Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కాలదన్నితే చేసిన త్యాగం ధూళిలో కలిసిపోదూ!' అని పాడుకున్నాడు సి.నా.రే. అవును కదా! చేసిన పనులు, త్యాగాలు ఎప్పటికీ వృధా కావు. కాకుంటే వాటిని కనపడకుండా చేసే ప్రయత్నాలు ఎన్నయినా జరుగొచ్చుగాక, వాటి ప్రభావాలను తొలగించలేరు. చెరిపేయలేరు. అయితే కొందరు పనిగట్టుకుని చరిత్రపై కూడా ముసుగేసి దాచాలనుకుంటారు. అవన్నీ విఫలమవ్వక తప్పదు. సమాజ పరిణామ క్రమంలో ప్రజలు, ఆ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే నాయకులు నిర్వహించిన పనులు, సేవలు, కొన్ని తరాలవరకూ ప్రభావశీలంగా పనిచేస్తుంటాయనే విషయం చరిత్రను అధ్యయనం చేసే ప్రతి ఒక్కరికి తెలిసినదే.
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కానీ పాల్గొన్న ప్రజల, నాయకుల త్యాగాలు ఇప్పటికీ ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. చేస్తాయి కూడా. ఎందుకంటే చరిత్ర గమనంలో అనివార్యపు ముందడుగులవి. ఆశయాలు, ఆశలు అవి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దేశంలో చేసిన పోరాటమయినా, తెలంగాణలో నిజాంకు, జాగీర్దార్లు, జమీందార్లకు వ్యతిరేకంగా చేసిన సాయుధ పోరైన దోపిడీ, అణచివేతల నుండి విముక్తి పొందాలని, స్వేచ్ఛగా ఊపిరులు తీయాలన్న లక్ష్యంతోనే చేసినవి. దోపిడీకి ఎదురుతిరిగిన ప్రతిసారీ హింసకు పూనుకోవటం దోపిడీదారుల సహజమైన లక్షణం. అందుకనే పోరాటంలో రక్తంపారింది. ఎందరో అమరులు తమ ప్రాణాలను ఎదురొడ్డి అసువులు బాసారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో ఝాన్సీలక్ష్మీబాయి, నానా సాహెబ్ తాంతియా తోపేలు, అనేకమంది సైనికులు, ఆ తర్వాత పోరాడిన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లు, అల్లూరి, ఖుదిరాంబోస్, సుభాస్‌చంద్రబోస్ మొదలైన మహామహుల వీరోచిత పోరాటాలు, త్యాగాల పునాదుల మీదనే ఈనాటి మన అమృతోత్సవ స్వాతంత్య్రం సిద్ధించింది. జీవితాలను దేశ స్వేచ్ఛ కోసం ధారపోసిన ఎందరో త్యాగధనుల ఫలమిది. ఆ స్వేచ్ఛే లేకపోతే ఇక ప్రజాస్వామ్యం గురించిన ప్రశ్న ఉదయించదు కదా! ఈనాటికీ ప్రశ్నించడానికి నాకు స్వేచ్ఛ ఉందని భావిస్తున్నామంటే, అది వారి త్యాగం వల్లనే అనేది నేటి తరం గుర్తుంచుకోవాలి.
ఇక తెలంగాణలో సైతం చారిత్రాత్మక రైతాంగ సాయుధ పోరాటంలో వేలాది మంది తమ ప్రాణాలను బలిచ్చి వెట్టిచాకిరిని, అణచివేతను, వివక్షతను, దోపిడీని పారద్రోలి, భాషా సాంస్కృతిక స్వేచ్ఛను పొందగలిగారు. సామాన్యులు, రైతు కూలీలు, చదువు సంధ్యలు పెద్దగా లేనివారయినప్పటికీ చరిత్రలో వారు నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని వీరోచితంగా సాగించారు. వారి త్యాగాల పునాదుల మీదనే నేటి కనీస ప్రజాస్వామికతను, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను మనం అనుభవిస్తున్నాము. దేశంలో రైతాంగం జరిపిన అనేక పోరాటాలు వర్లీ ఆదివాసుల పోరాటం, తెబాగా పోరాటం, మోప్లా, మలబారు తిరుగుబాట్లు ఈ దేశపు సామాన్యుల హక్కులను, బతుకును దేశపు ఎజెండాలోకి తీసుకువచ్చాయి. ఈ పోరాటాలలో అనేకమంది తమ జీవితాలను ధారపోసారు. అందుకనే భూసంస్కరణలు, కౌలుదారీ చట్టాలు, ఆదివాసీ అటవీహక్కులు మొదలైనవెన్నో మన స్వాతంత్య్రకాంక్షగా చర్చ జరిపి రాజ్యాంగంలో పొందుపర్చబడ్డాయి.
ఈ అన్ని పోరాటాల్లో త్యాగాలున్నాయి తప్ప మతాలు లేవు. లక్ష్యాలున్నాయి తప్ప మనుషుల మధ్య విభజనలు లేవు. ఆశయం ఉంది తప్ప విద్వేషం లేదు. అందరూ బతకాలన్న ఆశ తప్ప ఎవరికో దోచిపెట్టాలన్న ధ్యాస లేదు. పైన పేర్కొన్న పోరాటాల్లో కానీ, మొత్తంగా స్వాతంత్య్రోద్యమ సంగ్రామంలో కానీ మతతత్వవాదులకు ఏరకమయిన పాత్రాలేదు. అసలు వారసత్వమే లేదు. త్యాగాలలో వారి పాలులేకపోగా అక్కడ బ్రిటిష్ వాళ్ళకూ ఇక్కడ జమీందార్లకూ జాగీర్దార్లకు వంతపాడి ఘనతవహించిన నేటి దేశపాలకులు చరిత్రనూ, త్యాగాలను ఘోరంగా అవమానిస్తున్నారు. మసిపూసి మారేడుగాయ చేస్తున్నారు. నిర్లజ్జగా వాళ్ళు చేసే ప్రచారంలోని అబద్ధాలు, అసత్యాలు నేటితరం నిజమేనని నమ్మే ప్రమాదం ఉంది. దీని నుండి నేటితరానికి అవగాహన కలిగించటానికి చరిత్రకారులు, మేథావులు గొంతులు విప్పాల్సి ఉంది. ఈ రకమైన వక్రీకరణలను తిప్పికొట్టాల్సిన ప్రతిపక్షీయులు కూడా పెద్దగా నోరు విప్పకుండా మౌనం దాల్చటం మరింత దారుణమయిన విషయం.
అసత్యాలపై నిర్మించే ఏ సౌధమైన అందంగా కనపడ్డప్పటికీ కూలిపోక తప్పదు. త్యాగాల వారసత్వం నిలిచి వెలగటం అనివార్యం. ఈ నేలపైన కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా సామాన్యుల బతుకుకోసం ఆనాటి నుండి ఈ నాటివరకు నికరంగా నిలబడి నిరంతర సమరం సాగిస్తున్న కమ్యూనిస్టుల త్యాగం అపూర్వమైనది. ఎన్ని ఆటుపోట్లనైనా, సవాళ్ళనైనా ఎదుర్కొంటూ ముందుకు పోతున్న ఎర్రజెండా ప్రజలకు అండదండగా చరిత్ర నిండా అడగులు వేస్తూనే ఉంది.
త్యాగం అంటే ఈ రోజు తన పార్టీ అధినేత కొడుకు కోసమో, కూతరు కోసమో తన ఎమ్మెల్యే పదవినో, మంత్రి పదవినో, పార్టీ పదవినో వొదులుకోవడం, లేదా సీట్లను, కోట్లను వొదులుకోవడంగా మారి పోయింది. కానీ ఒక్కసారి చరిత్రను తిరగేయండి, వర్తమానాన్ని పరిశీలించండి. సీట్లు, ఓట్లు, పదవులు, వేటికీ సంబంధం లేకుండా స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం, హక్కులు కాపాడటం కోసం, దోపిడీకి వ్యతిరేకంగా పోరు చేస్తూ, నిర్బంధాలకు వెనుకాడని కమ్యూనిస్టులు చేస్తున్న త్యాగం అత్యంత విలువైనది.