Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అన్నపురాశులు ఒకచోట... ఆకలిమంటలు ఒకచోట'' అన్నారు ప్రజాకవి కాళోజీ. ఎప్పుడో దశాబ్దాల క్రితం దేశంలోని అసమానతలను ఎత్తిచూపుతూ ఆయన కలం నుంచి వెలువడిన ఈ కవితా వాక్కులు, ఇప్పుడు వర్తమానాన్నీ ప్రశ్నిస్తూనే ఉన్నాయి. దీనిని నిరూపిస్తూ వెలువడుతున్న పలు జాతీయ, అంతర్జాతీయ అధ్యయనాలు దేశంలో అంతకంతకూ పెరుగుతున్న అంతరాల పరంపరను కండ్లకు కడుతూనే ఉన్నాయి. తాజాగా వెలువడిన ఐక్యరాజ్యసమితి యుఎన్సి ట్రేడ్ అండ్ డవలప్మెంట్ నివేదిక, స్వయంగా భారత ప్రభుత్వశాఖ సంస్థ నేషనల్ సాంపుల్ సర్వే సంస్థ వెలువరించిన సరికొత్త డేటాలు ఈ పెరుగుతున్న అంతరాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్థూలంగా భారత్‌లో ఆదాయాలూ, సంపదల్లో అసమానతలు మరింత తీవ్రమవుతున్నాయన్నదీ, దేశంలో 50శాతం ఆస్థులు కేవలం 10శాతం మంది వద్ద కేంద్రీకృతమవుతున్నాయన్నదీ ఈ నివేదికల సారాంశం. ప్రపంచంలో అత్యధిక శతకోటీశ్వరులున్న దేశాలలో భారత్ 4వ స్థానానికి ఎగబాకగా, ప్రపంచ మానవాభివృద్ధి సూచిలో 131వ స్థానానికి దిగజారడం ఈ అగాధానికి అద్దం పడుతోంది. ఫలితంగా మనమిప్పుడు దేశానికి రెండు ముఖాలను చూస్తున్నాం. ఒక ముఖం సంపన్న భారతం కాగా రెండోది సామాన్య భారతం.
భార్య పుట్టినరోజుకు ఏకంగా ఓ విమానాన్నే కానుకగా ఇవ్వగలిగిన పెద్దలున్న ఈ నేల మీదే, పెండ్లిరోజున భార్యకు మూరెడు మల్లెపూలు కొనివ్వలేని పేదలున్నారు. ఇంట్లో పెండ్లికి ఊరంతా పందిళ్లేసి బంగారు పళ్ళాల్లో విందులు చేసే భాగ్యవంతులున్న ఈ నేల మీదే, ఇల్లూ, వాకిలీ అమ్ముకున్నా పిల్ల పెండ్లి చేయలేని అభాగ్యులున్నారు. తిన్నది అరగక అజీర్తితో ఆసుపత్రిలో సైతం ఫైవ్ స్టార్ విలాసాల్లో తేలియాడుతున్న సంపన్నులున్నారు... తిండికిలేక అనారోగ్యంపాలై ధర్మాసుపత్రిలో ఆక్సిజన్‌కు నూరు రూపాయల లంచం ఇవ్వలేక ప్రాణాలు కోల్పోతున్న సామాన్యులున్నారు. నలుగురు మనుషుల నివాసానికి ఇరవై ఏడు అంతస్తుల భవనాలు నిర్మాణమవుతున్న చోటే, అరవై గజాల ఇంటిస్థలానికి నోచని బీదలు కోట్లాదిమంది ఉన్నారు. ఇలా లక్షలాదికోట్ల సంపదతో తులతూగుతున్న శతకోటీశ్వరులతో ఒక భారతం విరాజిల్లుతుండగా, భరించలేని పేదరికంలో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలతో మరో భారతం విలవిలలాడుతున్నది.
ప్రపంచ కుబేరుల్లో మన సంఖ్య వందల్లో పెరుగుతున్నందుకు ఆనందించాలో, అన్నార్తుల సంఖ్య అసంఖ్యాకమవుతున్నందుకు విచారించాలో అర్థంకాని పరిస్థితి ఈ దేశానిది..! ప్రపంచంలో అర్థాకలితో, అర్థాయుష్షుతో మగ్గుతున్న ఐదేండ్లలోపు పిల్లల్లో నూటికి నలభై అయిదు మంది ఈ దేశంలోనే ఉన్నారు. ప్రపంచంలోనే అపారమైన మానవవనరులున్న ఈ దేశంలోనే ఉద్యోగం రాక, ఉపాధి లేక చౌరస్తాలో దిక్కులు లెక్కిస్తున్న యువకులున్నారు. ఉరితాళ్లకు వేలాడుతున్న రైతులున్నారు. జీవచ్ఛవాలుగా మిగులుతున్న వృత్తిదారులున్నారు. ఇంత జరుగుతున్నా దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని సెలవిచ్చే ప్రభుత్వాధినేతలూ ఉన్నారు...!
ప్రత్యేకించి మోడీగారి ఈ ఏడేండ్ల కాలంలోనైతే అభివృద్ధి గురించి వినీ వినీ దేశానికి చెవులు చిల్లులు పడుతున్నాయి. మరి దేశం అభివృద్ధి చెందటం లేదా? లేదంటే అది అసత్యమే అవుతుంది. కాకపోతే ఆ అభివృద్ధి ఏమైపోతోందీ ఎవరికి చెందుతోందీ అన్నదే ప్రశ్న. జరిగిందీ, జరుగుతున్నదీ ఎవరి అభివృద్ధి? నూటికి 90శాతంగా ఉండి ఉత్పత్తికి చెమటను ధారపోస్తున్న ప్రజల అభివృద్ధా? లేక ఆ ఉత్పత్తిని దోచుకు తింటున్న 10శాతం మంది పారిశ్రామిక వేత్తలూ, కాంట్రాక్టర్లూ, వ్యాపార దిగ్గజాల అభివృద్ధా? అంటే.. 10శాతం మంది బడాబాబుల అభివృద్ధేనన్నది ఈ నివేదకలు స్పష్టం చేస్తున్న పచ్చి నిజం. ఈ నివేదికలే కాదు ఈ నయా ఉదారవాద విధానాల కాలంలో ప్రపంచమంతటా వెలువడుతున్న నివేదికలన్నీ తేల్చి చెబుతున్న సత్యమిది. విశ్వసంపదలో సగభాగం కేవలం పదో పన్నెండో కుటుంబాల చెరలో ఉండటం ఎంత అన్యాయం..? మన దేశంలోనూ 58శాతం సంపద ఒక్కశాతంగా ఉన్న సంపన్నులు అనుభవిస్తుంటే, 99శాతం ప్రజల చేతుల్లో కేవలం 42శాతం సంపదే ఉన్నదని గతంలో ఆక్స్‌ఫామ్ నివేదికలు అనేకసార్లు వెల్లడించాయి. ఆ మాటకొస్తే...
''హంస తూలికలొకచోట.. అలసిన దేహాలొకచోట..
వాసన నూనియలోక చోట.. మాసిన తలలింకొకచోట..
సంపదలన్నీ ఒక చోట.. గంపెడు బలగం ఒక చోట'' అంటూ ఈ అసమాన భారతాన్ని ఏనాడో ఎత్తచూపాడు కాళోజి. ఈ నేపథ్యంలో నిత్యం అభివృద్ధి మంత్రాలు జపిస్తూ చంకలు గుద్దుకునే మోడీగారి పరివారమంతా ఓ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అభివృద్ధి అంటే కోటానుకోట్ల మంది శ్రమను కొద్దిమంది బానీలకూ, దానీలకూ దోచిపెట్టడమేనా..? ఇలా అంతరాలను పెంచి పోషించడమేనా..?
విశేషమేమిటంటే... మనదేశంలో అన్ని పార్టీలదీ అభివృద్ధి నినాదమే..! నేతలందరిదీ ఆకలిపై పోరాటమే..!! ఇందులో తమాషా ఏమిటంటే కమ్యూనిస్టులను మినహాయిస్తే వీరందరికీ అసలు ఆకలంటే ఏమిటో తెలుసా?! ఆ ఆకలి తీర్చుకోవడానికి విధిలేక చేసే నేరాల గురించి తెలుసా? తెలుసో లేదో తెలియదుగానీ అసంఖ్యాకులైన ఈ ప్రజల ఆకలే వీరికి వరం. ఎందుకంటే నిస్సహాయులైన ప్రజలను వంచించడమూ, దోచుకోవడమూ వారికి చాలా సులభం. కానీ ఆకలిని మించిన ఆవేశం మరొకటి లేదన్న సంగతి కూడా నేతలు గుర్తెరగాలి. ఆ ఆవేశం కట్టలు తెంచుకున్న రోజున, అది అసంఖ్యాకమైన జన సందోహమై, అరుణకాంతులై కదిలిన రోజున.. ఈ దోపిడీ కోటలు కూలక తప్పదు.