణంగా ఏర్పడిన ఆహారం, మందుల కొరతను సాకుగా చూపి అమెరికా ప్రోద్బలంతో నడిచే ప్రతిపక్ష పార్టీలు ప్రజలను రెచ్చగొట్టి హింసాత్మక నిరసనలకు పూనుకున్నాయి. క్యూబా ప్రభుత్వం ఆ దేశంలోని కమ్యూనిస్టు పార్టీ వెంటనే స్పందించి ప్రజల వద్దకు వెళ్ళి కొరతలకు అమెరికా ఆంక్షలే కారణం అని శక్తివంతంగా ప్రచారం చేయడంతో లక్షలాది మంది ప్రజలు ప్రభుత్వానికి అనుకూలంగా వీధుల్లోకి రావడంతో వ్యతిరేక శక్తుల ఆట కట్టింది. కరోనా కట్టడిలో ఇతర దేశాలకు డాక్టర్లు, నర్సులను పంపి క్యూబా అందించిన సహాయం అంతర్జాతీయ గుర్తింపు పొందింది.
వెనెజులాను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా అమెరికా ముద్రవేసింది. పెద్దఎత్తున ప్రజలను ప్రభుత్వ వ్యతిరేక అసాంఘిక కార్యక్రమాలకు ప్రోత్సహించింది. మదురో పార్టీ ఎన్నికలలో అవకతవకలకు పాల్పడిందని రెచ్చగొట్టింది. ఈ నేపథ్యంలో మదురో పార్టీ చొరవ తీసుకుని ప్రతిపక్ష పార్టీలను చర్చలకు ఆహ్వానించింది. చర్చలు మెక్సికోలో జరిపి భవిష్యత్‌లో జరిగే ఎన్నికలలో పాల్గొనేలా ఒక అంగీకారానికి వచ్చింది. అమెరికా ప్రోత్సాహంతో పనిచేసే ఆ పార్టీలు ఒప్పందానికి కట్టుబడి ఉంటాయా లేదా అనేది వేచిచూడాల్సి ఉన్నది.
బోలివీయాలో మోరెల్స్ గత ఎన్నికల్లో గెలిచినా బలవంతంగా తొలగించారు. అయితే తరువాత జరిగిన ఎన్నికల్లో మోరెల్స్ పార్టీనే ప్రజలు పూర్తి మెజార్టీతో గెలిపించారు. దానితో సైన్యం వెనకకు తగ్గక తప్పలేదు. ఇక్కడ కూడా అమెరికా కుట్రలు బట్టబయలు అయ్యాయి.
పెరూ అధ్యక్ష ఎన్నికలలో వామపక్షాలు గణనీయమైన విజయాలు సాధించాయి. వామపక్ష భావాలు గల కాస్టిల్లో గెలిచారు. ఆయన గ్రామీణ ప్రాంతంలో పనిచేసే ఉపాధ్యాయుడు, కార్మిక సంఘాలకు నాయకుడుగా ఉన్న రాజకీయ నాయకుడు. పేద ప్రజల ఎజెండాతో ముందుకు వెళ్ళాడు. రాబోయే రోజుల్లో నియంతృత్వ కాలంలోని నయా ఉదారవాద రాజ్యాంగాన్ని తిరగరాసేందుకు రెఫరెండం నిర్వహించబోతున్నారు. మూలవాసి ప్రజల, మహిళల హక్కులకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.
చిలీలో నియంతృత్వ కాలంలోని రాజ్యాంగాన్ని తిరగ రాయడానికి 155మందితో కొత్త రాజ్యాంగ సభను ప్రజలు నేరుగా ఎన్నుకున్నారు. రాజ్యాంగ సభ ఎన్నికలలో నయా ఉదారవాద అభ్యర్థులు తుడిచిపెట్టుకు పోయారు. కొత్త రాజ్యాంగ రచనకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బ్రెజిల్లో 2022లో జరిగే అధ్యక్ష ఎన్నికలలో లూలా ముందంజలో ఉన్నారు. లూలా ఎన్నికైతే లాటిన్ అమెరికాపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వామపక్ష పురోగామి శక్తులకు ఇది మరోసారి ఊపునిస్తుంది.
పైన ప్రస్తావించిన లాటిన్ అమెరికా అనుభవాలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎంత శక్తివంతమైనదైనా సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆధిపత్యం ప్రజా ఉద్యమాల ముందు తల వంచాల్సిందే అన్నది లాటిన్ అమెరికా అనుభవంగా ఉన్నది. కోవిడ్ నేపథ్యంలో పౌరజీవనంపై విధించిన ఆంక్షలు ప్రజా ఉద్యమాలను నీరుగార్చలేవన్నది లాటిన్ అమెరికా దేశాలు మనముందు ఉంచుతున్న రెండో అనుభవం. సరైన నిర్ధారణలు, సమీకరణ వ్యూహాలు ఉంటే రాజ్యాంగ వ్యవస్థల వైఫల్యాలు ఉన్న సందర్భాన్ని గుర్తించి సరైన దిశానిర్దేశం చేస్తే ప్రజల భాగస్వామ్యంలో ప్రజా అనుకూల ప్రగతిశీల ప్రభుత్వాలు ఆవిర్భవించడానికి అవకాశం ఉంటుంది. ఇదే బాటలో లాటిన్ అమెరికా ఇప్పుడు నడుస్తున్నది.